
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పీజీ విద్యలో ప్రవేశాల కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్యామండలి ఆదివారం కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ప్రభుత్వం వర్సిటీల నుంచి డిగ్రీ ఫలితాలు విడుదల, సర్టీఫికెట్ల జారీ సమన్వయం చేయడంలో విఫలం కావడంతో కౌన్సెలింగ్ ఆలస్యమైంది. దీనికి తోడు చాలా చోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు నిలిచిపోవడంతో కళాశాలలు విద్యార్థులకు సర్టీఫికెట్లు మంజూరు చేయలేదు. ఫలితంగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అవాంతరాలు ఎదుర్కొన్నారు. దీనికి తోడు పీజీ కౌన్సెలింగ్‌ను ఉమ్మడిగా కాకుండా వర్సిటీల వారీగా చేపట్టుకునేందుకు అవకాశమివ్వాలని వీసీలు కోరడంతో ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి జూలై మూడో వారంలో లేఖ రాసింది.
నెలపాటు ఆ లేఖకు ప్రభుత్వం స్పందించకుండా ఇటీవల పాత పద్ధతిలోనే కౌన్సెలింగ్ కొనసాగించాలని సూచించింది. కన్వినర్ నియామకం విషయంలో ఉన్నత విద్యా మండలికి, పీజీ సెట్ నిర్వహించిన వెంకటేశ్వర వర్సిటీకి మధ్య సమన్వయ లోపం ఏర్పడింది. ఫలితంగా కన్వినర్ నియామకం ఆలస్యమైంది. మరోవైపు వెంకటేశ్వర వర్సిటీ కౌన్సెలింగ్ నిర్వహణకు ఆసక్తి చూపని కారణంగా మరో వర్సిటీకి ఆ బాధ్యతలు అప్పగించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. చాలా వర్సిటీలు పీజీ కళాశాలకు అఫిలియేషన్ మంజూరు నత్తనడకన సాగడంతో కౌన్సెలింగ్ నోటిఫికేషన్ ప్రక్రియ ముందుకు సాగలేదు. దీనిపై ఉన్నత విద్యా మండలి వర్సిటీల వారీగా రిజి్రస్టార్లతో సమావేశమై వేగంగా కళాశాలలకు అఫిలియేషన్ మంజూరు చేయాలని ఆదేశించింది.
యూజీ ఆయుష్ ప్రవేశాలకు నోటిఫికేషన్
యూజీ ఆయుష్ కోర్సుల్లో కన్వీనర్ కోటా ప్రవేశాలకు శనివారం ఆరోగ్య వర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చింది. నీట్ యూజీ అర్హత సాధించిన విద్యార్థులు సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ నెల 16వ తేదీ రాత్రి 9 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 2,950, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 2,360 దరఖాస్తు రుసుము చెల్లించాలి. వివరాలకు 9000780707, 8008250842 నంబర్లను సంప్రదించాలి.