విహంగాల విడిదిల్లు..నేలపట్టు
పక్షుల కేంద్రంలో విడిది చేస్తున్న గూడబాతులు
పుల్లలు సేకరించే పనిలో గూడ బాతు
విహంగాల రాక..
వ్యవసాయ సూచిక..
పక్షుల కేంద్రానికి వలస విహంగాల రాక మొదలైతే ఇక్కడ వర్షాలు కురవడం మొదలవుతుందని రైతుల నమ్మకం. రైతులు చెబుతున్న ప్రకారం కార్తిక మాసంలో పక్షులు విచ్చేసి, జత కట్టి గూళ్లు కట్టుకుంటాయి. మార్గశిరంలో గుడ్లు పెట్టి పుష్య మాసంలో పిల్లలను పొదిగి మాగ, పాల్గుణ, చైత్ర మాసాల్లో పెంచి పెద్దవి చేస్తాయి. వైశాఖంలో ఆయా దేశాలకు వెళ్లిపోతాయి. ఇదే తరహాలో ఈ ప్రాంతంలో కార్తీక మాసంతో వరి సాగు పనులు మొదలై విహంగాల సంతానం అభివృద్ధి పూర్తి అయ్యా సరికి కోతలు పూర్తవుతాయి.
నేలపట్టు వాటికి విడిదికి పట్టు. ఏటా కార్తీక మాసంలో వస్తాయి.. వైశాఖంలో తిరిగి వెళతాయి. ఖండాలు దాటి ఇక్కడికి రావడానికి అలసిపోయినా ఈ ప్రాంతానికి చేరుకోగానే ఇక్కడి వాతావరణం, ఆవాసం చూసి, అవన్నీ మర్చిపోతాయి. ఇక్కడ సంతానోత్పత్తికి అనువుగా ఉండడంతో ఏళ్లుగా వస్తున్నాయి. ఈ ఏడాదీ వలస విహంగాలు పక్షుల రక్షిత కేంద్రంలో సందడి చేస్తున్నాయి.
దొరవారిసత్రం: ఖండాంతరాలు దాటి వేల కిలోమీటర్లు ప్రయాణించి నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రానికి విచ్చేసే విదేశీ శీతకాల వలస విహంగాలు కేంద్రం పరిధిలోని నేరేడు, మారేడు, అత్తిగుంట చెరువుల్లోని కడప చెట్లుపై గుడ్లు పెట్టి పిల్లలను పొదిగి విడిది చేస్తూ సమీపంలోని పులికాట్ సరస్సులో చేపలను వేటాడి జీవనం సాగిస్తాయి. ప్రస్తుతం వేల సంఖ్యలో నత్తగుళ్లకొంగలు, గూడబాతులు, తెల్లకంకణాయిలు వందల సంఖ్యలో స్వాతికొంగలు, నీటికాకులు, తెడ్డుముక్కు కొంగలు, నైట్ హేరన్ తదితర విదేశీ పక్షులు విడిది చేస్తున్నాయి. ఇక్కడకు విచ్చేసిన వలస విహంగాలు ఆడ, మగ పక్షులు స్నేహం కుదుర్చుకుని కడప చెట్లపై పుల్లలతో గూళ్లు కట్టుకునే పనిలో కొన్ని నిమగ్నమై ఉండగా తొలుత విచ్చేసిన నత్తగుళ్లకొంగలు మాత్రం గుడ్లు పెట్టే పనిలో ఉన్నాయి. వీటిని వీక్షించేందుకు పక్షి ప్రేమికులు, సందర్శకులు రాక ఇప్పటికే మొదలైంది. వివిధ ప్రాంతాలకు చెందిన వందలాది మంది సందర్శకులు, పాఠశాల విద్యార్థులు పోటీ పడి విహంగాలను తిలకిస్తున్నారు. ప్రస్తుతం పక్షుల కేంద్రంలో గూడబాతులు(పెలికాన్స్) 1,350 పైగా, నత్తగుళ్లకొంగలు(ఓపెన్ బిల్‌స్టార్క్స్) 2,500, నీటికాకులు(కార్మోరెంట్స్) 1,130, తెల్లకంకణాయిలు(వైట్‌ఐబీస్) 1,450, తెడ్డుముక్కు కొంగలు(స్పూన్‌బిల్స్) 110, స్వాతికొంగలు 500, పదుల సంఖ్యలో పాముమెడ పక్షులు(డాటర్స్), బాతు జాతికి చెందిన పలు రకాల పక్షుల పదుల సంఖ్యలో విడిది చేస్తున్నాయి. ప్రస్తుతం పక్షుల కేంద్రంలో 7 వేలకు పైగా వివిధ రకాల పక్షులు 2,874 గూళ్లలో విడిది చేస్తున్నట్లు స్థానిక వన్యప్రాణి విభాగం అధికారులు తెలిపారు.
చిన్నారుల కోసం..
కేంద్రానికి విచ్చేసే చిన్నారులను ఆకట్టుకునేలా పక్షుల కేంద్రం మార్గం మధ్యలో జింకల పార్కు, పంజరంలో విదేశీ చిలుకలను ఉంచారు. ఇవి పిల్లలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే పిల్లల ఆట పాటల కోసం పార్కును అభివృద్ధి పరిచారు. విద్యార్థులకు విజ్ఞానం పెంపొందిచేలా పర్యాటవరణ కేంద్రం, విదేశీ వలస విహంగాల జీవన శైలి చిత్రాలు ఏర్పాటు చేశారు.
నత్తగుళ్లకొంగలు
ఆహారవేటలో వలస విహంగాలు
రైతులకు పరోక్షంగా..ప్రతేక్షంగా..
పక్షుల కేంద్రంలో విడిది చేసే విహంగాలు కేంద్రం చుట్టు పక్కల గ్రామాల్లోని రైతులకు పరోక్షంగా, ప్రత్యేక్షంగా ఎంతగానో మేలు చేస్తున్నాయి. వీటి రాకమొదలైతే ఈ ప్రాంతంలో వర్షాలు కురుస్తాయి. దీంతో విహంగాలను దేవతాపక్షులుగా రైతులు పిలుస్తారు. ముఖ్యంగా నేలపట్టు పక్షుల కేంద్రంలో చెరువుల్లో విడిది చేయడంతో అవి వేసే రెట్ట చెరువు నీటిలో కలుస్తుంది. ఆ నీటినే నేలపట్టు, మైలాంగం గ్రామాల్లోని రైతులు పంటలకు సాగుకు వినియోగిస్తారు. ఈ నీటిలో గంఽథకం, పొటాష్ వంటి పదార్థాలు పుష్కలంగా ఉండడంతో రైతులు వేసిన పంట ఏపుగా పెరిగి అధిక దిగుబడులు వచ్చేందుకు పక్షుల పరోక్షంగా దోహద పడుతున్నాయి. అలాగే దుక్కి దున్నినప్పటి నుంచి పంటలు కోతకు వచ్చే వరకు కేంద్రంలోని విహంగాలు పంటలపై గుంపులు గుంపులుగా వాలిపోయి పంటకు నష్టం కలిగించే క్రిమికీటకాలను ఆహారం తీసుకుని, రైతులకు ప్రత్యేక్షంగా మేలు చేస్తున్నాయి.
పక్షుల కేంద్రం ఏర్పడిందిలా..
నేలపట్టు పక్షుల కేంద్రం 458.92 హెక్టార్లులో విస్తరించి ఉంది. 1970లో పక్షి శాస్త్రవేత్త డాక్టర్ సలీంఅలీ కేంద్రాన్ని గుర్తించి పరిశోధించారు. 1976లో పక్షుల రక్షిత కేంద్రంగా గుర్తించడంతో వన్యప్రాణి విభాగం అధికారులు సంరక్షిస్తున్నారు. తొలుత పక్షుల కేంద్రం నెల్లూరు సబ్ డివిజన్ పరిధిలో ఉండేది. 1984–85లో సూళ్లూరుపేట సబ్ డివిజన్‌గా ఏర్పాటు చేశారు. 30 ఏళ్లు కిందట పక్షుల కేంద్రంలో 36 రకాల విదేశీ పక్షుల వచ్చి విడిది చేసేవి. క్రమేపి పక్షి జాతుల సంఖ్య తగ్గుతూ ప్రస్తుతం సుమారు 16 జాతుల పక్షులు కేంద్రంలో విడిది చేసి సంతానం అభివృద్ధి చేసుకుంటున్నాయి. ప్రతి ఏటా 6 నుంచి 7 వేలు వరకు వివిధ రకాల విదేశీ విహంగాలు ఇక్కడకు విచ్చేసి వాటి వాటి సంతానాన్ని అభివృద్ధి చేసుకుని వెళ్లుతున్నట్లు స్థానిక వన్యప్రాణి విభాగం అధికారులు తెలిపారు.
విహంగాల విడిదిల్లు..నేలపట్టు
విహంగాల విడిదిల్లు..నేలపట్టు


