సూపర్ సిక్స్‌లు.. సెవెన్లపై చర్చించకుండా మహానాడు పేరుతో గొప్ప హైడ్రామా
రెండేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలపై కనీస చర్చ లేకుండా అంతా బాబు భజన
తాము కొత్తవి ఇవ్వకపోగా.. జగన్ ఇచ్చిన పథకాలన్నీ ఎందుకు రద్దు చేశారో చెప్పకుండా వంచన
విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు నిర్వీర్యంపై చర్చించకుండా దాటవేత
6 లక్షల పెన్షన్లు ఎందుకు తగ్గాయి? 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న హామీ ఏమైంది?
మెగా డీఎస్సీలో అర్హులకు తీవ్ర అన్యాయంపై మాట మాత్రమైనా చర్చించరా?
ఇప్పుడు బాబు క్యాబినెట్‌లో, రాజ్యసభలో మహిళలకు అవకాశం
కల్పించకుండా ఎప్పుడో జరిగే ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ మరో వంచన
మొత్తంగా బోరు కొట్టించే ప్రసంగాలు
జగన్‌పై వ్యక్తిగత విమర్శలు మినహా మహానాడులో ఏ ఒక్క అంశంపై అయినా నిర్మాణాత్మక చర్చ ఏది?
‘డిజిటల్’ డ్రామా అట్టర్‌ఫ్లాప్.. వెలవెలబోయిన క్లస్టర్ ప్రాంగణాలు
సొంత క్యాడర్‌కే బోర్ కొట్టించేలా ఊకదంపుడు ఉపన్యాసాలు
ఎప్పటిలానే ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ మరోసారి ఉత్తుత్తి తీర్మానం
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్‌లు.. సెవెన్లు ఇస్తామంటూ అందరినీ నమ్మించి రెండేళ్లైనా వాటి ఊసే లేకుండా పాలన సాగించిన చంద్రబాబు కనీసం ఈ మహానాడులోనైనా వాటి గురించి ప్రస్తావిస్తారని ఆశించిన ప్రజలకు తీవ్ర నిరాశను మిగిలిస్తూ ‘డిజిటల్’ పేరుతో గొప్ప హైడ్రామాను రక్తి కట్టించారు! సూపర్ సిక్స్‌లు, సెవెన్లు సహా ప్రజలకు ఇచ్చిన 143 హామీలను ఎందుకు అమలు చేయలేదో.. పోనీ ఎప్పటి నుంచి చేస్తారో.. మహానాడులో కనీసం చర్చించిన పాపాన పోలేదు. చంద్రబాబు కొత్త పథకాలు ఇవ్వకపోగా.. మాజీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన పథకాలన్నీ ఎందుకు రద్దు చేశారో.. అందుకు కారణాలేమిటో చెప్పలేదు. దాదాపు రూ.పది వేల కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఎందుకు పేరుకుపోయాయి? వాటిని ఎప్పుడిస్తారో చెప్పలేదు. ఆరోగ్యశ్రీని పూర్తిగా నీరుగార్చి అంపశయ్యపైకి చేర్చారు. రోగులకు ‘ఆసరా’ ఊసే లేదు. అక్కచెల్లెమ్మలకు చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం మాటే లేదు.
వైఎస్ జగన్ హయాంలో శ్రీకాకుళం నుంచి హిందూపురం దాకా ప్రతి ఊరిలో కళకళలాడిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, నాడు – నేడుతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులను ఎందుకు భ్రష్టు పట్టించారంటే సమాధానం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతులకు ఉచిత పంటల బీమా ఎగరగొట్టారు.. ఇన్‌పుట్ సబ్సిడీ ఎందుకివ్వడం లేదో చెప్పలేదు. కనీవిని ఎరుగని రీతిలో అన్నదాతలు ఎరువుల కోసం రోడ్లపైకి చేరుకుని అధిక ధరలకు యూరియా కొనుగోలు చేయాల్సిన దుస్థితి దాపురిస్తే దాని గురించి మహానాడులో కనీసం చర్చ లేదు. మళ్లీ సమస్య తలెత్తకుండా ఏం చేస్తారో చెప్పలేదు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏకంగా 6 లక్షల పెన్షన్లు ఎందుకు తగ్గాయో సమాధానం లేదు. 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న హామీ ఎటుపోయిందో చెప్పలేదు. అమరావతి పేరుతో విచ్చలవిడిగా స్కామ్‌లు చేస్తూ... ఆచరణ సాధ్యమైన రాజధాని కారిడార్ ‘మావిగన్’ ఎందుకు వద్దో చెప్పడం లేదు. మెగా డీఎస్సీ పేరుతో మెగా స్కామ్..! లక్షలాది మంది యువతకు జరిగిన అన్యాయంపై మహానాడులో చర్చ లేదు. ఇక మహిళలకు రిజర్వేషన్లు.. చినబాబు చొరవ అంటూ మరో హైడ్రామా! వైఎస్ జగన్ ప్రభుత్వం నామినేటెడ్ పనులు, పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేసి మరీ అమలు చేస్తే ఇప్పుడు చంద్రబాబు క్యాబినెట్‌లో 33 శాతం పదవులు మహిళలకు ఎందుకు ఇవ్వడం లేదు? ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులుగా మహిళలకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదో మహానాడులో చర్చ లేదు. వైఎస్ జగన్ హయాంలో మహిళలే కేంద్రంగా పాలన సాగించి సింహభాగం పథకాలతో వారికి లబ్ధి చేకూర్చితే.. మహిళా సాధికారతకు కూటమి సర్కారు తూట్లు పొడిచింది. హామీల అమలు, పాలనను గాలికి వదిలేసి ‘రెడ్‌బుక్’ బెదిరింపులతో అరాచకంగా వ్యవహరిస్తోంది. మొత్తంగా మహానాడులో బోరు కొట్టించే ప్రసంగాలు.. జగన్‌పై వ్యక్తిగత విమర్శలు మినహా ఏ ఒక్క అంశంపైనా నిర్మాణాత్మకంగా చర్చించిన దాఖలాలు లేవు. ఎందుకంటే.. పాలన పడకేసిన చంద్రబాబు సర్కారులో మట్టి నుంచి ఇసుక, సిలికా, లేటరైట్, క్వార్ట్జ్, మద్యం దాకా దేంట్లో చూసినా దోపిడీనే..! 
ప్రాంగణాలు వెలవెల..
మహానాడు పేరుతో చంద్రబాబు నిర్వహించిన రెండు రోజుల డిజిటల్ డ్రామా అట్టర్‌ఫ్లాప్ అయింది. టీడీపీ కార్యర్తలు కూడా ఈ డ్రామాను పట్టించుకోకపోవడంతో అన్నిచోట్లా మహానాడు ప్రాంగణాలు వెలవెలబోయాయి. అయినా సరే రికార్డులు సృష్టించినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించుకున్నారు. మహానాడుకు వర్చువల్‌గా 11 లక్షల మంది హాజరైనట్లు పేర్కొన్నారు. టీడీపీ యాప్ ద్వారా ఈ హాజరును తీసుకున్నట్లు సంబరపడ్డారు. నిజానికి మహానాడుకు స్పందన లేకపోవడంతో నాయకులు జనాన్ని తరలించేందుకు నానా తంటాలు పడ్డారు. అనేక చోట్ల ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు, ఇతర నేతల ఊకదంపుడు ఉపన్యాసాలు వినలేక వచ్చిన కొద్ది మంది కూడా వెనుతిరిగారు. పార్టీ కార్యకర్తలు, నేతలు ఎవరిని కదిపినా ఇదేం మీటింగ్? అని విసుక్కోవడం మహానాడు ప్రత్యేకతగా నిలిచింది.
పోటాపోటీగా పొగడ్తలు..
మహానాడు ఆద్యంతం అదే పనిగా వైఎస్ జగన్‌ను తిట్టడం, చంద్రబాబును పొగిడేందుకు నేతలు పోటీలు పడ్డారు. ఎన్టీఆర్ జయంతిని నిర్వహిస్తున్నట్టుగా చంద్రబాబు జయంతిని చిరకాలం నిర్వహించేలా ‘బాబునాడు’ చేద్దామని ఆయన వేదికపైన ఉండగానే నేతలు చెప్పడాన్ని బట్టి వారి అతి ఏ స్థాయికి వెళ్లిందో చూడవచ్చు. లోకేశ్ రాష్ట్రానికి కాదు.. దేశానికి దిక్సూచి అని, పులి కడుపున పులే పుడుతుందంటూ.. ఆయన పెద్ద పులి అంటూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఓవర్ యాక్షన్ చేశారు. ఎన్టీఆర్ తర్వాత అంతటి అందం ఆ కుటుంబాల్లో నారా దేవాన్‡్షకే వచ్చిందంటూ మోకా ఆనంద్‌సాగర్ అనే నేత పొగడ్తలు కురిపించారు. వైఎస్సార్‌సీపీని చంపేయాలని టీడీపీ నేత పంచుమర్తి అనూరాధ అనుచిత వ్యాఖ్యలు చేసి లోకేశ్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయతి్నంచారు. వీటిని వింటూ చంద్రబాబు, లోకేశ్ చిరునవ్వులు చిందించారు.
ఎన్టీఆర్ కోసం ఉత్తుత్తి తీర్మానం
ఎప్పటిలానే ఈ మహానాడులో పలు ఉత్తుత్తి తీర్మానాలు చేశారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే తీర్మానాన్ని మరోసారి ఆమోదించారు. ఈసారి ఆ తీర్మానాన్ని చంద్రబాబు పెట్టడం గమనార్హం. భారతరత్న ఇవ్వకుండా అడ్డుపడిన చంద్రబాబే తీర్మానాలు చేయడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. రెండేళ్ల పాలనలో చేయని వాటిని చేసినట్లు, జరగని వాటిని జరిగినట్లు చూపించడానికి చంద్రబాబు తాపత్రయపడ్డారు. లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, లక్ష మందిని పారిశ్రామికవేత్తలుగా చేశామంటూ పచ్చి అబద్ధాలు చెప్పుకున్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండానే అమలు చేసేసినట్లు చెప్పారు.
లోకేశ్ జెన్‌జీ కామెడీ!
మహానాడులో నారా లోకేశ్ పబ్లిసిటీకి పరాకాష్టగా ఆయన జెన్‌జీ యువతతో సమావేశమై సంభాíÙంచినట్లు ఓ యూట్యూబ్ లింకు ఇచ్చారు. అందులో నలుగురంటే నలుగురే పార్టీ కార్యకర్తలు కూర్చోగా వారితో లోకేశ్ పిచ్చాపాటీగా మాట్లాడారు. దాన్నే జెన్‌జీ సమావేశంగా ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా షేర్ చేసుకోవడం గమనార్హం.


