
మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌కు నోటీసు ఇస్తున్న పోలీస్
నేడు వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన కూటమి సర్కార్ భారీ ఆంక్షలు
సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా.. సెంట్రల్ జైలు చుట్టూ ముళ్లకంచె
వైఎస్సార్‌సీపీ శ్రేణులను కట్టడి చేసే పనిలో పోలీసులు నిమగ్నం
జన సమీకరణ చేసినా, ర్యాలీలు నిర్వహించినా చర్యలు తప్పవని నోటీసులు
ప్రభుత్వానికి ఎందుకింత భయం అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న ప్రజలు
నెల్లూరు (క్రైమ్): వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటనకు పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. భద్రత పేరిట ఆ పార్టీ శ్రేణులు, ప్రజలను కట్టడి చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. జన సమీకరణ చేసినా, ర్యాలీలు నిర్వహించినా చర్యలు తప్పవంటూ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ప్రధాన నాయకులందరికీ పోలీసు అధికారులు నోటీసులు జారీ చేశారు.
జగన్ పర్యటనలో పాల్గొనడానికి ఎవరికీ అనుమతి లేదని, అందువల్ల ఎవరూ వెళ్లరాదని, ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ప్రజలను హెచ్చరించారు. పోలీసులు మరీ ఇంతగా ఆంక్షలు విధించడంపై ప్రజలు మండి పడుతున్నారు. వైఎస్ జగన్ గురువారం (నేడు) నెల్లూరులో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు చెముడుగుంట డీటీసీ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
అక్కడి నుంచి జిల్లా కేంద్ర కారాగారం వద్దకు వెళతారు. రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్ అవుతారు. అనంతరం నగరంలోని సుజాతమ్మ కాలనీలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.
రహదారుల దిగ్బంధం
వైఎస్ జగన్‌కు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతుండటం, ఆయన రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అభిమానాన్ని చాటుకుంటుండడం చూసి ఓర్వలేని కూటమి నేతలు పోలీసుల ద్వారా జగన్ పర్యటనలకు భారీగా ఆంక్షలు విధిస్తున్నారు. అయితే ఆంక్షలు తమకు అడ్డంకులు కావంటూ పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు పోటెత్తుతున్నారు. నెల్లూరు పర్యటనకు సైతం భారీగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు వచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో పోలీసులు ఆంక్షలను మరింత కఠినతరం చేశారు.
హెలిప్యాడ్ వద్ద 10 మంది, ములాఖత్‌కు ముగ్గురికి మాత్రమే అనుమతులిచ్చారు. వారు మినహా ఇతరులెవరూ కేంద్ర కారాగారం వద్దకు రావొద్దని, వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కేంద్ర కారాగారానికి వచ్చే అన్ని రహదారులను బారికేడ్లతో మూసివేసి, భారీగా పోలీసులను మోహరిస్తున్నారు. కారాగారం చుట్టూ ముళ్ల కంచె ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం హెలిప్యాడ్ నుంచి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి వరకు ట్రయల్ కాన్వాయ్ జరిగింది.

ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి 100 మందికి మాత్రమే అనుమతిచ్చారు. ములాఖాత్ అనంతరం చెముడుగుంట, బుజబుజనెల్లూరు జాతీయ రహదారి, అయ్యప్పగుడి మీదుగా జగన్ ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళతారు. దీంతో ఆయా ప్రాంతాలను పోలీసు అధికారులు తమ ఆ«దీనంలోకి తీసుకున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద పోలీసు బలగాలను మోహరించారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
జగన్ పర్యటించే ప్రాంతంలో 10 డ్రోన్‌లు, 40 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. ఇదంతా ఆంక్షల ఉల్లంఘనలపై కేసులు నమోదు చేసేందుకేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, నగరంలో ఏర్పాట్లు చూస్తున్న ప్రజలు.. వైఎస్ జగన్ వస్తుంటే ప్రభుత్వానికి ఎందుకింత భయం అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.