జై ఆంధ్రా అంటే ఇక్కడ కనెక్ట్‌ అవ్వరు | Deputy CM Pawan Kalyan on Telangana | Sakshi
Sakshi News home page

జై ఆంధ్రా అంటే ఇక్కడ కనెక్ట్‌ అవ్వరు

Jun 4 2026 4:43 AM | Updated on Jun 4 2026 4:43 AM

Deputy CM Pawan Kalyan on Telangana

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌  

నేనెప్పుడూ ఏపీ విభజనను వ్యతిరేకించలేదు 

రాజధాని విషయంలో ఏకాభిప్రాయం లేకపోయినా ముందుకెళ్లక తప్పదు

సాక్షి, అమరావతి : ‘తెలంగాణ వాళ్లకు తెలంగాణ భావన ఉంది. తమిళనాడు వాళ్లకు తమిళ భావన ఉంటుంది. కానీ, ఆంధ్రా వాళ్లకు ఏ భావం ఉందో ఎవరికీ తెలియదు’ అని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు. జై ఆంధ్రా అంటే ఇక్కడి వాళ్లు కనెక్ట్‌ అవ్వరని చెప్పారు. బుధవారం ఆయన తమ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి రాజధాని ప్రాంతం శాఖమూరులోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తానెప్పుడూ తెలంగాణ–ఏపీ విభజనను వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. 

మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తాను అంత గట్టిగా మాట్లాడడం వెనుక ఎలాంటి ముందస్తు ప్లాన్‌ లేదని చెప్పారు. తాము సభ పెట్టుకుంటామంటే అడ్డుకోకూడదు కదా.. అని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. అదంతా ఎవరో ఒకరు కూర్చొని చేసింది కాదు కానీ, చిలికి చిలికి గాలివానగా మారిందన్నారు. ‘కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిగట్టుకొని చేసిందని, రేవంత్‌రెడ్డి చేశారని నేను అనుకోను. అయితే, కాంగ్రెస్‌ పార్టీ ప్రాంతీయతను రెచ్చగొట్టేలా మాట్లాడటం మానుకోవాలి. కేటీఆర్‌తో నాకు మంచి సంబంధాలున్నాయి’ అని చెప్పారు.

రాష్ట్రంలో ఎన్నెన్నో కులాల సంఘాలు ఏర్పాటు అవుతున్నాయని, అయితే వాటి వల్ల ఆ సంఘ నాయకులు బాగుపడుతున్నారేమో తెలియదు గానీ, ఆ కుల ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ‘గత ముఖ్యమంత్రి మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అంటూ రాజధాని ప్రాంతాన్ని ఇంకా పెంచారు. మూడు జిల్లాలు కలిపి రాజధాని అంటున్నారు. అంతా చేయాలంటే ఎప్పటికి సాగుద్ది.. రాజధాని రాత్రికి రాత్రే పూర్తవదు. హైదరాబాద్‌లో ఇంకా జరుగుతున్నాయి. రాజధాని విషయంలో రాష్ట్రంలో ఏకాభిప్రాయం లేదు. అయినా అందరూ కూర్చొని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దానిని ముందుకు తీసుకెళ్లాలి’ అని చెప్పుకొచ్చారు.   

Advertisement
 
Advertisement
Advertisement