చంద్రన్న మాటలు.. రామన్న గొంతులో..
తిరుపతి మంగళం : తిరుమల పరకామణి కేసులో భూమన పరిస్థితి తేలు కుట్టిన దొంగలా ఉందంటూ చంద్రన్న మాటలను రామన్న గొంతుకలో వినిపించారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. గురువారం భూమన కరుణాకరరెడ్డి తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. భూమన పరిస్థితి తేలు కుట్టిన దొంగలా ఉందని, పరకామణి కేసులో ప్రధానమైన దొంగ అని చెబుతూ ఆ నిందితుడు రవికుమార్ ఇచ్చిన ఆస్తులను చాలా తక్కువ లీజుకు ఇచ్చానని, తన కుటుంబ సభ్యులతో నిందితుడు ఎన్నోసార్లు ఫోన్లో మాట్లాడారని, ఆ కోణంలో కూడా పరిశీలన చేయాలని వర్లా రామయ్య చెప్పారన్నారు. అయితే చంద్రబాబు మాటలను రామయ్య గొంతుకలో వినిపించారని చాలా స్పష్టంగా అర్థమైందన్నారు. తనను పరకామణి కేసులో ఎలాగైనా ఇరికించి, జైలుకు పంపాలన్న తపన, ఆరాటం చంద్రబాబుతోపాటు టీడీపీ నాయకుల్లో చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఏ కేసులో ఇరికించాలనుకుంటున్నా కుదరడం లేదన్న ఆలోచన, ఆవేదన వారిలో నెలకొందన్నారు. తాను పరకామణి కేసులో తప్పు చేసి ఉంటే ఏ విచారణకై నా, ఏ శిక్షకై నా సిద్ధమని భూమన స్పష్టం చేశారు. చిలిపి రామన్న ఉబలాటమంతా తప్పనిసరిగా చంద్రబాబు మాటలన్నారు. బాబు మాటలను రామన్న గొంతుకలో వినిపించారో ఆ రకంగా కూడా తనపై విచారణ జరిపించాలని సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యాన్నార్‌కు భూమన విజ్ఞప్తి చేశారు. నిజాలు బయట పడేంతవరకు వీళ్లు ఇలాగే మాట్లాడుతుంటారని, ఈ విచారణ కూడా బూటకమంటూ మీపై కూడా నిందారోపణలు చేస్తారని సీఐడీ డీజీకి విజ్ఞప్తి చేశారు.


