AP: బిర్లాతో ఉపాధికి ఊతం | Sakshi
Sakshi News home page

AP: బిర్లాతో ఉపాధికి ఊతం

Published Sat, Dec 25 2021 4:31 AM

CM Jagan Lays stone Aditya Birla Group Garment Making Unit Pulivendula - Sakshi

ప్రగతి పతాకాలతో రెపరెపలాడుతున్న పులివెందుల సొంత గడ్డను, వైఎస్సార్‌ జగనన్న హౌసింగ్‌ లే అవుట్‌ను హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ చూస్తుంటే గర్వంగా ఉంది. నామీద మీకున్న అభిమానం, ప్రేమ, మమకారం, ఆప్యాయతల మధ్య ఈ రోజు వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో 7,309 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. పక్కనే బ్రాహ్మణపల్లెలో మరో 733 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇవన్నీ కూడా మొదట్లోనే (గత క్రిస్మస్‌ రోజున) అందరితోపాటు చేద్దామనుకున్నాం. కానీ రకరకాల కోర్టు కేసులు, గిట్టని వారు రకరకాల ఇబ్బందులు పెట్టిన పరిస్థితుల్లో ఆ చిక్కుముడులన్నింటినీ విప్పుకుని ఈ క్రిస్మస్‌ సందర్భంగా మొత్తం 8,042 మంది అక్కచెల్లెమ్మల చేతుల్లో ఈ ఆస్తిని పెడుతున్నాం. – సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, కడప/ పులివెందుల/టౌన్‌/రూరల్‌: బిర్లా పరిశ్రమ రాకతో వైఎస్సార్‌ జిల్లాలోని పులివెందుల పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఆయన పులివెందులలోని సంయు గ్లాస్‌ ఫ్యాక్టరీ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ రిటైల్‌ లిమిటెడ్‌ కంపెనీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదిత్య బిర్లా గ్రూపు వస్త్ర ఉత్పత్తి కేంద్రం పులివెందులలో ఏర్పాటు చేయడం చరిత్రాత్మకమని, సంతోషదాయకమని అన్నారు.

ప్రపంచంలోనే 500 పెద్ద కంపెనీల్లో ఆదిత్య బిర్లా కంపెనీ ఒకటి అని తెలిపారు. ఈ కంపెనీలో 85 శాతం మంది మహిళలకే ప్రాధాన్యత ఇస్తూ సుమారు 2 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఈ కంపెనీకి దేశ వ్యాప్తంగా 3031 ఫ్యాషన్‌ రిటైల్‌ స్టోర్స్‌ ఉన్నాయని, 25 వేల మల్టీ బ్రాండ్స్‌ దుకాణాలు, 6,500 డిపార్ట్‌మెంట్స్‌ స్టోర్స్‌ను నడుపుతోందన్నారు. వ్యాన్‌ హ్యుసేన్, అలెన్‌ సోలీ వంటి పెద్ద, పెద్ద బ్రాండ్లను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తూ.. 2020–21లో రూ.8,700 కోట్ల టర్నోవర్‌తో ముందుకు సాగిందని చెప్పారు. 
 
మా సహకారం ఎప్పుడూ ఉంటుంది 
పులివెందులలో రూ.110 కోట్ల పెట్టుబడితో 2112 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నందుకు కుమార మంగళం బిర్లా, అశిష్, చీఫ్‌ సప్లయ్‌ ఆఫీసర్‌ స్వామినాథన్, కార్పొరేట్‌ ఎఫైర్స్‌ హెడ్‌ వివేక్, అతని బృంద సభ్యులకు సీఎం వైఎస్‌ జగన్‌ ధన్యవాదాలు తెలిపారు. ‘ఇక్కడికి సమీపంలో పెద్ద హౌసింగ్‌ కాలనీ రాబోతోంది. 7400 ఇళ్లు నిర్మించబోతున్నాం. దాదాపు 25 వేల మంది ప్రజలు ఇక్కడ నివసించబోతున్నారు. ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయి. ప్రభుత్వమే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కళాశాలలు నిర్మిస్తోంది. ఇది మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. దీని సహాయంతో మీరు మా వాళ్లకు శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. వీటన్నింటితో పాటు నేను కూడా అందుబాటులో ఉంటాను. భవిష్యత్‌లో మరింత మెరుగైన ఫలితాలు సాధించడానికి, సత్సంబంధాలు నెలకొల్పే దిశగా ఇరువైపులా ఇది ఉపయోగపడుతుంది’ అని అన్నారు. అనంతరం ఆయన ఆదిత్య బిర్లా కంపెనీ ప్రతినిధులకు భూమి కేటాయింపు పత్రాలు అందజేశారు.  వారు మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్ర పటాన్ని సీఎం వైఎస్‌ జగన్‌కు అందించారు. ఆ తర్వాత ఆదిత్య బిర్లా ఎండీ ఆశిష్‌ దీక్షిత్‌ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం తమకు అన్ని విధాలా సహకరిస్తోందని చెప్పారు. త్వరలోనే పరిశ్రమను నెలకొల్పి ఎక్కువ శాతం మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.

మార్కెట్‌ యార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో నాగలితో సీఎం జగన్‌  
  
పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం   
సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం పులివెందుల వ్యవసాయ మార్కెట్‌ యార్డులో రూ.10.50 కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. చీనీ రైతుల సౌకర్యార్థం రూ.4 కోట్ల 79 లక్షలతో నిర్మించిన షెడ్డును ప్రారంభించారు. ఆర్‌అండ్‌బీ బంగ్లా ఎదురుగా రూ.3.64 కోట్లతో నిర్మించిన మోడల్‌ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించారు. పెద్దముడియం, శ్రీ అవధూత కాశినాయన మండలాల్లో పోలీసుస్టేషన్లను ఇక్కడి నుంచే ప్రారంభించారు. అంబకపల్లె రోడ్డులోని రాణితోపు పార్కు ఎదురుగా రూ.2.60 కోట్లతో నిర్మించిన ఫిష్‌ ఆంధ్ర అక్వా హబ్‌ను ప్రారంభించారు. నియోజకవర్గంలో 100కు పైగా ఫిష్‌ కియోస్క్‌లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం చెప్పారు. రీటైల్‌ షాపులు త్వరలోనే అన్నిచోట్ల రాబోతున్నాయన్నారు. రాష్ట్రంలో 70 ఆక్వా హబ్‌లు, 14 వేల రీటైల్‌ షాపులు పెడుతున్నామన్నారు. దీనివల్ల చేపలు, రొయ్యలు పండించే రైతులకు మంచి ధర వస్తుందని చెప్పారు. 

మోడల్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

 సొంతింటి కల నెరవేర్చడం ఆనందంగా ఉంది 
పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నందుకు ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. పులివెందుల సమీపంలోని మెగా టౌన్‌షిప్‌ లే అవుట్‌ కాలనీలో 8,042 మంది మహిళలకు ఇంటి పట్టాలు, ఇల్లు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  
హెలికాప్టర్‌లో వస్తున్నప్పుడు 323 ఎకరాల్లో ఉన్న ఈ కాలనీ మొత్తం చూశాను. ఇంత మందికి ఇక్కడ ఇళ్లు కట్టించే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. ఒక్కో ఇంటి పట్టా విలువ రూ.2 లక్షలు.. ఇల్లు కట్టడానికి మరో రూ.2 లక్షలు.. ఆ తర్వాత అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, ఏడు వార్డు సచివాలయాలు, రెండు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఏడు ప్రాథమిక పాఠశాలలు, 15 ఎకరాల్లో మంచి పార్కులు, ఒక పోలీసుస్టేషన్, ఒక పోస్టాఫీసు, 10 ఎకరాల్లో మంచి ఆటస్థలం.. ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు అవుతున్నాయి.  
రూ.28 కోట్లతో నీటి సరఫరా, రూ.49 కోట్లతో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, రూ.69 కోట్లతో రోడ్ల నిర్మాణం మొత్తం కలిపి రూ.147 కోట్లు ఇక్కడ ఖర్చు చేస్తున్నాం. ఇందులో ఇంటికి సగటున మరో రూ.2 లక్షలు ఖర్చుపెడుతున్నాం. మొత్తంగా రూ.6 లక్షలు. ఇవన్నీ పూర్తయ్యాక ఇక్కడ ఇంటి విలువ కనీసం రూ.10 లక్షలు ఉంటుంది. ఈ మొత్తాన్ని అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టినట్లవుతుంది.

 మెగా టౌన్‌షిప్‌ లే అవుట్‌ కాలనీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమ ప్రారంభోత్సవంలో సీఎం జగన్‌  
 
ఈ పక్కనే ఇండస్ట్రియల్‌ పార్క్‌ 
ఈ కాలనీ పక్కనే ఇండస్ట్రియల్‌ పార్కు రాబోతోంది. అపాచీ అంటే అడియాస్‌ షూ తయారు చేసే కంపెనీని తీసుకువచ్చాం. ఆ పనులు కూడా జరుగుతున్నాయి. అక్కడ దాదాపు 2 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరకుతాయి. ఆదిత్య బిర్లా కంపెనీ కూడా ఇక్కడే వస్తుంది. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక ఈ కంపెనీలకు నడుచుకుంటూ వెళ్లి ఉద్యోగాలు చేసుకోవచ్చు. నెలకు కనీసంగా రూ.10 వేలో, రూ.15 వేలో సంపాదించొచ్చు.  మంచి జీతాలతో ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి.  

ఫిష్‌ ఆంధ్ర ఆక్వా హబ్‌లో ఉత్పత్తులను పరిశీలిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌  
 
శరవేగంగా అభివృద్ధి పనులు 
 పులివెందులలో రూ.500 కోట్లతో చేపట్టిన వైఎస్సార్‌ ప్రభుత్వ వైద్య కళాశాల పనులు వేగంగా సాగుతున్నాయి. 500 పడకల ఈ మెడికల్‌ కాలేజీ 2023 డిసెంబర్‌ నాటికి అందుబాటులోకి వస్తుంది. 
 నూతన బస్సు డిపో, బస్సు స్టేషన్‌ నిర్మాణ పనులు, శిల్పారామం ఆధునీకరణ పనులు, పులివెందుల క్రీడా మైదానం (ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌) పనులు, ఉలిమెల్ల సరస్సు అభివృద్ధి పనులు, పులివెందుల యూజీబీ నిర్మాణ పనులు, సమగ్ర నీటి సరఫరా పథకం పనులు గడువులోగా పూర్తి చేస్తాం. 
 ఇడుపులపాయ పర్యాటక సర్క్యూట్, వైఎస్సార్‌ మెమోరియల్‌ గార్డెన్‌ అభివృద్ధి పనులు, గండి వీరాంజనేయస్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులు, వివిధ కళాశాలల్లో, పాఠశాలల్లో నిర్మాణ పనులు గడువులోగా పూర్తవుతాయి. 
 రూ.480 కోట్లతో పులివెందుల నియోజకవర్గంలో వాటర్‌ గ్రిడ్‌ పనులు 2022 జూన్‌ నాటికి, రూ.5,036 కోట్లతో పులివెందుల, రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లోని ఆయకట్టును స్థిరీకరించేందుకు చేపట్టిన జీఎన్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కాలువ నుండి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ కాలువకు నీటి ఎత్తిపోతల పథకం పనులు 2023 జూన్‌ నాటికి పూర్తవుతాయి.  
 రూ.1,100 కోట్లతో చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుండి ఎర్రబల్లి చెరువుకు నీటిని నింపడం ద్వారా వేంపల్లె మండలంలోని యురేనియం ప్రభావిత ఏడు గ్రామాలకు నీటి సరఫరా నిమిత్తం చేపట్టిన ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు 2022 డిసెంబరు నాటికి పూర్తవుతాయి.  
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు ఎస్‌బీ అంజద్‌బాష, ధర్మాన కృష్ణదాస్, మంత్రులు ఆదిమూలపు సురేష్, రంగనాథరాజు, సీదిరి అప్పలరాజు, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

నన్ను గుండెల్లో పెట్టుకున్నారు 
సభ ప్రారంభంలో వైఎస్‌ జగన్‌.. చేతిలో ఉన్న మైకును చేతితో కొడుతూ.. ‘ఇలా పులివెందులలో కొట్టడం ద్వారా వచ్చే ఆనందం మరెక్కడా రాదు. నన్ను మీ గుండెల్లో పెట్టుకుని ఆప్యాయత చూపిస్తున్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అవ్వ, తాత, ప్రతి సోదరుడు, స్నేహితుడికి శిరస్సు వంచి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అన్నారు. సభానంతరం ముఖ్యమంత్రి.. రేణుక, షేక్‌ అప్సాబి, ఓబిగారి బీల అనే మహిళలకు  ఇంటి పట్టాలు, గృహ మంజూరు పత్రాలను అందజేశారు.

జగనన్న మా దైవం..
మెగా టౌన్‌షిప్‌ లే అవుట్‌లో ఇంటి స్థలంతోపాటు ఇంటి మంజూరు పత్రాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకోవడం సంక్రాంతి పండుగ ఈరోజే వచ్చినంత సంబరంగా ఉంది. నా భర్త ఆటో డ్రైవర్‌. తొమ్మిదేళ్లుగా అద్దె ఇంట్లో నివసిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో అనేక సార్లు తిరిగినా మాకు ఇంటి పట్టా మంజూరు కాలేదు. అయితే జగనన్న పుణ్యమా అని ఇవాళ ఆయన చేతుల మీదుగా ఏకంగా ఇంటి మంజూరు పత్రాలు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. అమ్మ ఒడి, ఆసరా వంటి ప్రభుత్వ పథకాల వల్ల మా లాంటి వాళ్లందరం చాలా సంతోషంగా ఉన్నాం. కరోనా సమయంలో జగనన్న చాలా బాగా ఆదుకున్నారు. ఆయన మేలు ఎప్పటికీ మరచిపోం. జగనన్న మా దైవం. ఎన్ని కష్టాలున్నా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలకు మేలు చేస్తున్న జగనన్నకు వందనం. – రేణుక, పులివెందుల  

Advertisement
Advertisement