హైకోర్టును ఆశ్రయించిన పరిశోధక విద్యార్థి
తిరుపతి సిటీ: ఎస్వీయూలో ఇటీవల జరిగిన ర్యాగింగ్‌పై పోరాడిన విద్యార్థులపై పెట్టిన కేసు కొట్టివేయాలని పరిశోధక విద్యార్థి అశోక్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు యూనివర్సిటీ న్యాయ విభాగం మాజీ విద్యార్థి, అడ్వకేట్ కప్పెర పవన్ కళ్యాణ్ ద్వారా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు రాగా, హైకోర్టు విచారణ సందర్భంగా ‘ప్రొఫెసరే ర్యాగింగ్ చేయమని ప్రోత్సహించడమేంటి?’ అని ప్రశ్నిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందని, అలాగే ‘‘విద్యార్థులు ర్యాగింగ్ చేయడం దారుణం’’ అని వ్యాఖ్యానిస్తూ యూనివర్సిటీ అధికారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించిందని పరిశోధక విద్యార్థి అశోక్ తెలిపారు. సైకాలజీ విభాగంలో నెల కిందట ఒక ప్రొఫెసర్ జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేయమని ప్రోత్సహించిన ఘటనపై అతనిని సస్పెండ్ చేయాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు పోరాడాయని తెలిపారు. ఆ సంఘటన అనంతరం రెక్టర్ చాంబర్‌లో పక్షపాత విచారణ జరుగుతుండగా అక్కడికి వెళ్లిన విద్యార్థి సంఘాల నాయకులపై సిబ్బంది దాడి చేసిన సమయంలో చాంబర్ తలుపులు, అద్దాలు పగిలిపోయాయని చెప్పారు. ఈ విషయాన్ని అదునుగా తీసుకుని, క్యాంపస్ పోలీస్ స్టేషన్‌లో సెక్యూరిటీ ఆఫీసర్ మోహన్ నాయుడు విద్యార్థి సంఘాల నాయకులపైన ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాల్లో పనిచేస్తున్న వారిపై వర్సిటీ అధికారులు నిరంతరం అణిచివేతకు దిగుతున్నారని, తోటి విద్యార్థులకు సమస్యలు వస్తే వాటిపై స్పందించడం తమ బాధ్యతని, ఇలాంటి అక్రమ కేసులకు తామెప్పుడూ భయపడమని చెప్పారు. ఈ కేసు హైకోర్టులో న్యాయం జరిగి కొట్టివేస్తారని పూర్తి నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. తప్పుచేసిన అధికారులపై హైకోర్టు చర్యలు తీసుకుంటుందన్న ప్రగాఢ విశ్వాసం ఉందన్నారు.


