తక్కువ ధరలకే భూములు కట్టబెట్టడం దారుణం: పేర్ని నాని | Ex-Minister Perni Nani Slams Land Allocations in Guntur | Sakshi
Sakshi News home page

తక్కువ ధరలకే భూములు కట్టబెట్టడం దారుణం: పేర్ని నాని

Apr 13 2026 2:58 PM | Updated on Apr 13 2026 3:55 PM

 Ex-Minister Perni Nani Slams Land Allocations in Guntur

గుంటూరు: తక్కువ ధరలకే భూములు కట్టబెట్టడం దారుణమని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని అన్నారు. అక్రమ భూకేటాయింపులపై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులో చర్చాగోష్ఠి నిర్వహించారు.

ఇందులో పాల్గొన్న పేర్ని నాని మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వం 99 పైసలకే కోట్లాది రూపాయలు విలువచేసే భూములను బడా బాబులకు కట్టబెడుతోందని తెలిపారు. 99 పైసలకి భూములు కేటాయించిన జీవోలు కొన్ని మాత్రమే బయటపడ్డాయని, కనిపించకుండా ప్రభుత్వం దాచిపెట్టిన జీవోలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు. ప్రజల భూములపైనే కాకుండా దేవుడి భూములపై కూడా కన్నేశారని తెలిపారు. ఇలా ప్రభుత్వం భూముల కేటాయింపులో ఇప్పుడు కొత్తరకం మార్గాన్ని ఎంచుకుందని విమర్శించారు.  

మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం ప్రజల ఆస్తులకు ధర్మ కర్త మాత్రమే. ప్రజల ఆస్తులు ఎవరికిబడితే వారి కట్టబెట్టడానికి వీల్లేదు. విశాఖలో 99 పైసలకే కొన్ని కంపెనీలకు భూములు కేటాయించడం దారుణం. మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం అమరావతికి ఓఆర్ఆర్ వేస్తామని చెప్తోంది. 2014 నుంచి 2019 మధ్య ఉన్న చంద్రబాబు ప్రభుత్వం విజయవాడలోని స్వరాజ్ మైదానాన్ని చెన్నై కంపెనీకి ఇవ్వాలని ప్రయత్నిస్తే కోర్టుకు వెళ్లే అడ్డుకున్నాం. ఇవాళ కూడా బెజవాడలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ ను కేటాయిస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నాం’ అని చెప్పారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement