డీమెరిట్‌ డీఎస్సీ | Chandrababu govt refuses to accept supernumerary posts | Sakshi
Sakshi News home page

డీమెరిట్‌ డీఎస్సీ

May 29 2026 4:41 AM | Updated on May 29 2026 4:41 AM

Chandrababu govt refuses to accept supernumerary posts

తప్పుల తడకగా పోస్టుల భర్తీ.. డీఎస్సీ బాధితులకు మొండి చేయి?

సూపర్‌ న్యూమరీ పోస్టులకు అంగీకరించని బాబు సర్కారు  

హైకోర్టులో నిజాయితీని నిరూపించుకున్నా పట్టించుకోని వైనం 

అవకాశం కోల్పోయి తీవ్రంగా నష్టపోతున్న అభ్యర్థులు

సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇచ్చిన మొదటి నోటిఫికేషన్‌ మెగా డీఎస్సీ–2025 డీమెరిట్‌ డీఎస్సీగా మారిపోయిందా? ఈ డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులకు ప్రభుత్వం మొండి చేయి చూపించనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సర్కారు తప్పులు, అధికారుల విచ్చలవిడితనం వెరసి ప్రతిభగల అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగింది. అన్ని సర్టిఫికెట్లు సరిగా ఉన్నా సరే వివిధ సాకులతో వారిని అనర్హులుగా చేశారు. మెరిట్‌లో తర్వాత ఉన్నవారికి ఆ పోస్టును ఇచ్చేశారు. కనీసం అభ్యర్థులు చెప్పింది వినకపోగా, కనీస గడువూ ఇవ్వకుండా నచ్చినట్టు చేసుకుంటూ పోయారు. తీరా డీఎస్సీ అభ్యర్థులు తమ సర్టిఫికెట్లు అన్నీ సక్రమమే అని ఆయా శాఖల నుంచి పత్రాలు తెచ్చుకున్నా.. ‘అంతా అయిపో­యింద’ంటూ చేతులెత్తేవారు. దీంతో దాదాపు ఐదారేళ్ల కాలంపాటు డీఎస్సీ కోసమే కష్టపడి చదివి, పరీక్షల్లో మెరిట్‌ సాధించిన వారికి తీవ్ర అన్యాయ­మే జరిగింది. వాస్తవానికి ఇలాంటి సమయంలో నష్టపోయిన వారికి ప్రభుత్వం న్యాయంగా పోస్టు­లు సృష్టించి ఇవ్వాలి. కానీ ప్రభుత్వం మాత్రం మరో డీఎస్సీలో ప్రయత్నించండి అన్నట్టుగా వ్యవహరిస్తోంది.  

గ్రీవెన్స్‌లోనూ న్యాయం జరగని వైనం 
మెగా డీఎస్సీలో అన్ని అర్హతలూ ఉండి పోస్టులు రాని అభ్యర్థుల కోసం జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలో గ్రీవెన్స్‌ రెడ్రెస్‌ సెల్స్‌ ఏర్పాటు చేశారు. మొదటి స్థాయిలో న్యాయం జరగకపోతే, రెండో దశలో ఆర్జేడీ స్థాయిలో పరిష్కరించాలి. అక్కడా పరిష్కారం కాకపోతే రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాలి. మొదటి రెండు స్థాయిల్లో 15 రోజుల చొప్పున, మూడో స్థాయిలో నెల రోజుల్లోనూ పరిష్కారం చేయాలి. కానీ, కింది స్థాయిలో ఒక్కటీ పరిష్కరించిన దాఖలా లేదు. మెరిట్‌ లిస్టు, అభ్యర్థుల ఎంపిక అంతా రాష్ట్ర స్థాయిలో పూర్తిచేసి, కేవలం ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మాత్రమే జిల్లా అధికారులు చేశారు. దాంతో తమ పరిధి కాదని తమకు వచ్చిన ఫిర్యాదులను రాష్ట్ర కార్యాలయానికి పంపినట్టు అభ్యర్థులు చెబుతున్నారు. రాష్ట్ర స్థాయి పరిష్కార వేదికలో అభ్యర్థులకు అవమానాలే గాని న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పలువురు హైకోర్టును ఆశ్రయించారు.  

– అన్నమయ్య జిల్లాకు చెదిన ఓ అభ్యర్థి ఓసీ–ఈడబ్లు్యఎస్‌ కోటాలో ఎస్‌ఏ బయాలజీ పోస్టు రావాలి. తన కంటే మందున్న అభ్యర్థి గతంలో ‘బీసీ’ కోటాలో డీఎస్సీ పరీక్షలు రాశాడు. ఈసారి అతడు ఓసీ–ఈడబ్లు్యఎస్‌గా నమోదు చేసుకుని తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందాడు. బాధిత అభ్యర్థి ఆధారాలతో పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయంలోని గ్రీవెన్‌సెస్‌లో ఫిర్యాదు చేయగా ‘‘ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థి సర్టిఫికెట్లు తప్పుడువని తహసీల్దార్‌తో రద్దు చేయించి రా.. అప్పుడు నీ ఉద్యోగం గురించి ఆలోచిస్తా’’ అని ఓ అధికారి అవమానకరంగా మాట్లాడారని ఆవేదన చెందాడు.  

సూపర్‌ ‘నో’మరి..!  
సాధారణంగా ప్రభుత్వ చర్యలతో నష్టపోయిన ఉద్యోగార్థులకు వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ఆ ప్రభుత్వంపైనే ఉంటుంది. ఇక్కడ కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయు పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చి 148 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేసింది. ఇందులో 15,941 పోస్టులను తప్పుల తడకగా భర్తీ చేసి, మిగిలిన 406 పోస్టులను క్యారీ ఫార్వర్డ్‌ కింద మరో నోటిఫికేషన్‌కు బదిలీ చేశారు. ఇక్కడ అధికారులు నిబంధనలను ఇష్టానుసారంగా మార్చేయడంతో పాటు వేగంగా పని పూర్తిచేశామన్న రికార్డు కోసం తాపత్రయపడ్డారేగాని, వారి చర్యల ద్వారా అభ్యర్థులకు ఎంత తీవ్రమైన అన్యాయం జరిగిందో పట్టించుకోలేదు. నష్టపోయిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి తమ నిజాయతీని నిరూపించుకున్నారు. వెంటనే వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. కానీ అప్పటికే పోస్టుల భర్తీ పూర్తయిపోయిందని, ఆయా స్థానాల్లో మరొకరికి పోస్టింగ్‌ ఇచ్చేశామని చెప్పడం గమనార్హం. కోర్టు తీర్పు ప్రకారం వారికి పోస్టులు ఇవ్వాలి, అదుకోసం సూపర్‌న్యూమరీ పోస్టులు సృష్టించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ఆ దిశగా ఇచ్చేందుకు చంద్రబాబు సర్కారు అంగీకరించడం లేదు. దీనివల్ల ప్రతిభ గల అభ్యర్థులు నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement