నేటి నుంచి పది మూల్యాంకనం | Evaluation of 10th class answer sheets begins from Monday | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పది మూల్యాంకనం

Apr 6 2026 4:42 AM | Updated on Apr 6 2026 4:42 AM

Evaluation of 10th class answer sheets begins from Monday

ఈ నెల 15 వరకు ప్రక్రియ కొనసాగింపు  

కేంద్రాల వద్దే ట్యాబుల్లో మార్కులు నమోదు  

పాఠాలు చెప్పని టీచర్లకూ స్పాట్‌ విధులు  

సాక్షి, అమరావతి: పదో తరగతి (ఎస్‌ఎస్‌సీ–2026) జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 26 జిల్లాల్లోని స్పాట్‌ కేంద్రాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మూల్యాంకన విధుల కోసం చీఫ్‌ ఎగ్జామినర్స్, అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, స్పెషల్‌ అసిస్టెంట్లు తదితర సిబ్బంది 20 వేల మందిని నియమించారు. మొత్తం ప్రక్రియను ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తి చేయనున్నారు. 

గతేడాది 7 రోజుల్లోనే స్పాట్‌ నిర్వహించడంతో భారీగా తప్పులు జరిగాయి. ముఖ్యంగా సోషల్‌ స్టడీస్‌ మార్కుల నమోదులో విద్యార్థులకు అన్యాయం జరిగింది. దీంతో ఈ ఏడాది మూల్యాంకన ప్రక్రియను 10 రోజులకు పాడిగించారు. ఈసారి కొత్తగా ట్యాబ్స్‌లో మార్కుల నమోదును స్పాట్‌ కేంద్రాల్లోనే చేపడుతున్నారు. ఇందుకోసం ఆయా కేంద్రాల్లో ఇంటర్నెట్‌ సదుపాయంతోపాటు గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి 8వ తరగతి విద్యార్థులకు అందించిన ట్యాబ్స్‌ను ఇందుకోసం వినియోగిస్తున్నారు. 

స్పాట్‌ కేంద్రాల్లో జవాబు పత్రాలు మూల్యాంకనం చేసే అసిస్టెంట్‌ ఎగ్జామినర్లకు రోజకు 40 పేపర్లు మాత్రమే ఇవ్వనున్నారు. మూల్యాంకనం పూర్తయ్యాక ట్యాబ్‌లో బార్‌కోడ్‌ స్కాన్‌ చేసి, సదరు పేపర్‌లో వచ్చిన మార్కులను నమోదు చేయాల్సి ఉంటుంది. మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక స్పెషల్‌ అసిస్టెంట్లు మరోసారి ట్యాబ్‌లో రెండోసారి స్కానింగ్, మార్కులు నమోదు చేయాలి.   

బోధించకున్నా విధుల కేటాయింపు  
మరోవైపు ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు బోధించని ఉపాధ్యాయులకూ మూల్యాంకన విధులు అప్పగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం కనీసం మూడేళ్లు పదో తరగతిలో ఆయా సబ్జెక్టులు బోధించిన వారికే మూల్యాంకనం విధులు వేస్తారు. కానీ, ఈ ఏడాది యూపీ స్కూల్‌ నుంచి ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్‌ అయిన స్కూళ్లల్లోని సిబ్బందికి కూడా ఈ విధులు వేశారు. వాస్తవానికి ఈ స్కూళ్లల్లో 2025–26 విద్యా సంవత్సరంలో 8వ తరగతి వరకు మాత్రమే ఉంది. 

అయినప్పటికీ ఈ స్కూళ్లల్లోని సిబ్బందిని స్పాట్‌ విధులకు నియమించడం విస్మయపరుస్తోంది. మూల్యాంకనంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని చెప్పిన పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది అన్ని రకాలుగా విఫలమైందని... ఆటోమేషన్‌ విధానంతో భారీగా తప్పులు చోటుచేసుకున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని స్కూళ్లల్లో 100 శాతం సిబ్బందికి స్పాట్‌ విధులు వేసేశారు. సోమవారం నుంచి సమ్మేటివ్‌–2 పరీక్షలు ప్రారంభం కానుండడంతో జిల్లా అధికారులు సిబ్బందిని సర్దుబాటు చేసేందుకు తలలు పట్టుకుంటున్నారు.  

స్పాట్‌ విధుల నుంచి మినహాయించండి: ఫోర్టో
అనారోగ్యం, 60 సంవత్సరాలు దాటిన వారికి పదో తరగతి మూల్యాంకన విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఫోరం ఆఫ్‌ రిజిస్టర్డ్‌ టీచర్స్‌ ఆర్గనైజేషన్స్‌ (ఫోర్టో) చైర్మన్‌ కరణం హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి అంకాల్‌ కొండయ్య ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. గత మూల్యాంకన విధుల్లో పాల్గొన్న వారికి ఇప్పటికీ పారితోషికం ఇవ్వలేదని, వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. 

పదో తరగతి పేపర్‌ వ్యాల్యూయేషన్‌లో పాల్గొనే సిబ్బందికి పారితోషికం పెంచాలని స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (ఏపీ ఎస్టీఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాడిశెట్టి శ్రీనివాసులు, తమ్మినాన చందనరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 719 ఎయిడెడ్‌ పాఠశాలల్లో మిగులు ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ గిల్డ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.చిట్టిబాబు, ఎల్‌కే చిన్నప్ప విజ్ఞప్తి చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement