
విజయవాడ: గతేడాది వచ్చిన బుడమేరు వరదతో విజయవాడ ప్రజలు నేటికీ కోలుకోలేదన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ బాబూరావు. బుడమేరుకు వరద వచ్చి ఏడాది పూర్తి అవుతుందని, ఇప్పటికీ ఎన్టీఆర్, కృష్ణా జిల్లా వాసులను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆ సమయంలో వేల కోట్ల ఆస్తి నష్టం జరిగిందని, నేటికీ విజయవాడ ప్రజలు ఇంకా తిరిగి కోలుకోలేదని విమర్శించారు.
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీపీఎం పాదయాత్రలో భాగంగా ఈరోజు(ఆదివారం, ఆగస్టు 24) మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ‘వర్షానికే నీరు రోడ్ల మీద నిలిస్తేనే ప్రజలు భయపడుతున్నారు..బుడమేరు వల్ల ప్రమాదం లేదనే భరోసా ప్రభుత్వం ఇవ్వలేకపోయింది.
ఆపరేషన్ బుడమేరు అమలు కాలేదు. కేంద్రం నుండి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకొని రాలేకపోయింది. రూ. 700కోట్లు దాతలు విరాళాలు ఇస్తే కొవ్వొత్తులు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్‌కి ఖర్చు చేశారు. శాశ్వత నివారణ చర్యలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ప్రాజెక్టు రిపోర్ట్ లేదు, ఒక్క ఇటుక పడలేదు. కేవలం గండి పడిన చోట రూ. 30కోట్లతో పని చేశారు.. మిగిలిన చోట అసలు పని జరగలేదు. ఆపరేషన్ బుడమేరు కోసం పోరాటానికి సిద్ధం అవుతున్నాం.
రూ. 10వేల కోట్లు శాశ్వత పనులు చేయాలి. సమాంతరంగా మరో కాలువ తవ్వాలి. బుడమేరుకు కూడా రిటనింగ్ వాల్ నిర్మించాలి. దిగువకు నీరు పోయే ప్రదేశాన్ని పెంచాలి. కలెక్టరేట్‌లో ఉండి హడావిడి చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు. అమరావతి ముంపుపై మాట్లాడుతున్న చంద్రబాబు బుడమేరుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు మొద్దు నిద్రలో ఉన్నారు. గతంలో నష్టపోయిన వారికి నేటికి నష్ట పరిహారం అందలేదు.
దాతలు ఇచ్చిన డబ్బును కూడా బాధితులకు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. బుడమేరు పరివాహక ప్రాంతంలో పాదయాత్ర. 30వ తేదీన బారి సభ నిర్వహిస్తున్నాం. ఎంత నిధులు ఖర్చు చేశారు.. ఎమ్ చర్యలు తీసుకున్నారో శ్వేతా పత్రం విడుదల చేయాలి.బుడమేరు డైవర్షన్ చానల్ లోతు, వెడల్పు పెంచారా?, బుడమేరు కనీసం పూడిక కూడా తీయించలేదు. తూటుకాడే తీయించలేని ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చేసిందంటే ఎలా నమ్మాలి. ఎమ్మెల్యే అవివేకంతో మాట్లాడుతున్నారు.ప్రచార ఆర్బాటం తో కాకుండా శాశ్వత పనులు చేయాలి’ అని డిమాండ్ చేశారు.
ఇక సీపీఎం రాష్ట్ర కమిటీ సభయులు కాశీనాథ్ మాట్లాడుతూ.. ‘ బుడమేరు వద్ద తూటు కదా పేరుకుపోయింది. నిమ్మల రామానాయుడు నిర్మించమని చెప్పిన పని కూడా బీట్ల బారుతుంది. సింగినగర్ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నేటి నుంచి 29వ తేదీ వరకు బుడమేరు నివారణ చర్యలు తీసుకోవాలని పాదయాత్ర చేస్తున్నాం. 10వేలు కేంద్రాన్ని బుడమేరు కోసం అడగాలి...అప్పుడు కేంద్రం అప్పు ఇస్తుందో.. ముష్టి వేస్తారో తెలుస్తుంది. బుడమేరు కోసం మాట్లాడమంటే కొండవీటి వాగు కోసం మాట్లాడుతున్నారు’ అని మండిపడ్డారు.