మోత మోగిపోద్ది.. ఇక ఆర్టీసీ చార్జీల బాదుడు | Chandrababu Naidu Government Proposes Hike In RTC Fares, Passengers May Face ₹300 Crore Annual Burden | Sakshi
Sakshi News home page

మోత మోగిపోద్ది.. ఇక ఆర్టీసీ చార్జీల బాదుడు

May 31 2026 5:33 AM | Updated on May 31 2026 12:00 PM

Chandrababu Naidu government proposes hike in RTC fares

కిలోమీటర్‌కి 5.72 పైసలు పెంపునకు ప్రతిపాదన

ప్రజలపై ఏటా రూ.300 కోట్ల భారం

త్వరలో అధికారిక ప్రకటన

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై మరో బాదుడుకు సిద్ధమవుతోంది. ఆర్టీసీ చార్జీల రూపంలో రాష్ట్ర ప్రజలపై ఏడాదికి ఏకంగా రూ.300 కోట్ల అదనపు భారం మోపేందుకు సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ ఆర్టీసీ) ఈ మేరకు ప్రతిపాదనల్ని సమర్పించింది. సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో చార్జీల పెంపుపై రెండు ప్రతిపాదనలను సమ­ర్పించింది. ఆర్టీసీని సక్రమంగా నిర్వహించేందుకు అదనపు నిధులు కేటాయించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. చార్జీలు పెంచుకోవాలని సూచించడంతో ప్రయాణికులపై ఆర్థికభారం అనివార్యం కానుంది. 

నిధులివ్వలేం.. చార్జీలు బాదేయండి
ఆర్టీసీని సక్రమంగా నిర్వహించేందుకు ఏటా రూ.220 కోట్లు మంజూరు చేయాలని ఆర్టీసీ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ ప్రతినెలా కోల్పోతున్న రాబడికి  ప్రభుత్వం దశల వారీగా నిధులు విడుదల చేస్తోంది. కానీ.. ఇతర నిర్వహణ వ్యయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీని నిర్వీర్యం చేస్తోందని ఉద్యోగ సంఘాలు విమ­ర్శి­స్తున్నాయి. ఆర్టీసీని ప్రైవేటీకరించే పన్నాగంతోనే ఈ విధంగా వ్యవహరిస్తోందని దుయ్య­బడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఏటా రూ.220 కోట్లు అదనంగా కేటాయించాలని కోరారు. కానీ.. ఆ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. ఆర్టీసీకి ఏమాత్రం నిధులు కేటాయించలేమని తేల్చి చెప్పింది. చార్జీలు పెంచుకుని నష్టాలను పూడ్చుకోవాలని సూచించింది. దాంతో చార్జీల పెంపుదలకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సమర్పించారు.

ఏటా రూ.300 కోట్ల బాదుడే
ప్రయాణికుల నుంచి చార్జీల ద్వారా ఏటా రూ.300 కోట్లు అదనపు రాబడి సాధించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రస్తుతం ఆర్టీసీకి ప్రయాణికుల నుంచి టికెట్‌ చార్జీల రూపంలో ఏటా రూ.6,551.69 కోట్ల రాబడి వస్తోంది. కాగా నిర్వహణ వ్యయం పెరుగుదలను సాకుగా చూపిస్తూ చార్జీల పెంపునకు రెండు ప్రతిపాదనలను ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు.

ప్రతిపాదన 1: 
– కిలోమీటరుకు 4.15 పైసలు చొప్పున పెంచుతారు. ఆ ప్రకారం కిలోమీటరుకు ప్రస్తుతం సగటు ప్రాథమిక చార్జీ 124.85 పైసలుగా ఉంది. ఆ చార్జీని 129 పైసలకు పెంచుతారు. దాంతో ప్రయాణికులపై ఏటా రూ.217.64కోట్ల అదనపు భారం పడుతుంది.

ప్రతిపాదన 2: 
ఆర్టీసీ ఏటా రూ.300 కోట్ల అదనపు రాబడి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే రెండో ప్రతిపాదనను సమర్పించింది. ఆ ప్రకారం చార్జీలు కిలోమీటరుకు 5.72 పైసల చొప్పున పెంచుతారు. దాంతో ప్రయాణికులపై ఏటా రూ.300 కోట్ల అదనపు భారం పడుతుంది. ఆర్టీసీ చార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు శుక్రవారం సమీక్షించారు. ప్రభుత్వం పచ్చజెండా ఊపగానే చార్జీల మోత మోగనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement