దివ్యాంగుల పెన్షన్‌ టెన్షన్‌ | Series of protests by the disabled about pension | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల పెన్షన్‌ టెన్షన్‌

Aug 22 2025 2:29 AM | Updated on Aug 22 2025 2:29 AM

Series of protests by the disabled about pension

వరుస ఆందోళనలతో అట్టుడుకుతున్న రాష్ట్రం

సాక్షి నెట్‌వర్క్‌: సదరం సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్‌ పేరిట కూటమి ప్రభుత్వం లక్ష మంది దివ్యాంగుల పెన్షన్లను రద్దు చేసింది. వారందరికీ సెప్టెంబర్‌ నుంచి పింఛన్లు నిలిపివేస్తున్నట్టు అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ చర్యతో దివ్యాంగులంతా ఆందోళన చెందుతున్నారు. ‘దివ్యాంగుల పెన్షన్లు కూడా వదలరా.. మీకు మనసెలా వచ్చింది’ అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కాలు, చేయి కూడదీసుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆందోళనలకు దిగుతున్నారు. వరుస ఆందోళన­లతో రాష్ట్రం అట్టుడుకుతోంది. 

ఆందోళనల్లో భాగంగా అనంతపురంలో గురువారం పెట్రోల్‌ పోసుకుని ఉద్దీప్‌ సింహ అనే దివ్యాంగుడు ఆత్మహత్యాయత్నం చేశారు. బాప­ట్లలో చల్లా రామయ్య అనే దివ్యాంగుడు సెల్‌ టవర్‌ ఎక్కిన ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేయగా.. అనంతపురంలో కలెక్టరేట్‌ ఎదుట దివ్యాంగులు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై అర్ధనగ్నంగా పడుకుని సర్కారు తీరును ఎండగట్టారు. తిరుపతి కలెక్టరేట్‌ వద్ద దివ్యాంగుల జేఏసీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నాలో నిర్వహించగా.. సుమతి అనే దివ్యాంగురాలు సొమ్మసిల్లి పడిపోయింది. 

ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కలెక్టరేట్‌­లోకి అధికారుల్ని వెళ్లనివ్వకుండా అడ్డుకున్న దివ్యాంగులు ప్రభు­త్వా­నికి తమ ఉసురు తప్పక తగులుతుందంటూ శాప­నార్థాలు పెట్టారు. కాగా.. పింఛన్‌ తొలగించారన్న మనో­వేదనతో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన దివ్యాంగురాలు మెండు గంగాభవాని (45) గురువారం ప్రాణం విడిచిందని స్థానికులు తెలిపారు. 

అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక, ఏపీ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి సంయుక్తంగా గురువారం అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దివ్యాంగుల రాస్తారోకో చేపట్టడంతో కలెక్టరేట్‌ ఎదుట రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అక్కడే హక్కుల వేదిక కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షుడు ఉద్దీప్‌ సింహ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని లైటర్‌తో అంటించుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు లైటర్‌ గుంజుకుని ఉద్దీప్‌ సింహపై నీళ్లు పోశారు. 

అనంతరం దివ్యాంగులు ఎండలో రోడ్డుపై అర్ధనగ్నంగా పడుకుని నిరసన తెలిపారు. ‘సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేశ్, జిల్లా మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేల్లారా రండి.. మీ ప్రభుత్వంలో మాకు జరిగిన అన్యాయం చూడండి’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. డీఆర్‌ఓ మలోల, డీఆర్‌డీఏ పీడీ శైలజ, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన అక్కడికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దివ్యాంగులు వారితో మాట్లాడేందుకు నిరాకరించడంతో కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అక్కడకు చేరుకుని వారితో మాట్లాడారు. 

వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు వసంతకుమార్, కార్యదర్శి రాజేష్, దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కో–ఆర్డినేటర్‌ హరి­నాథరెడ్డి దివ్యాంగులకు పింఛన్‌ ఎలా తొలగించారో వివరించారు. దీంతో కలెక్టర్‌ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌ ఆత్మారామ్‌ను పిలిపించారు. కళ్లెదుట వైకల్యం కనిపిస్తున్నా తక్కువగా ఉన్నట్లు వైద్యులు ఎలా సర్టిఫికెట్‌ ఇస్తారని ప్రశ్నించారు. వెంటనే అందరికీ మరోసారి రీవెరిఫికేషన్‌ చేయాలని ఆదేశించారు. దివ్యాంగుల ఆందోళనకు వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి,  వైఎస్సార్‌ సీపీ దివ్యాంగుల విభాగం నగర అధ్యక్షుడు కాలేషా తదితరులు మద్దతు తెలిపారు. 

సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన
పెన్షన్లు తొలగించటంతో బాపట్లలో దివ్యాంగులు గురువారం కదం తొక్కారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి నిరసన చేపట్టారు. రాష్ట్ర సంచార జాతుల సంక్షేమ సంఘం నాయకుడు చల్లా రామయ్య తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా గల సెల్‌ టవర్‌ ఎక్కి సమస్య పరిష్కరించే వరకు దిగేది లేదని భీష్మించారు. రాష్ట్రవ్యాప్తంగా తొలగించిన దివ్యాంగుల పింఛన్లను పునరుద్ధరించాలని, బాపట్ల జిల్లాలో 3,824 దివ్యాంగుల పెన్షన్లను  పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. 

రామయ్యకు మద్దతుగా సెల్‌ టవర్‌ వద్ద నినాదాలు చేస్తున్న శరత్‌ అనే వ్యక్తిని పోలీసులు బలవంతంగా వెదుళ్లపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో సెల్‌ టవర్‌ వద్ద నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు  తరిమికొట్టారు. పోలీసులకు ఎదురు తిరిగిన నలుగురిని బలవంతంగా పోలీస్‌ స్టేషన్లకు లాక్కెళ్లారు. 

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మేరుగు నాగార్జున డీఎస్పీ రామాంజనేయులు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది.  ఎట్టకేలకు దివ్యాంగుల పెన్షన్లు తొలగింపుపై అర్జీని మేరుగు  నాగార్జునతో కలిసి చల్లా రామయ్య ఆర్డీవో గ్లోరియాకు అందజేశారు.  కాగా.. సెల్‌ టవర్‌ ఎక్కిన చల్లా రామయ్యపై కేసు నమోదు చేసినట్టు సీఐ రాంబాబు తెలిపారు.

తిరుపతిలో దివ్యాంగుల ధూంధాం
తొలగించిన పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలంటూ దివ్యాంగులు తిరుపతి కలెక్టరేట్‌ వద్ద గురువారం ధర్నా చేపట్టారు. కలెక్టరేట్‌లోకి అధికారులెవరినీ వెళ్లనీయకుండా.. లోపల ఉన్న వారిని బయటకు రాకుండా గేటుకు అడ్డంగా బైఠాయించి నిర్బంధించారు. మండుటెండలో ధర్నా చేయ­టంతో సుమతి అనే దివ్యాంగురాలు సొమ్మసిల్లి­పడిపోయింది. చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. 

75 శాతం నుంచి 90 శాతం ఉన్న వైకల్యం కూటమి ప్రభుత్వం వచ్చాక 40 శాతానికి ఎలా తగ్గిపోతుందని నిలదీశారు. వైద్యుల్ని దివ్యాంగుల వద్దకే పంపించి న్యాయం జరిగేలా చూస్తానని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఫోన్‌లో దివ్యాంగులకు హామీ ఇచ్చారు. దివ్యాంగుల ఆందోళనకు వైఎస్సార్‌సీపీ తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి, సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు మద్దతు తెలిపారు.

దివ్యాంగుడి పింఛన్‌ కోత.. నిరుపేద కుటుంబం గుండెకోత
» పింఛన్‌ రీవెరిఫికేషన్‌ పేరుతో వైకల్య శాతం తగ్గింపు
» ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు    
గాందీనగర్‌(విజయవాడసెంట్రల్‌): కూటమి ప్రభుత్వం వైకల్య శాతాన్ని తగ్గించడంతో పింఛన్‌ తగ్గిపోతుందని ఆ కుటుంబం ఆందోళన చెందుతోంది. విజయవాడ భవానీపురం 40వ డివిజన్‌కు చెందిన పొందుగుల చిన్నపరెడ్డి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. 2022లో చెట్టుమీద నుంచి పడటంతో వెన్నుపూస పూర్తిగా దెబ్బతింది. కాళ్లు రెండూ చచ్చుబడిపోయి పూర్తిగా మంచానికి పరిమితమయ్యాడు. వైద్యులు పరీక్షించి 90శాతం వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరిస్తూ సదరం సర్టిఫికెట్‌ జారీ చేశారు. చిన్నపరెడ్డి బాగోగులు చూసుకోవడమే అతని భార్యకు సరిపోతోంది. 

కుటుంబ పోషణ, కుమార్తె చదువు భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఆ కుటుంబం 2023వ సంవత్సరంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసింది. పెద్ద మనసుతో ఆయన ఆదుకున్నారు. రూ.10 లక్షల ఆర్థిక సాయం చేశారు. అప్పటి కలెక్టర్‌ ఢిల్లీరావు స్వయంగా బాధితుడి ఇంటికి వెళ్లి ఈ సాయం చెక్కు అందజేశారు. సామాజిక పింఛన్‌ రూ.10వేలు మంజూరు చేశారు. వచ్చే పెన్షన్‌తో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 

కూటమి ప్రభుత్వం వచ్చాక చిన్నపురెడ్డి పింఛన్‌ను రీ వెరిఫికేషన్‌ చేసి..  వైకల్యాన్ని 85 శాతంగా చూపుతూ సదరం సర్టిఫికెట్‌ జారీ చేశారు. పింఛన్‌ రూ.6 వేలే వస్తుందని అధికారులు నోటీసులిచ్చారు. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది. ఈ పరిస్థితుల్లో తాము బతికేదెలా అంటూ ఆందోళన చెందుతోంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement