జంతు ప్రపంచం... దత్తత మీ ఇష్టం..! | Donors should come forward to adopt wildlife at the zoo | Sakshi
Sakshi News home page

జంతు ప్రపంచం... దత్తత మీ ఇష్టం..!

Jan 18 2025 5:59 AM | Updated on Jan 18 2025 5:59 AM

Donors should come forward to adopt wildlife at the zoo

ఆరిలోవ :  విశాఖలోని ఇందిరాగాంధీ  జూ పార్కు­లో వన్యప్రాణుల సంరక్షణకు తోడ్పాటు అందించడానికి దాతలు ముందుకు వస్తున్నారు. ఇక్కడ వన్యప్రాణులను జూ అధికారులు దత్తత ఇస్తున్నారు. ఇందుకు దాతలు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. 

దాతల పేరుతో జూ సిబ్బంది వాటికి ఆహారం అందిస్తారు. జూలో ఏ జంతువు, ఏ పక్షిని దత్తత తీసుకొంటే వాటి ఎన్‌క్లోజరు వద్ద వాటి ఫొటోతో పాటు దాతల పేర్లతో బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.



అవి సందర్శకులకు స్పష్టంగా కనిపించే విధంగా ఎన్‌క్లోజరు వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం పలువురు దాతల పేర్లతో కూడిన బోర్డులను వారు దత్తత తీసుకొన్న వన్యప్రాణుల ఎన్‌క్లోజర్ల వద్ద సిద్ధం చేశారు.  



ఆకర్షణీయంగా దాతల పేర్లతో బోర్డులు 
జూ పార్కులో వివిధ జాతులకు చెందిన జంతువులు, రకరకాల పక్షులు, తాబేళ్లు, మొసళ్లు, పాములు జూకి వెళుతున్న సందర్శకులను అలరిస్తుంటాయి. ఆయా ఎన్‌క్లోజర్ల వద్ద  దాతల బోర్డులు కూడా ఆకర్షణగా నిలుస్తున్నాయి. జూలో వందల కొలది వన్యప్రాణులు, పక్షులు ఉన్నాయి. వాటిపై ప్రేమ, వాత్సల్యం చూపుతూ జూ అధికారులకు సహకరిస్తున్నారు. 

వాటిని దత్తత తీసుకుని నెలకు, ఆరు నెలలకు, సంవత్సరానికి ఆహారం అందించడానికి బాధ్యతగా తీసుకొని సహాయపడుతున్నారు. ఇక్కడ తెల్ల పులి, ఖఢ్గమృగం, జిరాఫీ తదితర పెద్ద జంతువులను పలు కంపెనీలు ఏడాది పాటు దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చాయి. మరికొన్ని చిన్న జంతువులు, పక్షులను కూడా కొందరు నెల, ఆరు నెలలు పాటు దత్తత తీసుకొని ఆహారం అందిస్తున్నారు.  



» ఫ్లూయంట్‌ గ్రిడ్‌ లిమిటెడ్‌ జిరాఫీని ఒక ఏడాది పాటు దత్తత తీసుకొంది. దీంతో ఆ కంపెనీ పేరు, జిరాఫీ చిత్రపటంతో దాని ఎన్‌క్లోజరు వద్ద బోర్డు ఏర్పాటు చేశారు.. 
» ఎన్‌క్లోజరు వద్ద ఐఓసీఎల్‌ కంపెనీ ఖఢ్గమృగాన్ని ఏడాది కాలం దత్తత తీసుకొన్నారు. దాన్ని మళ్లీ మరో ఏడాది దత్తత కొనసాగించడానికి ఆ కంపెనీ ముందుకు వచ్చింది. ఖఢ్గమృగం ఉన్న చిత్రపటంపై లిమిటెడ్‌ పేరుతో బోర్డును దాని ఎన్‌క్లోజరు వద్ద ఏర్పాటు చేశారు.  
» ఆర్సిలోర్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌(ఏఎన్‌/ఎంఎస్‌) తెల్ల పులిని ఒక సంత్సరం పాటు దత్తత తీసుకొంది. తెల్లపులుల ఎన్‌క్లోజరు వద్ద ఆ కంపెనీ పేరుతో బోర్డు ఏర్పాటు చేశారు.  
» వీటితో పాటు మరికొందరు ఏడాది, ఆరు నెలలు, మూడు నెలలు, నెల, ఒక్కరోజు కూడా ఇ­క్కడ వన్యప్రాణులకు ఆహారం అందించడానికి ద­త్తత తీసుకొన్నవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

ఆదాయం పన్ను మినహాయింపు.. 
ఇక్కడ వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి వ్యక్తులు, సంఘాలు, పరిశ్రమలు వారి శక్తి మేరకు సహకారం అందించవచ్చు. ఏనుగు నుంచి చిన్న పక్షి వరకు ఎవరైనా ఎంత కాలానికైనా దత్తత తీసుకోవచ్చు. వాటి కోసం ఒక రోజు, నెల, ఏడాది వారిగా అయ్యే ఖర్చు చెల్లించవచ్చు. 

జూలో వన్యప్రాణులను దత్తత తీసుకొన్నవారికి ఆదాయం పన్నులో మినహాయింపు ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఈ దత్తత పద్ధతి 2011లో ప్రారంభించారు. అప్పటి నుంచి పలువురు దాతలు ముందుకొచ్చి ఇక్కడ పులులు, సింహాలు, ఏనుగులు, పక్షులకు ఆహారం అందిస్తున్నారు.  

దాతలు ముందుకు రావాలి 
జూలో వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి దాతలు ముందుకు రావాలి. వాటికి ఆహారం అందించడంలో భాగస్వాములు కావాలి. ఇప్పటికే కొందరు దాతలు సంస్థల పరంగా, వ్యక్తిగతంగా ముందుకు వచ్చి కొన్ని జంతువులను, పక్షులను వారం, నెల, ఏడాది కాలానికి ఆహారం అందించడానికి వన్యప్రాణులను దత్తత తీసుకొన్నారు.

ఎక్కువమంది దాతలు స్పందించి ఇక్కడ వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి ముందుకు వస్తే మూగజీవాలకు సహకరించినవారవుతారు. దాతలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది.   – మంగమ్మ, జూ క్యూరేటర్‌  

ఆహారం ఇలా... 
సింహం, పులికి పశు మాంసం, చికెన్‌ ఆహారంగా వేస్తున్నారు. ఏనుగుకు రాగి సంగటి, చెరకు, గ్రాసం, అరటి దవ్వ, బెల్లం, కొబ్బరి కాయలు అందిస్తున్నారు. చింపాంజీలకు పళ్లు, కాయలు, పాలు ఆహారంగా వేస్తారు. జింకలు, కణుజులు, కొండ గొర్రెలు తదితర వాటికి గ్రాసం వేస్తారు. 

అన్ని పక్షులకు పలు రకాల పళ్లు ముక్కలు కోసి వేస్తారు. కోతులకు పళ్లు, వేరుశెనగ పిక్కలు వేస్తారు. నీటి ఏనుగుకు పళ్లు, కూరగాయలు, ఆకు కూరలు వేస్తారు. ఇలా ఇక్కడ వన్యప్రాణులన్నింటికీ వాటి ఆహారం కోసం రోజుకు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement