బెదిరించి.. బుక్కయ్యాడు!
భాకరాపేట: ‘‘హలో.. నాపేరు శివకుమార్. నేను తిరుపతిలోని రెడ్ శ్యాండిల్ ఫోర్స్‌లో సీఐని. కేవీ పల్లె మండలం పెద్ద కమ్మపల్లెకు చెందిన మా బంధువుల అమ్మాయిని చిన్నగొట్టిగల్లు మండలం జంగావాండ్లపల్లెల్లో ఓ వ్యక్తితో వివాహం చేశా ము. మా బంధువుల అల్లుడు వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. మా బంధువుల కుమార్తెను వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు గొడవపడి తిరుపతిలోని తన తల్లివద్దకు వచ్చేసింది. రేపు మీ స్టేషన్‌కు బాధితురాలి తీసుకొస్తాను. మీరు ఆ ఊరికెళ్లి మా బంధువుల అల్లుడితో సంబంధం పెట్టుకున్న మహిళను తీసుకుని రండి..’’ అంటూ భాకరాపేట పోలీస్ స్టేషనకు బుధవారం ఓ వ్యక్తి ఫోన్‌చేసి ఆర్డర్ వేశాడు. ఆమేరకు గురువారం భాకరాపేట పోలీసులు అతను చెప్పిన మహిళను స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఫోన్‌చేసిన వ్యక్తి పోలీస్ యూనిఫాం వేసుకుని భాకరాపేట పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. యూనిఫాంకు భుజంపై మూడు స్టార్లు ఉన్నాయి. రాగానే స్టేషన్ హాల్‌లో ఉన్న కుర్చీలో కూర్చొని తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. అతను మాట్లాడే తీరుపై పోలీసులకు అనుమానం వచ్చింది. అతని గురించి విచారణ చేపట్టారు. అతని పేరు శివయ్య అని, నకిలీ పోలీస్ అని తేలిపోయింది. మరిన్ని వివరాల సేకరణ కోసం పోలీసులు తిరుపతి, కేవీ పల్లె పోలీసులతో సంప్రదిస్తున్నారు. ఈ విషయమై భాకరాపేట ఎస్‌ఐ రాఘవేంద్రను వివరణ కోరగా అతనిపై తమకు ఫిర్యాదు అందిందని తెలిపారు. ఆ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


