అన్ని వర్సిటీల్లో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు

Four-year degree courses at all varsities Andhra Pradesh - Sakshi

నూతన విద్యావిధానం ప్రకారం కేంద్రం చర్యలు 

3 ఏళ్ల డిగ్రీ కోర్సులూ కొనసాగుతాయి 

ఏపీలో గత ఏడాదే ఈ విధానానికి రూపకల్పన  

సాక్షి, అమరావతి: సెంట్రల్‌ యూనివర్సిటీలు సహా దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి నాలుగేళ్ల కాలపరిమితితో డిగ్రీ కోర్సులు అమలులోకి రానున్నాయి. నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం కేంద్రం ఈ మేరకు చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే దీనిపై యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ)తోను, యూనివర్సిటీలతోను కేంద్ర విద్యాశాఖ చర్చించింది. దీనిపై తదుపరి ఏర్పాట్లకు యూజీసీకి ఆదేశాలు జారీచేసింది. దేశంలోని 45 సెంట్రల్‌ వర్సిటీల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్‌ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.

ఇప్పటికే అమల్లో ఉన్న మూడేళ్ల కోర్సులతో పాటే ఈ కొత్త కోర్సులు కూడా అమల్లో ఉంటాయని యూజీసీ పేర్కొంది. 2013లో నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టినా వాటిలో కొంతవరకు మాత్రమే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉన్నాయి. ఇప్పుడు మరిన్ని మార్పులుచేసి నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీ కోర్సులకు వర్సిటీలు రూపకల్పన చేయనున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఈ కోర్సులు విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉండేలా ఈ కోర్సుల్లోకి బహుళ ప్రవేశ, నిష్క్రమణలకు అవకాశం కల్పించనున్నారు. అలాగే రెండేళ్ల పీజీ కోర్సులను ఇక నుంచి ఏడాది కాలపరిమితితో కూడా అందుబాటులోకి తేనున్నారు. ఈ కోర్సులను ఎలా రూపొందించుకోవాలన్న దానిపై ఆయా వర్సిటీలే సొంతంగా నిర్ణయించుకుంటాయి.  

మన రాష్ట్రంలో ముందే చేపట్టిన విద్యాసంస్కరణలు 
నాలుగేళ్ల డిగ్రీ కోర్సులకు మన రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాదిలోనే ఏర్పాట్లు చేయించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉన్నత విద్యారంగ సంస్కరణలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సులకు రూపకల్పన చేశారు. విద్యార్థులకు పూర్తిస్థాయి నైపుణ్యాలు అలవడేందుకు నాలుగేళ్లలో ఒక ఏడాది ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశారు. దీనికి యూజీసీ అనుమతికి ప్రతిపాదించినా ముందు సానుకూలత రాలేదు.

తరువాత అదే విధానాన్ని కేంద్రం నూతన జాతీయ విద్యావిధానంలో పొందుపరిచింది. కేంద్రం నిర్ణయానికి ముందే రాష్ట్రంలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులకు శ్రీకారం చుట్టడం గమనార్హం. ఇదేకాకుండా పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్, ఉన్నతవిద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌లను కూడా మన రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేశారు. తరువాత కేంద్ర నూతన విద్యావిధానంలోనూ వీటినే పేర్కొనడం విశేషం.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top