
ఎడాపెడా వాడేస్తున్న ప్రజలు.. వాటిని తిరిగి చెల్లించలేక తీవ్ర అవస్థలు
దేశంలో మార్చి నాటికి రూ.2.90 లక్షల కోట్ల బకాయిలు
క్రెడిట్ కార్డుల ద్వారా రూ.21.09 లక్షల కోట్లు ఖర్చు చేసిన ప్రజలు
సీఆర్‌ఐఎఫ్ హైమార్క్ నివేదిక
దేశంలో ఒకప్పుడు సంపన్నులకే పరిమితమైన క్రెడిట్ కార్డులు.. ఇప్పుడు అందరికీ చేరువయ్యాయి. పెట్రోల్ కొట్టించాలన్నా, ఇంట్లో సరుకులు కొనాలన్నా, మెడిసిన్ తీసుకోవాలన్నా, షాపింగ్ చేయాలన్నా.. అవసరం చిన్నదైనా, పెద్దదైనా క్రెడిట్ కార్డులు తీసి ఎడాపెడా వాడేస్తున్నారు. తీరా బిల్లులు వచ్చాక వాటిని కట్టలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఇలా సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించలేకపోవడం వల్ల దేశంలో బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోతున్నాయి. 2025 మార్చి నాటికి దేశంలో ఏకంగా రూ.2.90 లక్షల కోట్ల క్రెడిట్ కార్డు బకాయిలు ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ‘సీఆర్‌ఐఎఫ్ హైమార్క్’ నివేదిక వెల్లడించింది. –సాక్షి, అమరావతి
నివేదికలోని అంశాలు..
» దేశంలో క్రెడిట్‌కార్డు లావాదేవీలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి దేశంలో క్రెడిట్ కార్డుల ద్వారా రూ.21.09 లక్షల కోట్లు ఖర్చు చేశారు. గతేడాది కంటే క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు 15 శాతం పెరిగాయి.
» అలాగే 2025 మార్చి ఒక్క నెలలోనే అన్ని కేటగిరీల్లో కలిపి రూ.34 వేల కోట్ల బకాయిలున్నాయి. మార్చికి సంబంధించి 91 రోజుల నుంచి 180 రోజుల కేటగిరీలో రూ.29,983 కోట్ల బకాయిలు ఉండటం గమనార్హం. దేశంలో క్రెడిట్ కార్డుదారులు ఎక్కువగా ఈ కేటగిరీకే మొగ్గు చూపుతున్నారు.
» గతేడాది 91 రోజుల నుంచి 180 రోజుల కేటగిరీలో 6.9 శాతం మంది బిల్లులు బకాయిపెట్టారు. ఈ ఏడాది వారు 8.20 శాతానికి పెరిగారు. ఇక 91 రోజుల నుంచి 360 రోజుల కేటగిరీలో సకాలంలో బిల్లులు చెల్లించనివారు 1.1 శాతానికి పెరిగారు.
» ఈ ఏడాది మే నెలలో భారతీయులు క్రెడిట్ కార్డుల ద్వారా రూ.1.89 లక్షల కోట్లు ఖర్చు చేశారు. అలాగే మే నాటికి దేశంలో యాక్టివ్ క్రెడిట్ కార్డుదారులు 11.11 కోట్ల మంది ఉన్నారు.
క్రెడిట్ కార్డు ఓ లైఫ్‌స్టైల్!
క్రెడిట్ కార్డు కలిగి ఉండటం ఆధునిక లైఫ్ స్టైల్‌గా మారిపోయింది. అందుకే దేశంలో క్రెడిట్ కార్డుదారుల సంఖ్య భారీగా పెరుగుతోంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కూడా వివిధ ఆఫర్లతో ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లు, రివార్డు పాయింట్లు, ఎయిర్‌పోర్టుల్లో ఫ్రీ లాంజ్ యాక్సెస్, నో కాస్ట్ ఈఎంఐ.. ఇలా వివిధ రకాల ఆఫర్లతో తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. దాంతో క్రెడిట్‌కార్డులు తీసుకోవడం ఆధునిక జీవనశైలిగా రూపాంతరం చెందుతోంది.
సకాలంలో చెల్లించకపోతే అంతే...
పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన దేశంలో క్రెడిట్‌కార్డు చాలా ఖరీదైన వ్యవహారం. నిర్ణీత సమయంలో బిల్లులు చెల్లించకపోతే వడ్డీల భారం భరించాల్సిందే. అటువంటి వారిపై వార్షిక వడ్డీ రేటు 42 శాతం నుంచి 46 శాతంగా ఉంది. బకాయిలు సకాలంలో చెల్లించకపోతే వారి క్రెడిట్ స్కోర్‌పైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. వారికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సుముఖత చూపవు. క్రెడిట్ స్కోర్ సరిగ్గా లేనివారికి కొన్ని సంస్థలు ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా సమ్మతించట్లేదు. అందుకే క్రెడిట్ కార్డులను విచక్షణతో ఉపయోగించాలని.. నిర్ణీత వ్యవధిలో బిల్లులు చెల్లించాలని సీఆర్‌ఐఎఫ్ నివేదిక సూచించింది.