కూటమిది నమ్మకద్రోహ సభ | Chandrababu super frauds in the name of Super Six | Sakshi
Sakshi News home page

కూటమిది నమ్మకద్రోహ సభ

Jun 14 2026 5:41 AM | Updated on Jun 14 2026 5:41 AM

Chandrababu super frauds in the name of Super Six

సూపర్‌సిక్స్‌ పేరిట చంద్రబాబు సూపర్‌ మోసాలు 

ఆడబిడ్డ నిధి పథకాన్ని తక్షణమే అమలు చేయాలి

ప్రజలను వంచించిన బాబుపై చీటింగ్‌ కేసు పెట్టాలి   

వైఎస్సార్‌సీపీ మహిళా నేతల ధ్వజం

సాక్షి,అమరావతి/నెహ్రూనగర్‌(గుంటూరు)/సాక్షి,విశాఖపట్నం/నెల్లూరురూరల్‌: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన సభ  ‘నమ్మకద్రోహ సభ’ అని వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల ముందు అలవిగాని హామీలిచ్చి ప్రతి ఇంటికి వెళ్లి సంతకాలతో కూడిన బాండ్‌ పేపర్లు పంచి, ఓట్లు వేయించుకున్న చంద్రబాబు.. నేడు ‘ఆడబిడ్డ నిధి’ పథకానికి బడ్జెట్‌లో రూపాయి కూడా కేటాయించకుండా 2 కోట్ల మంది మహిళలను వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తాడేపల్లితోపాటు వివిధ ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు విలేకరుల సమావేశాలు నిర్వహించారు. కూటమి పాలకుల తీరుపై ధ్వజమెత్తారు.

పీ–4తో వంచన : విడదల రజిని 
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో  మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ పీ–4 అంటూ ప్రగల్భాలు పలుకుతూ ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా మహిళలను బాబు వంచిస్తున్నారని విమర్శించారు. ఆడబిడ్డ నిధి హామీ ప్రకారం.. ఒక్కో మహిళకు రెండేళ్లకు రూ. 36 వేల చొప్పున, రాష్ట్రంలోని 2 కోట్ల మంది మహిళలకు కూటమి ప్రభుత్వం రూ. 72 వేల కోట్లు బాకీ పడిందని వివరించారు. ఎన్నికల ముందు రజినీకాంత్‌లా హామీలు గుప్పించిన బాబు ఇప్పుడు గజినీలా నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. నారా వారికి ‘నారీ శక్తి’ తడాఖా చూపించి గద్దె దించడం ఖాయమని హెచ్చరించారు.

చంద్రబాబు చీటింగ్, బోగస్‌ నాయుడు: వరుదు కళ్యాణి 
విశాఖపట్నం మద్దిలపాలెంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. చంద్రబాబు ‘చీటింగ్‌ బోగస్‌ నాయుడు’ అని విమర్శించారు. రెండేళ్లుగా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని, ఆడబిడ్డ నిధి హామీకి తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు.   ఎన్నికల ముందు ‘స్వాతిముత్యం’ సినిమాలో కమల్‌హాసన్‌లా అమాయకంగా నటించిన బాబు.. నేడు ‘నాయకుడు’ సినిమాలోని కన్నింగ్‌ పాత్రలా 
ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. 

మహిళల ఉసురు తగులుతుంది : కాకాణి పూజిత 
బాబు సర్కారు తీరును ఎండగడుతూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాకాణి పూజిత శనివారం ఓ వీడియో విడుదల చేశారు. సర్కారుకు మహిళల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. టీడీపీ అంటే తప్పుడు దొంగల పార్టీ అని దుయ్యబట్టారు. ఆడబిడ్డ నిధి హామీని బాబు అటకెక్కించారని విమర్శించారు. గతంలో వైఎస్‌ జగన్‌ సర్కారు ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వంటి పథకాల ద్వారా మహిళలకు భారీ లబ్ధి చేకూర్చారని గుర్తుచేశారు. 

చీటింగ్‌ కేసు పెట్టాలి : బండి పుణ్యశీల
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి బండి పుణ్యశీల మాట్లాడుతూ హామీలు గుప్పించి మోసం చేసిన చంద్రబాబుపై చీటింగ్‌ కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు. మహిళలను మోసగించిన చంద్రబాబు సర్కారుకు పతనం తప్పదని ధ్వజమెత్తారు.   

బాబు సర్కారు ఘోర వైఫల్యం: నూరి ఫాతిమా 
గుంటూరులోని వైఎస్సార్‌సీపీ నగర కార్యాలయంలో పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరి ఫాతిమా మాట్లాడుతూ.. రెండేళ్లలో బాబు సర్కారు ఘోరంగా విఫలమైందని విమర్శించారు. సూపర్‌ సిక్స్‌ హామీల అమల్లో బాబు చతికిల పడ్డారని, ఆడబిడ్డ నిధి పథకానికి ఒక్కరూపాయి కేటాయించలేదని ధ్వజమెత్తారు. బాబు సర్కారు తీరు వల్ల పనిఒత్తిడితో సచివాలయ సిబ్బంది ప్రాణాలొదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement