ఫ్యాక్ట్‌ చెక్‌ : తప్పుదోవ పట్టించేందుకే తప్పుడు రాతలు

CM YS Jagan Comments On Eenadu Ramoji Rao Fake News - Sakshi

విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తున్నా వాస్తవాలకు ‘ఈనాడు’ రామోజీ వక్రీకరణ

విద్యా సంవత్సరంలో త్రైమాసికం ముగిసిన తర్వాత విద్యా దీవెన చెల్లింపు

అక్టోబర్‌–నవంబర్‌–డిసెంబర్‌ 2022కు మార్చి 19న రూ.684.52 కోట్ల చెల్లింపు

జనవరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికానికి రూ.702.99 కోట్లు మే 24న విడుదలకు ఏర్పాట్లు 

సంక్షేమ కేలండర్‌ ప్రకారం క్రమం తప్పకుండా నిధులు విడుదల 

విద్యా రంగంలో సంస్కరణలకు ఈ 45 నెలల్లో చేసిన వ్యయం రూ.57,642.36 కోట్లు

గత ప్రభుత్వపు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.1,778 కోట్లు కూడా చెల్లింపు

ఈ ప్రభుత్వం ఏడాదికి చెల్లిస్తున్న మొత్తం రూ.3,311 కోట్లు.. 

విద్యా దీవెన, వసతి దీవెనకు ఇప్పటిదాకా రూ.14,210 కోట్లు చెల్లింపు.. అయినా.. విద్యార్థులకు బకాయిలంటూ రామోజీ రోత రాతలు

సాక్షి, అమరావతి: విద్యపై చేసే ఖర్చు భవిష్యత్తు తరానికి పెట్టుబడి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ‘జగనన్న విద్యా దీవెన’ పథకం కింద సంక్షేమ కేలండర్‌ ప్రకా­రం విద్యా సంవత్సరంలో త్రైమాసికానికి ఒకసారి క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే పేదింటి పిల్లలు కూడా ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కాకూడదని అంగన్‌వాడీ నుంచి ఇంజినీరింగ్, మెడిసిన్‌తోపాటు విదేశాల్లో చదువుకునేందుకూ ఈ ప్రభుత్వమే అండగా నిలుస్తోంది.

ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థినీ ప్రోత్సహిస్తోంది. ముఖ్యమంతి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గత 45 నెలల్లో కేవలం విద్యా రంగంలో సంస్కరణల కోసం రూ.57,642.36 కోట్లు ఖర్చుచేసింది. ఉన్నత సంకల్పంతో అమలుచేస్తున్న పథకాలతో వచ్చిన మార్పులు, వాటి ఫలితాలు కళ్ల ముందే కనిపిస్తున్నా పచ్చ గంతలు కట్టుకున్న ‘ఈనాడు’ తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తోంది. 

సంక్షేమ కేలండర్‌ ప్రకారమే నిధులు విడుదల
విద్యా సంస్థల యాజమాన్యాల నుంచి విద్యార్థులకు ఫీజుల ఒత్తిడి లేకుండా ‘జగనన్న విద్యా దీవెన’ కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజును ఆ త్రైమాసికం పూర్తయిన తర్వాత ప్రభుత్వం చెల్లిస్తోంది. అక్టోబరు–నవంబర్‌–డిసెంబరు–2022 త్రైమాసికానికి 9,86,092 మంది విద్యార్థులకు రూ.684.52 కోట్లను మార్చి 19న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేసింది. జనవరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికానికి మే 24న రూ.702.99 కోట్లు అందించేందుకు ఏర్పాట్లుచేస్తోంది.

ముందుగా నిర్దేశించిన సంక్షేమ కేలండర్‌ ప్రకారమే, క్రమం తప్పకుండా ఇలా నిధులు విడుదల చేస్తున్నా.. వాస్తవాలను కప్పిపుచ్చి పచ్చ పత్రిక రోత రాతలు రాస్తోంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ చదువుతున్న 9,55,662 మంది పిల్లలకు ‘వసతి దీవెన’ కింద రూ.912.71 కోట్లను ఏప్రిల్‌ 26న జమచేసింది. అయినప్పటికీ ఈనాడు పత్రిక ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ‘జగనన్నా ఇదేనా విద్యా దీవెన’ అంటూ అవాస్తవాలతో కూడిన కథనం వండి వార్చింది. 

