నాసిరకం విత్తనాలతో నష్టపోతున్న అన్నదాతలు..
మొక్కజొన్న రైతులను దెబ్బతీసిన ఎంఎం 9375 హైబ్రీడ్ విత్తనం
సాక్షి, అమరావతి/ఏ.కొండూరు: రాష్ట్రంలో నకిలీ, నాసి విత్తన మాఫియా రాజ్యమేలుతోంది. నాసి, నకిలీ విత్తనాల బారినపడి వేలాదిమంది రైతులు రూ.కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. గత 22 నెలల్లో వరుసగా మిరప, పత్తి, ఉల్లి, టమాటా, వరి రైతులు ఈ నకిలీ విత్తన ఉచ్చులోపడి నష్టపోగా, తాజాగా ప్రస్తుత రబీ సీజన్‌లో మొక్కజొన్న రైతులు ప్రైవేటు కంపెనీల నకిలీ విత్తన కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. మరోవైపు మార్కెట్‌లో ధరల్లేక తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి ఘటనల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు పాలనలో విత్తనచట్టం అక్రమార్కులకు చుట్టం
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత విత్తనచట్టం అక్రమార్కులకు చుట్టంగా మారిపోయింది. జిల్లాస్థాయి టాస్‌్కఫోర్స్ కమిటీలు చేవలేని కమిటీలుగా మారిపోయాయి. విత్తన కంపెనీల నుంచి నెలవారీ మామూళ్లకు అలవాటుపడిన విజిలెన్స్ అధికారులు చూసీచూడనట్టుగా వదిలేస్తున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో మొక్కుబడి తంతుగా తనిఖీలు నిర్వహిస్తున్నారే తప్ప తీసుకుంటున్న చర్యలు లేవు.
రెండేళ్లలో నకిలీ విత్తనాల వల్ల దాదాపు 3 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, సుమారు 35 వేలమంది రైతులు రూ.వెయ్యికోట్లకుపైగా పెట్టుబడి, ఉత్పత్తి నష్టాలను చవిచూసినట్టుగా అంచనా వేస్తున్నారు. ఈ నష్టపోయిన రైతుల్లో పదిశాతం మందికి కూడా పరిహారం అందిన దాఖలాల్లేవు. బిల్లులున్న వారికి సైతం అరకొరగానే పరిహారం ఇస్తున్నా.. ఇదేమిటని ప్రశ్నించేవారు లేరు.
ఇలా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరఫున పరిహారం అన్నమాటే లేదు. రాష్ట్ర రైతులను ముంచేస్తున్న నకిలీ విత్తనాల్లో 90 శాతం హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న కంపెనీలకు చెందినవే కావడంతో నేరుగా చర్యలు తీసుకునే పరిస్థితి కనిపించడంలేదు. మరోవైపు పంట దెబ్బతిన్న తర్వాత విత్తన నమూనాలను ల్యాబ్‌లకు పంపితే రిపోర్టు వచ్చేసరికి సీజన్ ముగిసిపోతోంది. ఈలోగా ఏజెంట్లు పత్తా లేకుండా పోతున్నారు.
గింజ కట్టక..కండె నిలవక
కర్నూలు, అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పత్తి రైతులు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో ఉల్లి, టమాటా రైతులు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో వరి రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోయారు. తాజాగా ప్రస్తుత రబీ సీజన్‌లో ఎన్టీఆర్, మార్కాపురం, పార్వతీపురం మన్యం, వైఎస్సార్ కడప జిల్లాల్లో వందలాది ఎకరాల్లో మొక్కజొన్న రైతులు నకిలీ విత్తనాలతో లక్షల రూపాయలు పెట్టుబడిని కోల్పోయారు.
మార్కాపురం, పెద్దారవీడు మండలాల్లో వైడిపాడు, బొందలపాడు, చట్లమిట్ల, పోతంపల్లి, రాజంపల్లి, మద్దలకట్ట మొక్కజొన్న రైతులు పంట చేతికివచ్చే సమయానికి నకిలీ విత్తనాలతో నష్టపోయామంటూ పోలీసులను ఆశ్రయించారు. ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలంలో రామచంద్రపురం, కోమటికుంట తదితర గ్రామాల్లో నకిలీ విత్తనాల వల్ల నష్టపోయామంటూ వందలమంది రైతులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
వైఎస్సార్ కడప జిల్లా సిద్ధవటం మండలం వెంకటాయపల్లె గ్రామంతో పాటు పార్వతీపురం మన్యం కొమరాడ మండలం దలైపేట, తల్లికోట గ్రామాల్లో సైతం నకిలీ విత్తనాల వల్ల వందలాది ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతిందని రైతులు అధికారులకు మొరపెట్టుకున్నారు. ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు పెట్టుబడులు పెట్టామని, తీరా పంట దిగుబడి వచ్చిన తర్వాత పరిశీలిస్తే కండెలకు అసలు గింజలే రాలేదని ఆవేదన చెందుతున్నారు.
ఎకరాకు సగటున 50 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని కంపెనీలు చెప్పగా.. కనీసం 10–20 క్వింటాళ్లకు మించి రాలేదని తెలిపారు. కలెక్టర్లకు, వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధిత రైతులు తెలిపారు. ప్రైవేటు విత్తన కంపెనీలపై ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.6 లక్షలకు పైగా పెట్టుబడి కోల్పోయాం
నేను, మా బంధువులు కలిసి 12 ఎకరాల్లో టాటా ఎంఎం 9375 హైబ్రీడ్ విత్తనం 10 ప్యాకెట్లు కొనుగోలు చేసి సాగుచేశాం. ఎకరాకు 50 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశ చూపడంతో ప్యాకెట్ రూ.1,950 చొప్పున కొనుగోలు చేశాం. ఎకరాకు కౌలుతో కలిపి రూ.60 వేల పెట్టుబడి పెట్టాం. తీరా పంట చేతికొచ్చే సమయంలో ఒక్క కండెకు కూడా గింజ రాలేదు. తీవ్రంగా నష్టపోయాం. మేమంతా కౌలురైతులమే. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – బండి వెంకటేశ్వరరావు, కోమటికుంట, ఎన్టీఆర్ జిల్లా
ఎకరాకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలి
టాటా కంపెనీకి చెందిన హైబ్రీడ్ మొక్కజొన్న నాసిరకం విత్తనం వల్ల ఎన్టీఆర్ జిల్లాలోని పలు గ్రామాల్లో పెద్దసంఖ్యలో రైతులు నష్టపోయారు. ఎకరాకు 50 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులను నమ్మించి విత్తనాలను విక్రయించారు. ఎకరాకు కనీసం 10–20 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
పైగా గింజ కట్టిన కండెలు సైతం నాణ్యత లేకుండా ఉన్నాయి. దీంతో పెట్టుబడితోపాటు ఉత్పత్తి కూడా నష్టపోయాం. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని కంపెనీలద్వారా ఎకరాకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. – పి.జమలయ్య, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలురైతు సంఘం


