
కర్నూలులో రోడ్డుపై ఉల్లిగడ్డలు పారబోసి రాస్తారోకో చేస్తున్న రైతులు
పెట్టుబడి మేర కూడా రాక తల్లడిల్లుతున్న రైతులు
కొంటామని మాటిచ్చి చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం
ఉల్లి, టమాటా, చీనీ రైతులు కన్నీటి పర్యంతం.. కోత ఖర్చులు వృథా అని పొలాల్లోనే పంటను వదిలేస్తున్న వైనం
సర్కారు తీరును నిరసిస్తూ కర్నూలులో ఉల్లి రైతుల ధర్నా.. ఇద్దరు ఉల్లి రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం
చావు బతుకుల మధ్య కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స
మరో వైపు ఉల్లి, టమాటా రైతులకు కిలోకు రూ.5–8 కూడా దక్కని దుస్థితి
బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.25–35.. టమాటా రూ.50.. చీనీ రైతుకు సగటున రూ.10 లోపే.. మార్కెట్‌లో మాత్రం రూ.50
దళారులకు చంద్రబాబు సర్కారు వత్తాసు
చంద్రబాబు కూటమి సర్కారు బహిరంగంగానే దళారులకు వత్తాసు పలుకుతోంది. ఫలితంగా అటు ఉల్లి, టమాటా, చీనీ రైతులకు పంట కోత ఖర్చులు సైతం రాని దుస్థితి నెలకొనగా, ఇటు బహిరంగ మార్కెట్‌లో మాత్రం అధిక ధరల మోత మోగుతోంది. రైతు బజార్లలో సైతం ఉల్లి, టమాటా ధరలు మండిపోతున్నాయి. ఇదేం వైపరీత్యం అంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు రైతులు, ఇటు వినియోగదారులకు ఏమాత్రం మేలు జరగకపోగా మధ్య దళారులు మాత్రం జేబులు నింపుకుంటున్నారు. అయినా ప్రభుత్వం చోద్యం చూస్తోందంటే.. ఇది దళారి రాజ్యం కాక మరేమవుతుంది?
సాక్షి, అమరావతి/కర్నూలు (అగ్రికల్చర్): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్, ఇంటర్నేషనల్ కేపిటల్.. ఎయిర్‌పోర్ట్, ఐకానిక్ బ్రిడ్జ్‌లంటూ పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేర్లు చెబుతూ డాబుసరి మాటలతో కాలం గడుపుతున్న చంద్రబాబు కూటమి సర్కారు కనీస విషయాలను గాలికొదిలేసి అటు రైతులు, ఇటు ప్రజలను నిలువునా ముంచేస్తోంది. వ్యవసాయ రంగానికి సంబంధించి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా దళారులకు వంత పాడుతోంది. ఫలితంగా గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రైతులు పండించిన పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కరువైంది.
మిరప మొదలుకొని టమాటా వరకు ఏ పంటకూ మద్దతు ధర దక్కక రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వర్షాభావం, అధిక వర్షాలు వంటి ప్రతికూల పరిస్థితుల్లో ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులు ఆదిలోనే ధరలేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అదునుకు విత్తనాలతో పాటు యూరియా అందించడంలో విఫలమైన టీడీపీ కూటమి ప్రభుత్వం.. ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ధరలు పతనమైనప్పుడు మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకొని రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోకుండా అసలేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది.
సీజన్ ఆరంభంలోనే ఉల్లితో పాటు టమాటా, బత్తాయి (చీనీ) పంటలకు మద్దతు ధర దక్కక రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. ఉల్లి, టమాటా రైతులకు కిలోకు రూ.5–8 కూడా దక్కని దుస్థితి నెలకొంది. బహిరంగ మార్కెట్‌లో మాత్రం కిలో ఉల్లి రూ.25–35.. టమాటా రూ.50కి పైగానే పలుకుతోంది. చీనీ రైతుకు కిలోకు రూ.10 లోపే అందుతుండగా.. మార్కెట్‌లో మాత్రం రూ.50 పలుకుతోంది.
పరిస్థితి ఇంత దారుణంగా మారడంతో కష్టాల సుడిగుండం నుంచి ఎలా బయట పడాలో తెలియక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ కర్నూలు జిల్లాలో ఇద్దరు ఉల్లి రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. చావు బతుకుల మధ్య కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మూణ్ణాళ్ల ముచ్చటగా ఉల్లి కొనుగోళ్లు
ఉల్లి కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం ఆదిలోనే చేతులెత్తేసింది. కర్నూలు మార్కెట్‌కు వస్తున్న ఉల్లిని క్వింటా రూ.400–500కు మించి కొనే పరిస్థితి లేకపోవడంతో పలువురు రైతులు పంటను మేకలు, గొర్రెలకు మేతకు వదిలేశారు. మరికొంత మంది రైతులు మార్కెట్‌కు తెచ్చిన ఉల్లిని మద్దతు ధర లేదని తెలుసుకుని రోడ్ల పక్కన పారబోసిపోతున్నారు. ఉల్లి రైతుల వెతలపై ఇటీవల ‘సాక్షి‘లో ప్రచురితమైన వరుస కథనాల నేపథ్యంలో చంద్రబాబు నేరుగా సమీక్ష చేసి క్వింటా రూ.1200 చొప్పున కొనుగోలు చేస్తామని గొప్పగా ప్రకటించారు.
రైతులు గిట్టుబాటు కాదని మొత్తుకున్నా అదే ధర ఇచ్చారు. రైతులు మార్కెట్‌కు తెచ్చే పంటకు ధర పెరిగే వరకు ఇదే ధరతో కొనుగోలు చేయాలని కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ ధరకు కూడా మూడు రోజుల పాటు తూతూ మంత్రంగా కొంత మేర మాత్రమే పంట కొనుగోలు చేసి.. తర్వాత చేతులెత్తేశారు. దీంతో ఉల్లికి కనీస మద్దతు ధర కల్పన మూణ్ణాళ్ల ముచ్చటగా మారిపోయింది.
రోడ్డునపడ్డ టమాటా
మరో వైపు టమాటా రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. సగటున కిలోకు రూ.8 కూడా రావడం లేదు. మార్కెట్ ధర మాత్రం భగ్గుమంటోంది. రైతు బజార్లలోనే రూ.35–40తో అమ్ముతున్నారు. నంద్యాల జిల్లా ప్యాపిలిలో టమాటా రైతులు రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రోడ్డు పక్కన పారబోసి పోయారు. డోన్, గుత్తి, అనంతపురం, ప్యాపిలి, పత్తికొండ ప్రాంతాల్లో ఈసారి దిగుబడి పర్వాలేదనిపించినా, ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 30–40 వేల బాక్సులు (ఒక్కో బాక్స్‌లో 25 కిలోలు) ప్యాపిలి మార్కెట్‌కు వస్తుంటాయి.
అంటే రోజుకు 500 నుంచి 1,000 టన్నుల వరకు సరుకు వస్తుంది. శుక్రవారం బాక్స్ రూ.150 పలికింది. అంటే కిలో రూ.6కు మించి పలకలేదు. దీంతో రైతులు తెచ్చిన పంటను రోడ్లపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. శనివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. శనివారం దాదాపు 20 వేల బాక్సులు మార్కెట్‌కు రాగా, రూ.150 చొప్పున ధర లభించింది. అయితే క్వాలిటీని బట్టి నిర్ధారించిన ధరలో తరుగు పేరిట కనీసం 10 శాతం కోత పెట్టి చెల్లిస్తుండడంతో రైతులు వ్యాపారులపై మండిపడుతున్నారు. అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లోని టమాటా మార్కెట్‌లలో శనివారం సగటున కిలోకు రూ.10లోపే ధర
లభించింది.
బత్తాయి రైతు డీలా
బత్తాయి రైతుల పరిస్థితి కూడా ఏమాత్రం బాగోలేదు. వైఎస్సార్ కడపతో పాటు అనంతపురం జిల్లాల్లో బత్తాయికి కనీస మద్దతు ధర దక్కడం లేదు. వైఎస్సార్ జిల్లాలో ఫస్ట్ క్వాలిటీ బత్తాయికి మాత్రమే క్వింటాకి రూ.1,520 దక్కుతుండగా, రెండో రకానికి రూ.900, థర్డ్ క్వాలిటీకి రూ.600కు మించి ధర లభించడం లేదు. అనంతపురం మార్కెట్‌లో ఫస్ట్ రకానికి రూ.1,600 దక్కుతుండగా, సెకండ్ క్వాలిటీకి రూ.1,200, థర్డ్ క్వాలిటీకి రూ.600–800 మధ్య ధర పలుకుతోంది.
మార్కెట్‌కు వచ్చే బత్తాయిలో మూడింట రెండొంతుల సరుకుకు క్వాలిటీ లేదనే సాకుతో క్వింటా రూ.600–800కు మించి చెల్లించని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఏ పట్టణంలో చూసినా బహిరంగ మార్కెట్‌లో బత్తాయి కిలో రూ.50కి తక్కువ లేదు. కానీ రైతుకు మాత్రం కిలోకు రూ.6–8 మధ్యే ధర లభించడం ఆందోళన కలిగిస్తోంది.
వచ్చింది 20 వేల క్వింటాళ్లు.. కొన్నది 4 వేల క్వింటాళ్లే
ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉల్లి క్రయవిక్రయాలు జరిగే ఏకైక మార్కెట్ కర్నూలు మాత్రమే. రాష్ట్రంలో పండించే ఉల్లిలో 90 శాతం ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే సాగవుతోంది. ప్రతి లాట్‌కు వ్యాపారులు ఈ–నామ్‌లో ధరలు కోట్ చేస్తారు. ఎవరు ఎక్కువ ధర వేస్తే వారికి లాట్ ఇస్తారు. ఉదాహరణకు క్వింటాకు రూ.800 ధర లభిస్తే.. మద్దతు ధరతో గ్యాప్ అమౌంటు రూ.400 ప్రభుత్వం రైతుల ఖాతాలకు విడుదల చేయాలి. అయితే ప్రభుత్వమే నేరుగా మార్క్‌ఫెడ్ ద్వారా రూ.1,200 ధరతో కొనుగోలు చేస్తే రైతులకు కమీషన్ భారం తగ్గుతుంది. ప్రభుత్వం చేతులెత్తేయడంతో గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు దిక్కు లేకుండా పోయింది.
దీంతో క్వింటా ఉల్లిని దళారులు రూ.400 ధరతో కొనేందుకు ముందుకొచ్చారు. ఈ ధరతో అమ్మితే ఎకరం పంటకు వచ్చే మొత్తం రూ.16 వేలు మాత్రమే. పెట్టుబడి మాత్రం ఎకరాకు రూ.80 వేలు అయ్యింది. ఈ లెక్కన పెట్టుబడిలో 20 శాతం కూడా రావడం లేదని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. శనివారం 302 మంది రైతులు 20 వేల క్వింటాళ్ల ఉల్లిని మార్కెట్‌కు తెచ్చారు. ప్రభుత్వ అనధికార ఆదేశాల మేరకు మార్క్‌ఫెడ్ ద్వారా ఉల్లి కొనుగోళ్లు ఆపేసింది. దీంతో వ్యాపారులు కేవలం 54 లాట్లకు సంబంధించిన 4,127 క్వింటాళ్లకు మాత్రమే తక్కువ ధరతో టెండర్లు వేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై రైతులు కర్నూలు మార్కెట్ యార్డు ఎదుట పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు.

అయ్యో ఎంత కష్టం.. ఎంత నష్టం!
కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం ఎరుకలచెరువు గ్రామానికి చెందిన మొలక బజారి అనే రైతు రెండు ఎకరాల్లో ఉల్లి పంటను సాగు చేశాడు. చీడపీడల నుంచి కంటికి రెప్పలా కాపాడుకుని పంట పండించాడు. పంట కోశాక.. మార్కెట్‌లో కనీసం కిలోకు రూ.5–6 కూడా రావడం లేదని తెలుసుకుని ఆందోళనకు గురయ్యాడు. రవాణా ఖర్చులు కూడా దండగ అని భావించి పంటను పొలంలోనే వదిలేయడంతో గొర్రెలకు ఆహారంగా మారింది. పంటసాగు కోసం పెట్టిన పెట్టుబడులు మట్టిలో కలిసిపోయాయి. – కృష్ణగిరి
వైఎస్ జగన్ హయాంలో అన్నదాతకు భరోసా
⇒ వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడమే కాకుండా, ధర లేని ప్రతీసారి మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ కింద మార్కెట్‌లో జోక్యం చేసుకొని ఆ పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఉల్లికి కనీస మద్దతు ధరను ప్రకటించింది.
⇒ బహిరంగ మార్కెట్‌లో ధర లేని సమయంలో ప్రభుత్వమే దాదాపు రూ.65 కోట్లు ఖర్చు చేసి దాదాపు 9025 టన్నుల ఉల్లిని సేకరించింది. ఈ ఉల్లిని రైతు బజార్ల ద్వారా సబ్సిడీ ధరలపై విక్రయించి అటు రైతులకు, ఇటు వినియోగదారులకు అండగా నిలిచింది. మరో వైపు ధరలు పెరిగిన సందర్భాల్లో షోలాపూర్ మార్కెట్ నుంచి ఉల్లి కొనుగోలు చేసి, సబ్సిడీపై రైతు బజార్ల ద్వారా సరఫరా చేసి వినియోగదారులకు ఊరట కలిగించింది.
⇒ ఇదే రీతిలో దాదాపు రూ.5.50 కోట్ల విలువైన 4,109 టన్నుల బత్తాయిని కొనుగోలు చేసి డ్వాక్రా సంఘాల సభ్యులకు సబ్సిడీ ధరకు పంపిణీ చేయించింది. రూ.18.02 కోట్ల విలువైన 8,460 టన్నుల టమాటాను సైతం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది.
⇒ ఇలా ఐదేళ్లలో 6.20 లక్షల మంది రైతుల నుంచి రూ.7,796.47 కోట్ల విలువైన 21.73 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి అన్నదాతకు భరోసా కల్పించింది. చరిత్రలో ఎన్నడూలేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన పత్తిని సైతం కొనుగోలు
చేసింది.
ఉల్లి.. సర్కారు లొల్లి
⇒ సీఎం డౌన్ డౌన్ అంటూ అన్నదాతల రాస్తారోకో
⇒ క్వింటాకు రూ.1,200 అని మాట తప్పిన ప్రభుత్వం
⇒ మద్దతు ధర కల్పించకపోవడంపై వెల్లువెత్తిన ఆగ్రహం
⇒ మద్దతు పలికిన వైఎస్సార్‌సీపీ నేతలు
కర్నూలు (అగ్రికల్చర్) : కూటమి ప్రభుత్వం ఉల్లిని మద్దతు ధరతో కొనుగోలు చేయలేక చేతులెత్తేయడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కర్నూలులో వందలాది మంది రైతులు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డెక్కారు. మార్కెట్ యార్డు ఎదురుగా ప్రధాన రహదారిలో ప్రభుత్వం తీరును నిరసిస్తూ రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించడం లేదంటూ రోడ్డుపై ఉల్లిపాయలు పారబోసి బైఠాయించారు. ఇటు ప్రభుత్వం మద్దతు ధరకు కొనక పోవడం, అటు వ్యాపారులు సైతం రేటు పెంచక పోవడంతో అన్నదాతలు తీవ్రంగా మండిపడ్డారు. మద్దతు ధరతో కొనుగోళ్లకు ప్రభుత్వం మంగళం పాడడంతో వ్యాపారులు కొనడానికి ముందుకు రాలేదు.
36 మంది వ్యాపారులు ఉండగా.. కేవలం 10 మంది మాత్రమే అదీ క్వింటా రూ.600తో కొనుగోళ్లు చేపట్టారు. దీంతో రైతులు రోడ్డుపై బైఠాయించి సీఎం డౌన్, డౌన్ అంటూ నినాదాలు చేశారు. కూటమి పార్టీలకు ఓట్లు వేసి గెలిపించినందుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నామని ధ్వజమెత్తారు. రైతుల ఆందోళనకు వైఎస్సార్‌సీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి మద్దతు పలికారు. రైతులతో పాటు రోడ్డుపై బైఠాయించి ఉల్లి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వ ప్రకటనతో తీవ్ర వ్యయ ప్రయాసలకు లోనై మార్కెట్‌కు వచ్చిన తర్వాత కొనుగోలు చేయకపోతే రైతుల పరిస్థితి ఏమిటని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. క్వింటా రూ.2500తో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ‘ఉల్లిని ప్రభుత్వం కొనలేదు.. వ్యాపారులతోనే కొనిపించండి’ అంటూ ప్రభుత్వం మార్కెట్ కమిటీకి ఆదేశాలు ఇవ్వడాన్ని బట్టి చూస్తే రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థం అవుతోందన్నారు. కాగా, ఆదివారం కొనుగోళ్లు కొనసాగేలా చర్యలు తీసుకుంటామని మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు.
చెప్పేదొకటి.. చేస్తోంది మరొకటి
కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం ఈర్లదిన్నె గ్రామానికి చెందిన జమ్మన్న మూడు ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశారు. ఎకరాకు పెట్టుబడి రూ.లక్ష వరకు పెట్టారు. ప్రభుత్వం క్వింటా రూ.1,200 చొప్పున కొంటుందని ప్రకటించడంతో మార్కెట్‌కు 249 ప్యాకెట్ల ఉల్లి తెచ్చారు. ఈ ధరతో కాదు కదా.. ఇందులో సగం ధరతో కూడా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇక్కడికొచ్చిన రైతులందరిదీ ఇదే దుస్థితి. ఎవరిని కదిలించినా ఈ ప్రభుత్వం చెప్పేదొకటి.. చేస్తోంది మరొకటని కన్నీటిపర్యంతమవుతున్నారు.
అప్పుల బాధ తాళలేక ఇద్దరు రైతుల ఆత్మహత్య
వెల్దుర్తి/రుద్రవరం: రాష్ట్రంలో అప్పుల బాధతో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. శనివారం వేర్వేరు చోట్ల ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం ఎస్.పేరేములకు చెందిన ముంత మద్దిలేటి(50) తన 2 ఎకరాలతో పాటు మరో 6 ఎకరాలు కౌలుకు తీసుకుని కంది పంట సాగు చేస్తున్నాడు. పెట్టుబడుల కోసం మొత్తం రూ.6 లక్షలు అప్పులు చేశాడు. గతేడాది పత్తి, ఆముదాలు వేసి దిగుబడి రాక, గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయాడు. ఈ నేపథ్యంలో అప్పులు తీర్చే దారి కానరాకపోవడంతో శుక్రవారం రాత్రి ఇంట్లో దూలానికి ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
ఇదిలా ఉండగా, నంద్యాల జిల్లా రుద్రవరం మండలం కోటకొండకు చెందిన జంగిటి నారాయణ(46) తన ఐదెకరాలకు తోడు, మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నాడు. రెండేళ్లుగా దిగుబడులు సరిగా రాక, వచి్చనా ప్రభుత్వం గిట్టబాటు ధర కలి్పంచకపోడంతో రూ.20 లక్షల దాకా అప్పు అయ్యింది. దీంతో తీవ్ర మనోవేదనతో గతనెల 28న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య లక్ష్మీదేవి, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.
ఇద్దరు ఉల్లి రైతుల ఆత్మహత్యాయత్నం
సి.బెళగల్: ఉల్లి పంటకు కనీస ధర కూడా దక్కని దుస్థితిలో కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం పోలకల్‌లో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు యత్నించారు. గ్రామంలోని బీసీ కాలనీలో నివాసముంటున్న గుండ్లకొండ కృష్ణ (34) తన రెండెకరాల పొలంలో ఉల్లి సాగు చేశాడు. ఒక ఎకరంలో 120 బస్తాల పంట గత వారం చేతికి వచ్చింది. అయితే మార్కెట్‌లో కనీస మద్దతు ధర లభించడం లేదని తెలిసి ఆవేదన చెందాడు. అప్పటికే పెట్టుబడికి చేసిన అప్పులు అధికమవడంతో మరో ఎకరంలోని పంట కోత చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పొలంలోనే వదిలేశాడు. దాదాపు రూ.8 లక్షల వరకు అప్పులు పెరగడంతో తీవ్ర మనస్తాపం చెందాడు.
ఇదే గ్రామానికి చెందిన మరో రైతు వెంకట్‌నాయుడు (25) తనకున్న రెండు ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశాడు. ఎకరం పంట కోతకు రావడంతో గత వారం కోతలు చేపట్టి, తన సమీప బంధువు కృష్ణ దిగుబడులు ఉంచిన దగ్గరే నిల్వ చేశాడు. ధరలు లేక మరో ఎకరం పొలంలో కోతకు వచ్చిన పంటను అలానే వదిలేశాడు. ఇప్పటికే దాదాపు రూ.6 లక్షల వరకు అప్పులు ఉండగా, పంట నష్టాలతో రూ.7 లక్షలకు పైగా అప్పులు పెరుగుతున్న నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. ఇద్దరూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు.
సీఎం చంద్రబాబు ఉల్లి రైతులను ఆదుకోవడం లేదని అందుకే తాము ప్రాణాలు తీసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అనంతరం పురుగుల మందు తాగారు. ఇరు కుటుంబాల వారు బాధితులిద్దరినీ వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి బాధిత రైతులను శనివారం ఆస్పత్రిలో పరామర్శించారు.