ఆది నుంచీ ఆ కుటుంబం నుంచే సర్పంచులు 

Elected Sarpanches From Same Family - Sakshi

మార్కాపురం: ఆ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సర్పంచిగా ఎన్నికయ్యేది మాత్రం ఆ ఒక్క కుటుంబ సభ్యులే. 1965 నుంచీ రిజర్వేషన్లు మారినప్పుడు మినహా జనరల్‌కు కేటాయించిన ప్రతిసారీ వారే విజయం సాధించారు. మార్కాపురం నియోజకవర్గం తర్లుపాడు మండలం గొల్లపల్లి పంచాయతీకి చెందిన యక్కంటి వారిది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. 1965లో యక్కంటి రామిరెడ్డి సర్పంచిగా ఎన్నికయ్యారు. 1967లో ఆయన మరణంతో వచ్చిన బై ఎలక్షన్స్‌లో ఆయన కుమారుడు యక్కంటి వెంకటరెడ్డి సర్పంచిగా ఎన్నికై 1987 వరకు 20 ఏళ్లపాటు పదవీ బాధ్యతలు నిర్వర్తించాడు.

ఆ తర్వాత 1995 నుంచి 2000 సంవత్సరం వరకు వెంకటరెడ్డి కుమారుడు యక్కంటి రామిరెడ్డి సర్పంచిగా పని చేశారు. ఆ పదవీ కాలం ముగిసిన వెంటనే 2001 నుంచి 2005 వరకు ఆయనే ఎంపీటీటీగా పనిచేశారు. 2005 నుంచి 2010 వరకు  రామిరెడ్డి భార్య వెంకట లక్ష్మమ్మ ఎంపీటీసీగా పని చేశారు. మధ్యలో ఒక దఫా రిజర్వేషన్లు మరడంతో విరామం రాగా మళ్లీ 2014లో జనరల్‌ మహిళగా రిజర్వ్‌ అయిన పంచాయతీ ఎన్నికల్లో యక్కంటి వెంకట లక్ష్మమ్మ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పదవీ కాలం ముగుస్తున్న దశలో ఆమె అనారోగ్యంతో మృతి చెందారు. తాజా పంచాయతీ ఎన్నికల్లోనూ పంచాయతీ గొల్లపల్లి జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కావడతో రామిరెడ్డి, వెంకటలక్ష్మమ్మ దంపతుల కుమార్తె శ్రావణిని సర్పంచ్‌ అభ్యర్థిగా వైఎస్సార్‌ సీపీ మద్దతుతో పోటీలో నిలిపారు. బీటెక్‌ చదివిన శ్రావణి 21 ఏళ్ల వయసులోనే గొల్లపల్లి గ్రామ సర్పంచిగా ఎన్నికై ఆ కుటుంబ ఆనవాయితీని కాపాడింది.
చదవండి: 54 ఏళ్ల చరిత్రలో.. ఒకే ఒక్కడు  
ఇవేం పాడు పనులు.. కానిస్టేబుల్‌కు దేహశుద్ధి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top