చిత్తూరు కలెక్టరేట్‌లో దివ్యాంగురాలు ఆత్మహత్యాయత్నం | Differently abled Woman attempts suicide in front of Collectorate | Sakshi
Sakshi News home page

చిత్తూరు కలెక్టరేట్‌లో దివ్యాంగురాలు ఆత్మహత్యాయత్నం

Jun 2 2026 4:25 AM | Updated on Jun 2 2026 4:25 AM

Differently abled Woman attempts suicide in front of Collectorate

పెట్రోల్‌ తాగి ఆత్మహత్యాయత్నం చేసిన మనెమ్మ

మనస్తాపంతో పెట్రోల్‌ తాగి ఆత్మహత్యాయత్నం

చిత్తూరు కలెక్టరేట్‌: ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగం దక్కకపోవడం.. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ దివ్యాంగురాలు చిత్తూరు కలెక్టరేట్‌ వద్ద ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివ్యాంగురాలు మనెమ్మకు కొన్నేళ్ల కిందట చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం ఉప్పరపల్లికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు పుట్టాక.. భర్త వదిలేసి వెళ్లిపోయాడు. 

అయినా చిన్నచిన్న పనులు చేస్తూ ఇద్దరు పిల్లల బాగోగులు చూసుకుంటోంది. దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ ఏఎన్‌ఎం పోస్టులు ఉన్నాయని తెలుసుకొని.. దరఖాస్తు చేసుకుంది. అన్ని అర్హతలున్నా నాన్‌ లోకల్‌ పేరుతో తనకు ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. విభిన్న ప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఏడీ) అలసత్వం వల్లే తనకు అన్యాయం జరిగిందని మనెమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. నాన్‌ లోకల్‌ కేటగిరి గురించి స్పష్టం చేయకుండా దరఖాస్తు స్వీకరించారని వాపోయింది. తీరా ప్రక్రియ ముగిశాక అసలు విషయం చెప్పారని కన్నీటిపర్యంతమైంది.

ఈ నిబంధన ముందే చెప్పి ఉంటే తన సొంత జిల్లాలోనే దరఖాస్తు చేసుకునేదానినని వాపోయింది. న్యా­యం కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో.. సోమవారం నాలుగేళ్ల కుమార్తెతో వచ్చి కలెక్టర్‌ సుమిత్‌ను కలిసి తన ఆవేదన చెప్పుకున్నట్లు తెలిపింది. ఈ విషయంలో తామేమీ చేయలేమని కలెక్టర్‌ చెప్పారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఇక ఆత్మహత్యే శరణ్యమంటూ ఒంటిపై పెట్రోల్‌ పోసుకోవడమే కాకుండా.. కొంత పెట్రోల్‌ను తాగేసింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను పోలీసులు, స్థా­ని­కులు వెంటనే చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement