జగన్‌పై కక్ష.. చిన్నారులకు శిక్ష | Harassment by not releasing funds to multi super specialty hospitals | Sakshi
Sakshi News home page

జగన్‌పై కక్ష.. చిన్నారులకు శిక్ష

Sep 26 2025 5:56 AM | Updated on Sep 26 2025 6:07 AM

Harassment by not releasing funds to multi super specialty hospitals

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో గుండె చికిత్సల కోసం ప్రారంభించిన చిన్నపిల్లల ఆసుపత్రి ..నేడు నిధులు లేక ఆగిపోయిన దృశ్యం

చిన్నపిల్లల ఆసుపత్రికి గ్రహణం  

మల్టీ సూపర్‌ స్పెషాలిటీపై చిన్నచూపు 

నిధులు విడుదల చేయకుండా వేధింపులు 

వైఎస్‌ జగన్‌ మానసపుత్రికని ఆసుపత్రిపై అక్కసు 

నెలల తరబడి సాగదీస్తున్న భవన నిర్మాణ పనులు 

2024 జూలైలో ప్రారంభించాలని సంకల్పించిన నాటి ప్రభుత్వం 

పనులు పూర్తి చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్న టీటీడీ

తిరుపతి తుడా :  తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి చిన్నపిల్లలును కాపాడి ఆరోగ్యవంతమైన భావితరాన్ని ఆవిష్కరించేందుకు తిరుపతి లో శ్రీవారి పాదాల చెంత అలిపిరి సమీపంలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని స్థాపించాలని నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సంకల్పించారు. రాష్ట్రంలో చిన్న పిల్లల కోసం కార్పొరేట్‌ స్థాయి ఉచిత వైద్యాన్ని అందించే ఆసుపత్రి ఇప్పటి వరకు లేదు. ఆ లోటును అధిగమిస్తూ మొత్తం 15 రకాల ప్రత్యేక విభాగాల సామర్థ్యంతో అత్యాధునిక వైద్య సేవలను అందించాలని భావించారు. 

ఈ ఆసుపత్రి తన మానస పుత్రికగా ప్రకటిస్తూ 2022 మే 5వ తేదీన శ్రీవారి పాదాల చెంత అలిపిరి సమీపంలో భూమి పూజ చేశారు. రెండేళ్ల లో భవన నిర్మాణాలు పనులు పూర్తి చేసుకుని, వైద్య పరికరాలు కొనుగోలు, సిబ్బంది నియామకం ప్రక్రియ పూర్తి కావాలని టీటీడీ అధికారులను ఆదేశించారు. ఇందుకు తగ్గట్టే 2024 జూలైలో ఆసుపత్రిని ప్రారంభించేలా టీటీడీ సైతం యుద్ధ ప్రాతిపాదికన పనులను దాదాపుగా పూర్తి చేసింది.  

15 విభాగాలతో ... 
చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని 15 విభాగాలతో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలానే అవయవ మార్పిడి, ఇతర అత్యవసర వైద్య సేవల కోసం భవనంపై హెలీప్యాడ్‌ను నిర్మించాలని, ఆ దిశగా డిజైన్‌ చేశారు. ఈ ఆసుపత్రిలో చిన్నపిల్లల కార్డియాలజీ, న్యూరాలజీ ,న్యూరో సర్జరీ, పల్మనాలజీ, ఆర్థో, ఆంకాలజీ వంటి మొత్తం 15 ప్రత్యేక విభాగాలను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు. అత్యాధునిక ఐసీయూ, ఆర్‌ఐసీయూ, 8 ఆపరేషన్‌ థియేటర్లు, ఎంఆర్‌ఐ, సిటీ యంత్రాలు, ఆధునిక ల్యాబ్‌ ఉండేలా ప్రణాళికలు చేశారు. 

పాలక మండలిలో భిన్నాభిప్రాయాలు 
ఈ ఆస్పత్రి పూర్తి చేసే విషయంలో టీటీడీ పాలక మండలి వేర్వేరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పాలకవర్గ అధిపతిగా ఉన్న వ్యక్తితో పాటు మరో నలుగురు ఆస్పత్రి పట్ల వ్యతిరేకతతో ఉన్నట్లు సమాచారం. కోట్లాది రూపాయల భారం టీటీడీ ఎందుకు భరించాలంటూ ఆ ఐదుగురు ఆసుపత్రిని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ఆసుపత్రి నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ బురదజల్లి  ఆసుపత్రిని అడ్డుకుందామంటూ చర్చించినట్లు తెలుస్తోంది. 