అప్పట్లో అరకొర చెల్లింపులు.. అనేక కొర్రీలు
గత ప్రభుత్వంలో కాలేజీల ఫీజులు కాలేజీ స్థాయిని బట్టి రూ.70 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు ఉండేవి. విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మాత్రం రూ.35 వేలకే పరిమితం చేసి, అది కూడా ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి. పైగా ఏళ్ల తరబడి బకాయిలు. అప్పట్లో ఫీజులు కట్టలేక తల్లిదండ్రుల ఆవేదను కనీసం పట్టించుకోని ఈనాడు.. ఇప్పుడు అన్నీ సక్రమంగా జరుగుతున్నా బురద జల్లుతోంది. చంద్రబాబు హయాంలో చివరి రెండేళ్లు (2017–18, 2018–19) రూ.1,778 కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని చెల్లించకుండా ఎగ్గొట్టింది. అలాగే, విద్యార్థుల వసతి కోసం అనేక కొర్రీలూ పెట్టింది.

కుల ప్రాతిపదికన, కోర్సుల ప్రాతిపదికన రూ.4 వేల నుంచి రూ.10 వేలు మాత్రమే తక్కువ మందికి ఇచ్చింది. డిపార్ట్‌మెంట్‌ అటాచ్డ్‌ హాస్టళ్లల్లో ఈబీసీ, కాపు విద్యార్థులకు చోటులేకుండా చేసింది. అంతేకాక.. బాబు జమానాలో విద్యార్థులు ప్రభుత్వ పథకాలు పొందాలంటే బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీ విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.లక్ష.. ఎస్సీ, ఎస్టీలకు రూ.2 లక్షల లోపు ఉండాలని నిబంధన పెట్టి ఎంతోమంది విద్యార్థులను ప్రభుత్వ పథకాలకు దూరం చేసింది. ఇవేవీ ఆ పచ్చ పత్రికకు పట్టవు.  

ఈ నాలుగేళ్లలో విద్య, వసతి దీవెనకు రూ.14,210 కోట్లు..
కానీ, ప్రసుత్త ప్రభుత్వం విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.2.50 లక్షలకు పెంచి లక్షల మంది విద్యార్థులను ప్రభుత్వ పథకాలకు చేరువ చేసింది. ఏ విద్యార్థి చదువూ ఆగిపోరాదని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ఏటా సగటున రూ.3,311 కోట్లు చొప్పున రూ.9,934 కోట్లు ఇప్పటికే చెల్లించింది. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అందరికీ ‘జగనన్న వసతి దీవెన’ కింద ఐటీఐ విద్యార్థులకైతే రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ వారికి రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ చదువుతున్న వారికి రూ.20 వేలు చొప్పున ఏడాదిలో రెండుసార్లు తల్లుల ఖాతాల్లో జమచేస్తోంది.

ఈ పథకం కింద ఇప్పటిదాకా విద్యార్థులకు రూ.4,275.76 కోట్లు చెల్లించింది కూడా. అంటే ఈ రెండు పథకాల కోసమే ప్రభుత్వం 2019–20 నుంచి 2022–23 వరకు (మే 24న విద్యా దీవెన కింద చెల్లించే రూ.702.99తో కలిపి) సుమారు రూ.14,210 కోట్లను క్రమం తప్పకుండా విడుదల చేసింది. ఇదేదీ ‘ఈనాడు’కు కనిపించదు.

విద్యార్థులకు అండగా ‘1902’ టోల్‌ఫ్రీ నంబర్‌.. 
ఫీజుల విషయంలో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఎవరైనా యాజమాన్యలు వినకపోతే ఆ ఫిర్యాదులు తీసుకునేందుకు 1902 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైనా ఈ నంబర్‌కు ఫిర్యాదు చేస్తే.. ముఖ్యమంత్రి కార్యాలయమే (సీఎంఓ) నేరుగా కాలేజీలతో మాట్లాడుతోంది.

పిల్లలకు ఫీజులు పూర్తిగా ఇవ్వడమే కాకుండా, వారు వసతి కోసం, భోజనం కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని, ఆ ఖర్చులు కూడా భారం కాకూడదని.. తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని జగనన్న వసతి దీవెన ద్వారా క్రమం తప్పకుండా ఆ మొత్తాన్ని చెల్లిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం కింద కూడా క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తోంది. కానీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు నాలుగేళ్ల విద్యా సంవత్సరం ముగుస్తున్నా ఒక్క త్రైమాసికానికి మాత్రమే నిధులు చెల్లించిందంటూ ఈనాడు నిరాధార ఆరోపణులు చేయడం సిగ్గుచేటు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top