
తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న జానకయ్యపేట, సీహెచ్‌ఎల్‌పురం రైతులు
భూసేకరణను వ్యతిరేకిస్తున్నాసర్కారు ముందుకెళ్లడంపై ఆగ్రహం
అనకాపల్లి జిల్లా నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం ముట్టడి
భూముల జోలికి రావద్దంటూ అభ్యంతర పత్రాలు సమర్పణ
నక్కపల్లి: రైతుల ఆమోదం లేకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం బల్‌్కడ్రగ్ పార్కుకు అదనపు భూ సేకరణ చేపట్టడంపై రైతులు మండిపడుతున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో జానకయ్యపేట, సీహెచ్‌ఎల్‌పురం గ్రామాల పరిధిలో బల్క్ డ్రగ్ పార్కు కోసం అదనంగా 197 ఎకరాల భూమిని సేకరించడానికి మేలో ప్రభుత్వం 6ఏ నోటీసు ప్రకటన విడుదలచేసి అభ్యంతరాలు తెలపాలని పేర్కొంది. అయితే, భూములిచ్చేది లేదంటూ రైతులు పలుమార్లు నిరసన తెలిపినా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడంపై వారంతా రగిలిపోతున్నారు.
ఈ నేపథ్యంలో.. శనివారం వైఎస్సార్‌సీపీ, సీపీఎంల మద్దతుతో రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఇప్పటికే ప్రభుత్వం రెండు వేల ఎకరాలను బల్క్‌డ్రగ్ పార్కు కోసం కేటాయిస్తే మరో 700 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేయడం దుర్మార్గమన్నారు. ఇందులో 197 ఎకరాలు జానకయ్యపేట, సీహెచ్‌ఎల్‌పురం రెవెన్యూ పరిధిలో తీసుకోవడానికి పత్రికా ప్రకటన విడుదల చేశారన్నారు. ఈ సందర్భంగా.. వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. అప్పలరాజు తదితరులు మాట్లాడుతూ.. రైతులను బెదిరించి భూములు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.జ
జిల్లాలో ఎక్కడాలేని విధంగా హోంమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న నక్కపల్లి మండలంలోనే వేల ఎకరాల భూసేకరణ చేస్తున్నారని ఆరోపించారు. ఎకరా, రెండెకరాల భూములు కలిగిన రైతులు కంపెనీలకు భూములిచ్చేస్తే వాటిపై వచ్చే తక్కువ పరిహారంతో ఎలా బతుకుతారని వారు ప్రశ్నించారు. రైతులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. వచ్చేనెల 6న జరిగే ప్రజాభిప్రాయ సేకరణను సైతం అడ్డుకుని నిరసన తెలియజేస్తామని వారు స్పష్టంచేశారు. పలువురు టీడీపీ నేతలు కూడా భూములు ఇవ్వబోమంటూ తహశీల్దార్‌కు లిఖితపూర్వకంగా తెలిపారు.