నెత్తురోడిన రోడ్లు | Fatal accidents on national highways | Sakshi
Sakshi News home page

నెత్తురోడిన రోడ్లు

Apr 7 2026 5:32 AM | Updated on Apr 7 2026 5:32 AM

Fatal accidents on national highways

జాతీయ రహదారులపై ఘోర ప్రమాదాలు 

చిత్తూరు జిల్లాలో ఇద్దరు దుర్మరణం 

తిరుపతి జిల్లాలో మరో ఇద్దరు మృతి 

గంగవరం/రేణిగుంట: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత, సోమవారం సాయంత్రం జాతీయ రహదారులపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. తిరుపతి థర్డ్‌ కోర్టులో విధులు నిర్వహిస్తున్న యుగంధర్‌(47), హరీష్(35)తోపాటు రజని, గురుమూర్తి, కిరణ్‌కుమార్, డ్రైవర్‌ జగదీష్‌ మొత్తం ఆరుగురు కలసి బెంగళూరులో ఐపీఎల్‌ మ్యాచ్‌ చూసి ఆదివారం స్కార్పియో కారులో తిరుపతికి వస్తుండగా మార్గమధ్యలో చిత్తూరు జిల్లా గంగవరం బైపాస్‌ రహదారిపై ముందు వెళ్తున్న లారీని కారు వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న చంద్రగిరి మండలానికి చెందిన యుగంధర్, తిరుపతికి చెందిన హరీష్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మిగతా నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. 

రోడ్డు ప్రమాదంలో బావ, బామ్మర్ది మృతి 
తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలం శెట్టిగుంటకు చెందిన వంశీ(30), మునిరాజ (30) బావబామ్మర్ది. వీరు సోమవారం సాయంత్రం తిరుపతి నుంచి శెట్టిగుంటకు వెళ్తుండగా రేణిగుంట–కడప రహదారిపై మామండూరు సమీపంలో కోడూరు నుంచి తిరుపతి వైపు వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోటార్‌ సైకిల్‌పై ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు.

కాలువలోకి కారు దూసుకెళ్లి దంపతుల మృతి
శుభకార్యానికి వెళ్లి వస్తుండగా అదుపు తప్పిన కారు 
కాలువలో కారు ముందు భాగం ఇరుక్కుపోవడంతో అక్కడికక్కడే మృతి 
మండపేట రూరల్‌ మండలంలో విషాద ఘటన
కపిలేశ్వరపురం (మండపేట): శుభకార్యానికి వెళ్లి అందరితో సరదాగా గడిపిన ఆ దంపతులు తమ పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి తిరిగి కారులో ఇంటికి బయలుదేరారు. అర్ధరాత్రి దాటిన తరువాత చీకటి కావడంతో కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకువెళ్లింది. దీంతో కారు ముందుభాగంలో కూర్చున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన మండపేట రూరల్‌ మండలం తాపేశ్వరం గ్రామ శివారు పేకేటి పాకల వద్ద జరిగింది. 

వివరాలు.. బోగిళ్ల వీర వెంకట సతీష్‌ (40), బోగిళ్ల కిరణ్మయి (36) తమ పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి కాకినాడలో శుభకార్యానికి హాజరై స్వగ్రామం మండపేట మండలం వెలగతోడుకు బయలుదేరాడు. సతీష్‌ కారు నడుపుతుండగా పక్క సీటులో భార్య కిరణ్మయి కూర్చున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత చీకట్లో కారు అదుపు తప్పడంతో ముందు భాగం కాలువలో కూరుకుపోయింది. సతీష్, కిరణ్మయి అక్కడికక్కడే మృతిచెందారు. 

వెనుక సీట్లలో కూర్చున్న సతీష్‌ కొడుకులు మోక్షజ్ఞ, జితేష్.. అతని తల్లిదండ్రులు వెంకట్రావు, పద్మను స్థానికులు కారు అద్దాలు పగులగొట్టి కాపాడారు. సతీష్‌ రాజమహేంద్రవరంలోని పేపర్‌మిల్లులో ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు వెంకట్రావు, పద్మకు సతీష్‌ ఒకడే కొడుకు. అన్యోన్యంగా జీవిస్తున్న కొడుకూ కోడలు ఒకేసారి మృతి చెందడంతో కన్నీరుమున్నీరయ్యారు. వెంకట్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు మండపేట సీఐ పి.దొరరాజు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement