
ప్రకాశం బ్యారేజీ నుంచి 2,96,900 క్యూసెక్కులు సముద్రంలోకి
ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 7,52,579 క్యూసెక్కులు కడలిలోకి
సాక్షి, అమరావతి, విజయపురిసౌత్, పోలవరం రూరల్: వర్షాలు కొనసాగుతుండటంతో వరద ప్రవాహం నిలకడగా ఉంది. కృష్ణా నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,43,377 క్యూసెక్కులు చేరుతుండగా.. 2,38,626 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 197 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 2,61,404 క్యూసెక్కులు చేరుతుండగా దిగువకు 2.43 లక్షల క్యూసెక్కులను వదిలేస్తున్నారు. సాగర్‌లో ప్రస్తుతం 305.75 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
పులిచింతల ప్రాజెక్టులోకి 2,71,310 క్యూసెక్కులు చేరుతుండగా 39.55 టీఎంసీలను నిల్వ చేస్తూ 2,60,881 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 3,08,838 క్యూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టాకు 11,938 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 2,96,900 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.
గోదావరి నుంచి ధవళేశ్వరం బ్యారేజీలోకి 7,58,779 క్యూసెక్కులు చేరుతుండగా గోదావరి డెల్టాకు 6,200 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 7,52,579 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం పెరుగుతుండటంతో పోలవరానికి క్రమేపీ వరద పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం 31.750 మీటర్లకు చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి దిగువకు 8.07 లక్షల క్యూసెక్కులను అధికారులు దిగువకు వదిలేస్తున్నారు.