బ్యాంకులో రూ. 2.23 కోట్ల బంగారం చోరీ

Gold Robbery In Bapatla BOB Bank - Sakshi

ఫైనాన్స్‌ కంపెనీలో రూ.60 లక్షలకు తాకట్టు

పరారీలో బ్యాంకు తాత్కాలిక ఉద్యోగి

పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు

బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్లలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ)లో రూ.2.23 కోట్ల విలువైన 5 కిలోలకుపైగా బంగారం మాయమైంది. ఈ బంగారాన్ని కాజేసినవారు ఒక ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీలో తాకట్టుపెట్టి రూ.60 లక్షలు తీసుకున్నారు. బ్యాంకు తాత్కాలిక ఉద్యోగి ప్యార్లీ సుమంత్‌రాజ్‌ పరారీలో ఉన్నాడు. దీనికి సంబంధించి ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకులో తాము కుదువపెట్టిన బంగారం మాయం కావడంతో ఖాతాదారులు సోమవారం బ్యాంకు వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకు తాత్కాలిక ఉద్యోగి సుమంత్‌రాజ్‌ సూత్రధారిగా ఈ చోరీ జరిగినట్లు డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు సోమవారం స్థానిక టౌన్‌ పోలీసు స్టేషన్‌లో విలేకరులతో చెప్పారు.

తమ బ్యాంకులో ఖాతాదారులు కుదువ పెట్టుకున్న రూ.2.23 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రీజనల్‌ మేనేజర్‌ విద్యాసాగర్‌ ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశారని తెలిపారు. పరారీలో ఉన్న సుమంత్‌రాజ్‌ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్ర ఉందనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. చోరీచేసిన 5 కిలోల 8 గ్రాముల బంగారంలో 80 శాతాన్ని ఓ ఫైనాన్స్‌ కంపెనీలో తాకట్టు పెట్టి రూ.60 లక్షలు తీసుకున్నట్లు గుర్తించారు. తాకట్టు పెట్టేందుకు సహకరించారనే అనుమానంతో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీఐలు పి.కృష్ణయ్య, కడప శ్రీనివాసరెడ్డి, ఎస్‌.ఐ.లు మహ్మద్‌రఫీ, వెంకటప్రసాద్‌ తదితరులు దర్యాప్తు చేస్తున్నారు.

చోరీ బయటపడింది ఇలా..
విశ్వసనీయ సమాచారం మేరకు ఈ చోరీ గురించి నిందితుడే బయటపెట్టాడు. సాధారణంగా బ్యాంకులో బంగారు ఆభరణాలపై ఏడాదిలో రెండు, మూడుసార్లు శాఖాపరమైన ఆడిట్‌ నిర్వహిస్తారు. బాపట్ల బీవోబీలో ఆభరణాలను తనిఖీ చేసేందుకు అధికారులు వస్తున్నట్లు ఈనెల ఒకటో తేదీన ప్రకటించారు. ఈ నేపథ్యంలో సుమంత్‌రాజ్‌ ఒకటి, రెండో తేదీల్లో విధులకు హాజరుకాలేదు. తన విషయం బయటపడి ఉంటుందని భావించిన అతడు మూడోతేదీన బ్యాంకు ఉద్యోగి ఒకరికి.. తాను తన తల్లికి ఆపరేషన్‌ చేయించేందుకు బంగారు ఆభరణాలు తీసుకున్నానని వాట్సాప్‌ ద్వారా సమాచారం ఇచ్చాడు. ఆ ఆభరణాలను ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీలో తాకట్టు పెట్టేందుకు సహకరించిన ఇద్దరి పేర్లను మరో మెసేజ్‌లో తెలిపినట్లు సమాచారం. దీంతో బ్యాంకు అధికారులు రీజనల్‌ మేనేజర్‌కు సమాచారం ఇచ్చి శాఖాపరమైన విచారణ చేపట్టారు. మొత్తం రూ.2.23 కోట్ల విలువైన ఆభరణాలు చోరీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top