సాక్షి,అమరావతి: చంద్రబాబు సర్కారుకు అమరావతి రైతులు అల్టిమేటం జారీ చేశారు. తమ భూములకు సరైన పరిహారం చెల్లించకపోతే ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని తెలిపారు.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంపై రైతులు ఆందోళన బాట పట్టారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండల రైతులు పుల్లడిగుంట హైవే వద్ద భూములు కోల్పోతున్నామని ఆందోళన చేపట్టారు. సజావుగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్ 2017లో సరిగా ఉండగా.. 2025-26 మ్యాప్ అలైన్‌మెంట్‌లో మార్పులు జరిగాయని రైతులు ఆరోపిస్తున్నారు. రోడ్డుకు మలుపు తిప్పడం వల్ల తమ భూములు ప్రభావితమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల్లో కూడా 140 మీటర్ల వెడల్పు రోడ్లు లేవని రైతులు వాదిస్తున్నారు. తమ భూములకు సరైన పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు.


