
మెడికల్, దివ్యాంగ పింఛన్ల భారం తగ్గించుకునేలా కూటమి సర్కారు స్కెచ్
రాష్ట్రంలో ఈ పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారులు 8.18 లక్షలు
పరీక్షలకు రావాలంటూ ఇప్పటికే 7 లక్షల మందికి నోటీసులు
వీరిలో పరీక్షలకు హాజరు కాని 17 వేల మందికి తాజాగా మళ్లీ నోటీసులు
వీరికి ఆగస్టు 1న పింఛన్ నిలిపివేత.. సెప్టెంబర్‌లోగా మిగతా వారందరికీ పరీక్షలు
ఆ తర్వాత వైకల్య శాతం 40 కంటే తక్కువగా చూపించి కొందరి పింఛన్ కట్ చేసే కుట్ర
మిగతా వారిలో కూడా వైకల్య శాతాన్ని తగ్గించి పింఛన్ కేటగిరీల మార్పు
ఇలా మొత్తంగా లక్ష మంది లబ్ధిదారులకు వాత పెట్టేలా వ్యూహం
ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లకు ఉన్నతాధికారుల ఆదేశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలి విడతలో లక్ష మంది మెడికల్, దివ్యాంగ పింఛన్‌దారుల భారం తగ్గించుకునేలా కూటమి సర్కారు పన్నాగం పన్నింది. ఒకేసారి అంత మందికి పింఛన్ తొలగిస్తే అలజడి రేగుతుందని వ్యూహాత్మక ఎత్తుగడలతో కుట్ర అమలుకు ఉపక్రమించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఏళ్ల తరబడి నెలనెలా పింఛను తీసుకుంటున్న లబ్ధిదారుల్లో అనర్హుల గుర్తింపు పేరిట ప్రత్యేక కార్యక్రమం మొదలు పెట్టింది.
మొదటి విడతలో.. కదలలేని స్థితిలో లేక మంచానికే పరిమితమై ఉండే పెరాలసిస్, తీవ్ర కండరాల బలహీనత తరహా రోగులకు అందజేసే మెడికల్ పింఛను లబ్ధిదారులతో పాటు దివ్యాంగుల లబ్ధిదారులు కలిపి మొత్తం 8.18 లక్షల మందికి వారి పింఛను అర్హతను నిర్ధారించేందుకు వైద్యుల ద్వారా పరీక్షలు నిర్వహిసున్నారు. వీరిలో దాదాపు 7 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలకు హాజరు కావాలంటూ నోటీసులు ఇవ్వగా 17 వేల మంది మినహా మిగతా వారికి పరీక్షలు పూర్తయినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
నోటీసులు అందుకుని కూడా పరీక్షలకు హాజరు దాదాపు ఆ 17 వేల మందికి ఆగస్టు 1న పింఛను డబ్బుల పంపిణీ కూడా నిలిపి వేశారు. వీరికి మరోసారి నోటీసులు ఇచ్చి, అప్పటికీ వైద్య పరీక్షలకు హాజరు కానిపక్షంలో వారి పింఛను పూర్తి స్థాయిలో తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు వెల్లడించారు.
కాగా.. మెడికల్, దివ్యాంగుల కోటాలో పింఛన్లు తీసుకుంటున్న మొత్తం 8.18 లక్షల మందికి సెప్టెంబర్ నాటికి పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత వారిలో వికలత్వ శాతం 40 కంటే తక్కువగా చూపి.. కొంత మంది పింఛన్‌ను రద్దు చేయనున్నట్లు తెలిసింది. వీరిలో 60 ఏళ్లు పైబడిన వారికి వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
మిగతా వారిలో కూడా వికలత్వ శాతాన్ని తగ్గించి.. ఆ మేరకు పింఛన్ల కేటగిరి మార్చనున్నారని అధికార వర్గాల సమాచారం. అంటే రూ.15 వేల పింఛన్ తీసుకుంటున్న వారికి రూ.10 వేలు.. రూ.10 వేలు తీసుకుంటున్న వారికి రూ.6 వేల పింఛన్‌కు మార్చడం అన్నమాట. ఇలా పింఛన్ లబ్ధిదారుల తొలగింపు, కేటగిరీల మార్పులు లక్ష వరకు ఉంటాయని సమాచారం.
తద్వారా ప్రభుత్వం ఆర్థిక భారం తగ్గించుకోవడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 14 నెలలుగా 5 లక్షల పింఛన్లను రద్దు చేయడమే కాకుండా, కొత్తగా అర్హులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వని విషయం తెలిసిందే.