అయితే ఎక్కువ మంది బోర్డు సభ్యులు వైద్యం కోసం టీటీడీ ఎంత ఖర్చు పెట్టినా తప్పేమీ లేదని, ముఖ్యంగా చిన్న పిల్లలకు సంబంధించిన ఆసుపత్రి కాబట్టి వెంటనే నిధులు మంజూరు చేసి పనులు పునః ప్రారంభించేలా చొరవ తీసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందంటూ కుండలు బద్దలు కొడుతున్నారు. అయినా ఆ వ్యక్తి మనసు కరగకపోవడంపై బోర్డు సభ్యులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఆసుపత్రిని పూర్తి చేయకపోతే కూటమి ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకత తప్పదని, దేవుడితో సమానమైన చిన్న పిల్లల విషయంలో మీనమేషాలు లెక్కించడం మంచిది కాదని జిల్లాకు చెందిన కొంతమంది టీటీడీ బోర్డు సభ్యులు తెగేసి చెప్పినా ఆ వ్యక్తి  మాత్రం వినీ విననట్లు వదిలేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చిన్నపిల్లల ఆసుపత్రి విషయంలో ఇంతలా పట్టుబట్టడం మంచిది కాదని టీటీడీ అధికారులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు.  

నిధులు మంజూరు కాకుండా అడ్డుపడి..
ఆస్పత్రి నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభించారు. అంతే వేగంగా పనులు చకచకా సాగిపోయా యి. అంతలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన నిధులతో 2024 చివర వరకు పనులు కొనసాగాయి. టీటీడీ పాలకవర్గం బాధ్యతలు చేపట్టింది. టీటీడీలో నిర్మిస్తున్న పలు భవనాలను సందర్శించింది. ఈ క్రమంలో చిన్న పిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి భవనాన్ని సందర్శిస్తూ టీటీడీకి ఇంత భారం అవసరమా అంటూ పాలకవర్గంలోని ఓ ముఖ్యమైన వ్యక్తి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

అయితే కొంత మంది బోర్డు సభ్యులు కలగజేసుకొని చిన్న పిల్లల వైద్యం కోసం టీటీడీ ఖర్చు చేయడం ఏ మాత్రం తప్పు కాదని, పనులు పూర్తి చేయకపోతే చెడ్డపేరు వస్తుందని ఆ వ్యక్తికి సూచించారు. భవన నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ సమయంలో ఆసుపత్రిని అర్ధాంతరంగా వదిలేస్తే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత తప్పదని ఒకరిద్దరు బోర్డు సభ్యులు హెచ్చరించారు. 

ఆ ముఖ్యమైన వ్యక్తి అయిష్టంగానే అంగీకరించినా ఆపై తన వక్రబుద్ధిని ప్రదర్శించారు. ఆసుపత్రి నిర్మాణానికి ఎక్కువ నిధులు కేటాయించారంటూ నిధులు మంజూరు కాకుండా అడ్డు పడ్డారు. గడిచిన ఏడెనిమిది నెలలుగా నిధులు మంజూరు చేయకుండా చక్రం తిప్పారు. దీంతో పనులను అర్ధాంతరంగా ఆగిపోయాయి. 

ఆసుపత్రి పేరు : శ్రీ పద్మావతి చిన్నపిల్లల మల్టీ సూపర్‌ స్పెషాలిటీ 
నిర్వహణ బాధ్యత : టీటీడీ 
వైద్య సేవలు : పూర్తిగా ఉచితం 
ఆసుపత్రి నిర్మాణ వ్యయం : రూ.320 కోట్లు 
ఆస్పత్రి విస్తీర్ణం : 4 లక్షల 11 వేల 325 చదరపు అడుగులు 
అంతస్తులు : ఆరు 
బెడ్ల సామర్థ్యం :  350 
ఆసుపత్రిలో విభాగాలు : మొత్తం 15 
ఆసుపత్రి ప్రత్యేకత : అత్యవసర వైద్య సేవలు కోసం భవనంపైనే హెలిప్యాడ్‌ నిర్మాణం

ఇదీ అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ మాట 
‘రాష్ట్రంలో చిన్న పిల్లలు ఎవరూ ఖరీదైన వైద్యం అందక మృతి చెందకూడదు. తన బిడ్డను అనారోగ్యం నుంచి కాపాడుకోలేకపోయాను అన్న బాధ ఏ తల్లి పడకూడదు. భావితరాల యువతను ఆరోగ్యంగా అందించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుంది. ఖరీదైన వైద్యం ఉచితంగా అందించే బాధ్యత తీసుకుంటున్నాం. 

ఎంత ఖర్చైనా , ఎలాంటి వ్యాధి అయినా సరే పిల్లలను రక్షించుకోవడం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బాధ్యత. అనారోగ్య సమస్యతో ఏ ఒక్కరూ పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా ప్రపంచ స్థాయి వైద్య ప్రమాణాలతో చిన్నపిల్లల కోసం శ్రీ పద్మావతి చిన్నపిల్లల మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నాం. రెండేళ్లలో ఈ ఆసుపత్రి ప్రారంభించుకొని పిల్లలకు పునర్జన్మను ప్రసాదించే దేవాలయంగా కొనసాగుతుంది’ అని నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఉద్ఘాటించారు.

కార్డియాక్‌ సెంటర్‌తోనే ప్రేరణ
అభం శుభం తెలియని పసిపిల్లలు గుండె సమస్యతో బాధపడుతూ మృత్యువాత పడుతున్న విషయాన్ని గుర్తించిన నాటి సీఎం వైఎస్‌ జగన్‌ తిరుపతిలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల కార్డియాక్‌ కేర్‌ సెంటర్‌ను 2022లో ప్రారంభించారు. ఈ ఆసుపత్రి అనతి కాలంలోనే ప్రాచుర్యం పొందింది. వేల మందికి గుండె సంబంధిత సమస్యలను పరిష్కరించి పిల్లల పాలిట సంజీవినిగా మారింది. ఇప్పటి వరకు 20 మందికి గుండె మార్పిడి చికిత్సలను విజయవంతంగా అందించింది. పొరుగు రాష్ట్రాల నుంచి కాక బంగ్లాదేశ్‌ నుంచి సైతం వచ్చి ఇక్కడ గుండె సంబంధిత వైద్య సేవలను ఉచితంగా పొందారు. 

ఈ ఆసుపత్రి పురు డు పోసుకున్న అనతి కాలంలోనే సత్ఫలితాలు వచ్చాయి. ఇదే ప్రేరణతో చిన్న పిల్లలకు గుండె సంబంధిత వైద్యమే కాదు మొత్తం 15 రకాల ప్రత్యేక విభాగాలతో ప్రపంచ స్థాయి వైద్య ప్రమాణాలతో సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అవసరమని భావించారు. ఈ బాధ్యతను టీటీడీకి అప్పగించారు. చక చకా అనుమతులు పొంది 2022 మే 5వ తేదీన ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు. 

వైఎస్‌ జగన్‌కు  పేరొస్తుందనే.. 
నాటి సీఎం వైఎస్‌ జగన్‌ తన మానస పుత్రికగా ప్రకటించి చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని పట్టాలెక్కించారు. రాష్ట్రంలో ఎక్కడైనా విధంగా ప్రపంచ స్థాయి వైద్య ప్రమాణాలతో ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తే వైఎస్‌ జగన్‌కు పేరొస్తుందనే అక్కసుతోనే పనులను కొనసాగించకుండా నేటి ప్రభుత్వంలోని కూటమి నేతలు అడ్డుకట్ట వేశారు. ఆసుపత్రిని పూర్తి చేయకుండా కాకమ్మ కథలు చెబుతూ కాలయాపన చేస్తున్నారు.

నిధులు మంజూరు చేయకుండా పనులను కొనసాగకుండా టీటీడీ బోర్డులోని ముఖ్యమైన వ్యక్తి అడుగడుగునా అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. ఏడాది క్రితమే ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకు రావాల్సి ఉండగా మరో రెండేళ్ల పాటు సాగదీసి ఆపై నిర్ణయం తీసుకునేందుకు కుట్రలు పన్నుతున్నట్లు తెలుస్తోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement