సగం మంది ఆఫీసుకు వస్తే చాలు! | Sakshi
Sakshi News home page

కరోనా సెకండ్‌ వేవ్‌: ఇప్పట్లో ఇల్లు కదలక్కర్లేదు!

Published Mon, Dec 14 2020 8:37 AM

Corona Second Wave IT and BPO Companies WFH Upto March 2021 - Sakshi

సాక్షి, అమరావతి: వర్క్‌ ఫ్రం హోమ్‌.. దేశంలోని ఐటీ రంగం జపిస్తున్న మంత్రమిది. ఈ పరిణామం కీలక మార్పులకు నాంది పలుకుతూ.. ఐటీ రంగాన్ని పరోక్షంగా చిన్న పట్టణాలు, పల్లెలకు చేరువ చేస్తోంది. ఇది ఏపీకి సానుకూల అంశమని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని దాదాపు అన్ని ఐటీ, బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌సోర్సింగ్‌ (బీపీవో) కంపెనీలు ‘వర్క్‌ ఫ్రం హోమ్‌ (డబ్ల్యూఎఫ్‌హెచ్‌) విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉద్యోగులకు ఈ వెసులుబాటు ఈ నెల 31తో ముగియాల్సి ఉంది. కానీ దేశంలో ఇంకా కరోనా  ముప్పు తొలగకపోవడం.. సెకండ్‌ వేవ్‌ వస్తుందనే అంచనాలతో ఐటీ కంపెనీలు రిస్క్‌ తీసుకునేందుకు సాహసించడం లేదు. అందుకే తమ ఉద్యోగులకు డబ్ల్యూఎఫ్‌హెచ్‌ను 2021మార్చి 31 వరకు పొడిగించాలని నిర్ణయించాయి.  

98 శాతం మంది ఇంటినుంచే పని దేశంలో దాదాపు 45 లక్షల మంది ఐటీ, బీపీవో ఉద్యోగులు ఉన్నారు. వారిలో 98 శాతం మంది ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి డబ్ల్యూఎఫ్‌హెచ్‌ విధానంలోనే పని చేస్తున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలలో దాదాపు 9 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో దాదాపు 8.75 లక్షల మంది తమ ఇళ్ల నుంచే పని చేస్తున్నారు. టీసీఎస్‌ మరో అడుగు ముందుకేసి 2025 వరకు ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. కరోనా  ప్రభావం తొలగిపోయినా సరే 2025 వరకు కేవలం 25 శాతం మందే కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని.. 75 శాతం మంది డబ్ల్యూఎఫ్‌హెచ్‌ విధానంలోనే పని చేయాలన్నది ఆ కంపెనీ ఉద్దేశం. ఇన్ఫోసిస్‌ కూడా భవిష్యత్‌లో తమ ఉద్యోగులలో సగం మంది ఆఫీసుకు వస్తే చాలని భావిస్తోంది. దేశంలో ప్రముఖ కంపెనీలు నగరాల్లోని తమ కార్యాలయాల అద్దెలు, ఇతర నిర్వహణ భారాన్ని తగ్గించుకుంటున్నాయి. గత ఆరు నెలల్లో ఐటీ కంపెనీలు సగటున 40 శాతం వరకు కార్యాలయ భవనాలను ఖాళీ చేయడం గమనార్హం. కరోనా ప్రభావంతో కార్మిక చట్టం నిబంధనలను సడలించాలన్న ఐటీ, బీపీవో కంపెనీల వినతిపై కేంద్రం సానుకూలంగా స్పందిచడం కూడా కలిసొచ్చింది. ‘వర్క్‌  ఫ్రం హోమ్, వర్క్‌ ఫ్రం ఎనీవేర్‌’ అనే అంశాలకు స్థానం కల్పిస్తూ ఐటీ, ఇతర సర్వీస్‌ ప్రొవైడర్ల సేవల నిబంధనలను కేంద్రం ఇటీవల  సడలించింది. (శాశ్వత వర్క్‌ ఫ్రం హోం అవకాశం: మైక్రోసాఫ్ట్‌)

పల్లెలు చిన్న పట్టణాలకు సదవకాశం
వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానాన్ని దీర్ఘకాలం పాటు కొనసాగించాలని ఐటీ, ఇతర కంపెనీలు భావిస్తుండటం పల్లెలు, చిన్న పట్టణాలకు కలిసొస్తుంది. ప్రధానంగా మన రాష్ట్రానికి ఇది సానుకూల అంశం. ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్న ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఏపీకి చెందిన వారే. వారు రాష్ట్రం నుంచే పని చేనున్నారు. దీనివల్ల రాష్ట్రంలోని పల్లెలు, చిన్న పట్టణాలు కూడా ఐటీ, ఇతర సేవా కేంద్రాలుగా అభివృద్ధి చెందుతాయి.
– ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి, వీసీ, ఆంధ్రా యూనివర్సిటీ  

Advertisement
Advertisement