274 పంచాయతీల్లో ఎన్నికల్లేవు! | Elections Have Been Stopped In 274 Gram Panchayats In AP | Sakshi
Sakshi News home page

274 పంచాయతీల్లో ఎన్నికల్లేవు!

Feb 12 2021 6:52 AM | Updated on Feb 12 2021 12:36 PM

Elections Have Been Stopped In 274 Gram Panchayats In AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 274 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ఆగిపోయాయి. నాలుగు విడతల్లో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో ఈ గ్రామాల ప్రస్తావనే లేదు. రాష్ట్రంలో మొత్తం 13,371 గ్రామ పంచాయతీలున్నాయి. తొలి విడతలో 3,249 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. రెండో విడతలో 3,328 పంచాయతీల్లో రేపు (ఈ నెల 13న), మూడో విడతలో 3,221 పంచాయతీల్లో ఈ నెల 17న పోలింగ్‌ జరగనుంది. నాలుగో విడతగా 3,299 గ్రామాల్లో ఈనెల 21న నిర్వహించే ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నాలుగు విడతల్లోను ఎన్నికల నోటిఫికేషన్‌ జారీచేయనివి 274 పంచాయతీలున్నాయి. వీటిలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 69 ఉన్నాయి. ఏడాది కిందట పెద్ద గ్రామ పంచాయతీలుగా ఉన్న వాటిని పలుచోట్ల స్థానికుల డిమాండ్‌ మేరకు రెండుగా వర్గీకరించారు. అనంతరం ఆయా పంచాయతీల్లో వార్డుల విభజన జరగలేదు. దీంతో వాటిలో ఎన్నికలు నిర్వహించడంలేదు. కొన్ని పంచాయతీలకు సంబంధించి కోర్టుల్లో కేసులున్నాయి. అందువల్ల ఈ పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించడంలేదు.

నోటిఫికేషన్‌ జారీ అయినా జరగనివి మరికొన్ని
ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ జారీ అయిన తరువాత కూడా వివిధ కారణాలతో మరికొన్ని పంచాయతీల్లో ఎన్నికలు ఆగిపోయాయి. మొదటి విడతలో నోటిఫికేషన్‌ జారీచేసినా సర్పంచి, వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెలిచర్ల పంచాయతీలో ఎన్నికలు నిలిచిపోయాయి. రెండో విడత నోటిఫికేషన్‌ ఇచ్చిన పంచాయతీల్లోను మూడుచోట్ల ఎన్నికలు నిలిచిపోయినట్లు పంచాయతీరాజ్‌శాఖ అధికారులు తెలిపారు.

మూడో విడత ఉపసంహరణకు, నాలుగో విడత నామినేషన్ల దాఖలుకు నేడు గడువు
మూడో విడత ఎన్నికలు జరగనున్న 3,221 పంచాయతీల్లో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియనుంది. అనంతరం ఎంతమంది పోటీలో ఉన్నారన్న స్పష్టత రానుంది. నాలుగో విడతలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement