కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
కేవీబీపురం: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేవీబీపురం మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ నరేష్ కథనం మేరకు.. మండలంలోని కాట్రపల్లి ఎస్టీ కాలనీకి చెందిన చంబేటి సుధాకర్ (30)కు అదే మండలం ఆదరం ఎస్టీ కాలనీకి చెందిన సుగుణతో 16 సంవత్సరాల కిందట వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. భార్యాభర్తల మధ్య అనైక్యత చోటు చేసుకుని కొంతకాలంగా గొడవలు పడేవారు. ఇందులో భాగంగా బుధవారం సుగుణ భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్లింది. భర్త సుధాకర్ అత్తగారింటికి వెళ్లి భార్యతో మళ్లీ గొడవ వేసుకుని, తీవ్ర మనస్తాపంతో ఇంటికి వచ్చి పురుగుమందు తాగాడు. గుర్తించిన గ్రామస్తులు 108 ద్వారా శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్‌ఐ నరేష్ తెలిపారు.
జిల్లాల పునర్విభజన
నోటిఫికేషన్ జారీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాల పునర్విభజన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం గురువారం జారీచేసింది. ఈ మేరకు జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించిన వివరాలను ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ ఉత్తర్వుల ప్రకారం ఇప్పటి వరకు పలమనేరు రెవెన్యూ డివిజన్‌లో ఉన్న బంగారుపాళెం మండలాన్ని చిత్తూరు రెవెన్యూ డివిజన్‌లోకి మార్పు చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా చిత్తూరు జిల్లాలో ఉన్న పలమనేరు రెవెన్యూ డివిజన్‌లోని చౌడేపల్లి, పుంగనూరు మండలాలను కొత్తగా ఏర్పాటవుతున్న మదనపల్లి జిల్లాలోని మదనపల్లి రెవెన్యూ డివిజన్‌లోకి మార్పు చేశారు. అదేవిధంగా జిల్లాలోని పలమనేరు రెవెన్యూ డివిజన్‌లో ఉన్న సదుం, సోమల మండలాలను కొత్తగా ఏర్పాటవుతున్న మదనపల్లి జిల్లాలోని పీలేరు రెవెన్యూ డివిజన్‌లోకి మార్పు చేశారు. ఈ మేరకు ప్రజల సమాచారం కోసం జిల్లా గెజిట్‌లో నోటిఫికేషన్‌లో ప్రచురించాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీని ప్రభుత్వం ఆదేశించింది.


