నాసిరకం మెటీరియల్ వాడొద్దు
తిరుపతి అర్బన్: వసతి గృహాలు ఎంతో మంది పిల్లలు నివాసం ఉన్న ప్రదేశాలు.. నాసిరకం మెటీరియల్ వాడొద్దు..అలా చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ హెచ్చరించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లో విద్యార్థుల వసతి గృహాలకు చెందిన అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. హాస్టళ్ల మరమ్మతులకు కేటాయించిన పనుల్లో ఇప్పటి వరకు ఎన్ని పూర్తి చేశారు. మిగిలిన పనులు ఎప్పటిలోపు పూర్తి చేస్తారో స్పష్టం చేయాలన్నారు. వేగవంతంతోపాటు నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పనుల పర్యవేక్షణ అంశాన్ని ఇంజినీరింగ్ అధికారులే కాకుండా వసతి గృహాలకు చెందిన అధికారులు చూడాల్సి ఉందన్నారు. నిధులు మంజూరు కాని హాస్టళ్లకు ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. అవసరం అయిన నిధులను డిస్ట్రిక్ మినరల్ ఫండ్ (డీఎంఎఫ్), సీఎస్‌ఆర్ ద్వారా సేకరిస్తామని తెలిపారు. ప్రధానంగా వసతి గృహాల్లో మరుగుదొడ్లు, తలుపులు, లీకేజీలు, ప్లోరింగ్, ఆర్వో ప్లాంట్స్ ద్వారా తాగునీటి వసతి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వెల్ఫేర్ జిల్లా అధికారి విక్రమ్‌కుమార్‌రెడ్డి, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి భరత్‌రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ జిల్లా అధికారి రాజాసోము, గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్టినేటర్ పద్మజ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.


