నివాళులర్పిస్తున్న నారాయణ స్వామి
మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వద్ద బాధిత కుటుంబసభ్యుల రోదన
రామానాయుడుపల్లిలో బాబు మృతదేహానికి నివాళులర్పించిన నారాయణస్వామి
గంగాధర నెల్లూరు: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం రామానాయుడుపల్లిలో పేద రైతు బాబు (50) కూటమి నేతల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కుటుంబసభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఎదుట కన్నీరుమున్నీరుగా విలపించారు. కూటమి నేతల వేధింపులవల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రామానాయుడుపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు, దళిత రైతు బాబు సూసైడ్ నోట్ రాసి సోమవారం పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకున్న విషయం తెలిసిందే.
మంగళవారం నారాయణస్వామి, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి రామానాయుడుపల్లిలో బాబు మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు నారాయణస్వామితో మాట్లాడారు. కూటమి నేతలు బాబుపై పలు కేసులు నమోదు చేయించి వేధించారని చెప్పారు. గ్రామానికి చెందిన టీడీపీ దళిత నాయకుడు పొన్నుస్వామికి, కొందరు అగ్రవర్ణాల నేతలకు భూతగాదా ఉన్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడైన బాబుపైన, కొందరు యువకులపైన కేసులు నమోదు చేయించారని తెలిపారు.
గ్రామంలో ఏ సమస్య తలెత్తినా బైండోవర్ పేరుతో బాబును, మరికొందరిని పోలీస్‌స్టేషన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచేవారని చెప్పారు. ఈ వేధింపులు తట్టుకోలేకే బాబు ఆత్మహత్య చేసుకున్నాడని విలపించారు. కూటమి నేతలకు భయపడి కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడని సోమవారం ఫిర్యాదులో పేర్కొన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా నారాయణస్వామి, కృపాలక్ష్మి మాట్లాడుతూ బాబు కుటుంబానికి తమతోపాటు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందించారు.


