రవాణాకు బ్రేకులు | Chandrababu Govt: Diesel crisis has worsened in AP | Sakshi
Sakshi News home page

రవాణాకు బ్రేకులు

Apr 28 2026 4:33 AM | Updated on Apr 28 2026 4:33 AM

Chandrababu Govt: Diesel crisis has worsened in AP

రాష్ట్రంలో డీజిల్‌ కొరతతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన లారీలు 

బంకుల వద్ద అర్ధరాత్రి నుంచి వాహనాల బారులు  

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులకూ డీజిల్‌ గండం 

అదనపు చార్జీలు వసూలు చేస్తున్న ఆపరేటర్లు 

కార్లు, ద్విచక్ర వాహనదారుల పరిస్థితి మరింత దారుణం

వరికోత యంత్రాలకు ఇక్కట్లు.. రైతుల నుంచి రెట్టింపు రేట్లు వసూలు 

రాష్ట్రంలో ఏ బంకు వద్ద చూసినా ‘నో స్టాక్‌’ బోర్డులే 

పెరిగిపోయిన ఇంధన బ్లాక్‌ దందా.. 50% పెరిగిన కూరగాయల ధరలు 

నిత్యావసరాల రేట్లు 30 శాతం భగ్గు.. ముంచుకొస్తున్న సంక్షోభాన్ని పసిగట్టడంలో సీఎం చంద్రబాబు మరోసారి దారుణ వైఫల్యం 

‘నో స్టాక్‌’ బోర్డులు కనిపించకూడదంటూ గాంభీర్యమైన ప్రకటనలతో సరి..రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ ఉత్త డొల్ల

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డీజిల్‌ సంక్షోభం మరింత ముదిరింది. మొన్న యూరియా.. నిన్న గ్యాస్‌.. నేడు ఇంధనం కొరత! సంక్షోభాలను పసిగట్టడంలో చంద్రబాబు సర్కారు దారుణంగా విఫలమైంది. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ ఉత్త డొల్లగా మారింది.  రాష్ట్రంలో ఏ బంకు వద్ద చూసినా ‘నో స్టాక్‌’ బోర్డులే దర్శనమిచ్చాయి. రేపటికల్లా ఎక్కడా ‘నో స్టాక్‌’ బోర్డులు కనిపించకూడదని ఆదివారం అధికారు­లతో నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశించిన తర్వాత సమస్య మరింత తీవ్రతరమైంది. పరిస్థితిని చక్కదిద్దాల్సిన ప్రభుత్వ పెద్దలు సమీక్షలతో సరిపెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంధన కొరత రవాణా రంగానికి విస్తరించడంతో ఎక్కడికక్కడ సరుకు రవాణా వాహనాలు నిలిచిపోయాయి. అర్ధరాత్రి నుంచి లారీలు బంకుల వద్ద బారులు తీరినా డీజిల్‌ దొరకలేదు. సోమవారం అన్ని ప్రధాన నగరాల్లో లారీలు నిలిచిపోయాయి. దీంతో నిత్యావసరాలు భగ్గుమన్నాయి. కూరగాయల ధరలు 40 నుంచి 50 శాతం పెరగ్గా.. నిత్యావసర సరుకుల ధరలు ఒక్కసారిగా 30% పెరిగాయి. మరోపక్క వరి కోత యం­త్రాలకు డీజిల్‌ లభించకపోవడంతో బ్లాక్‌లో కొనుగోలు చేస్తున్న యజమానులు రైతుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో అన్నదాత అటు ధాన్యానికి సరైన ధర లేక.. ఇటు కోత యంత్రాల అద్దె భారంతో రెండు విధాలా నష్టపోతున్నాడు. వరి కోత మిషన్ల చార్జీలు గంటకు రూ.2,800 నుంచి ఒకేసారి రూ.3,500కు పెంచేశారు. ప్రస్తుతం రబీ కోతల సమయం కావడంతో వరి కోత యంత్రాలకు డీజిల్‌ దొరక్క ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క కోసిన పంటను సైతం మిల్లులకు తరలించే వాహ­నాలు దొరక్క ధాన్యాన్ని కల్లాల్లోనే ఉంచుతున్న పరిస్థితి. ఫలితంగా రైతన్నలు అన్ని విధాలా నష్టపోతున్నారు.  

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రాజుపాలెం హైవేపై ఓ పెట్రోల్‌ బంకు వద్ద డీజిల్‌ కోసం బారులు తీరిన లారీలు    

హైవేల్లో నిలిచిపోయిన వాహనాలు  
బంకుల్లో నిల్వలు అడుగంటడం.. భారీ వాహనాలకు 50 నుంచి 100 లీటర్ల డీజిల్‌ను మాత్రమే ఇస్తూ రేషన్‌ విధించడంతో రవాణాకు బ్రేకులు పడ్డాయి. విజయవాడ, విశాఖ, కాకినాడ తదితర ప్రధాన నగరాల్లో వేలాది లారీలు ఆగిపోయాయి. దీనివల్ల లారీ యజ­మానులు భారీగా నష్టపోవడమే కాకుండా వాహనాల ఈఎంఐలు చెల్లించే పరిస్థితి లేదని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆవేదన వ్యక్తం చేసింది. మరోపక్క డీజిల్‌ దొరక్క పలు లారీలు జాతీయ రహదారుల వెంట నిలిచిపోయాయి. తూర్పు గోదావరి జిల్లాలో డీజిల్‌ అయి­పోయి రోడ్డు మధ్యలోనే లారీ ఆగిపోవడంతో ఎన్‌హెచ్‌–­16పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. అంబులెన్స్‌లు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. ప్రైవేట్‌ బస్సులకూ డీజిల్‌ గండం ఏర్పడింది. విజయవాడ, విశాఖ నుంచి దూర ప్రాంతాలకు తిరిగే బస్సులకు డీజిల్‌ దొరకలేదు. దీంతో పలు రూట్లలో సర్వీసులను రద్దు చేశారు. తిరుగుతున్న కొద్ది బస్సుల్లో ఆపరేటర్లు డబుల్‌ చార్జీలు వసూలు చేస్తున్నారు.  

తిరుపతిలోని వరదరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న బంక్‌లో పెట్రోల్, డీజిల్‌ కోసం భారీగా వచ్చిన వాహనదారులు   

ఇక నిత్యావసరాల వంతు? 
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. శుభకార్యాలకు వెళ్లాల్సిన వారు డీజిల్‌ దొరక్క ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ఆటోలు తిరగకపోవడం, బైకులలో పెట్రోల్‌ లేకపోవడంతో ఆర్టీసీపై ఒత్తిడి పెరిగింది. ఇప్పటికే ఉచిత బస్సుల పేరుతో సర్వీసులను తగ్గించిన సర్కారు.. పెరిగిన ఒత్తిడికి తగ్గట్టు బస్సులను పెంచలేదు.ఇంధన సంక్షోభం నిత్యావసర ధరలపై మరింత ప్రభావం చూపవచ్చని, అన్ని సరుకుల ధరలు పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. సరుకు రవాణా వాహనాలు నాలుగు రోజుల్లో చేరాల్సిన గమ్యాన్ని వారం రోజుల్లో చేరుతున్నాయి. ఇంధన కొరతతో రోడ్లపైనే వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో హైవేల్లో ఆయిల్‌ బ్లాక్‌ దందా పెరిగిపోయింది. డీజిల్‌పై లీటర్‌కు రూ.50 అదనంగా వసూలు చేస్తున్నట్లు  లారీ యజమానులు వాపోతున్నారు. ఇంధన ఖర్చులు, డ్రైవర్ల జీతాలు తడిసి మోపెడు అవుతున్నాయని లారీ ఓనర్ల అసోసియేషన్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది.   

విశాఖలోని సిరిపురం పెట్రోల్‌ బంక్‌ వద్ద రద్దీ ఇలా...  

29 తర్వాత పెట్రో ధరలపై కీలక నిర్ణయం! 
ఏపీలో ఇంధన సరఫరాను ప్రధానంగా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్, హిందుస్తాన్‌ పెట్రోలియం, భారత్‌ పెట్రోలియం కంపెనీలు నిర్వహిస్తున్నాయి. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరగడంతో నష్టాలు వస్తున్నాయని, లీటరుపై రూ.30 చొప్పున నష్టం భరించాల్సి వస్తోందని కంపెనీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున రెండో విడత ఎన్నికలు ముగిశాక ఈనెల 29 తర్వాత డీజిల్, పెట్రోల్‌ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది.
అనంతపురంలో పెట్రోల్‌ కోసం క్యూ లో వేచి ఉన్న వాహనదారులు 

డీజిల్‌ లేక నిలిచిన ప్రైవేట్‌ బస్సు 
సీఐ చొరవతో బస్సు గమ్యస్థానానికి   
ఇబ్రహీంపట్నం: డీజిల్‌ కష్టాలు ప్రయాణీకుల పాలిట శాపంగా మారాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వస్తున్న ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు సోమవారం తెల్లవారుజామున ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం వద్దకు చేరుకోగానే డీజిల్‌ అయిపోయింది. బస్సు హైవే పక్కన పెట్రోల్‌ బంకు సమీపంలో ఆగిపోయినప్పటికీ పెట్రోల్‌ బంకులో నో స్టాక్‌ బోర్డు ఉండడంతో డ్రైవర్‌కు ఏంచేయాలో దిక్కుతోచలేదు. మరోవైపు.. ప్రయాణికులు బస్సు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. మమ్మల్ని గమ్యస్థానానికి చేర్చాలని పట్టుబట్టారు. సమాచారం అందుకున్న స్థానిక సీఐ సుబ్రహ్మణ్యం అక్కడికొచ్చి 50 లీటర్ల డీజిల్‌ సేకరించి, బస్సును గమ్యస్థానానికి పంపించారు.  

పరీక్షకెలా వెళ్లాలి?   
నేను మంగళవారం జరగనున్న  పీజీఈసెట్‌ పరీక్షకు హాజరు కావాలి. నాలుగు కిలోమీటర్ల దూరంలోని రేణిగుంట రోడ్డులోని పరీక్ష కేంద్రానికి ఉదయం 9గంటలకే చేరుకోవాలి. దీంతో సోమవారం బైక్‌లో పెట్రోల్‌ పోయిద్దామని అన్ని బంకులూ తిరిగాను. ఎక్కడా దొరకలేదు.  ఇక తప్పదు. సైకిల్‌పైనే వెళ్లాలి. 
–విశ్వనాథ్‌రెడ్డి, ప్రవేశ పరీక్షార్థి, తిరుపతి

ఒక్క రోజు ఉపాధి పోయినట్లే  
నేను ఆటో డ్రైవర్‌ను. సోమవారం తెల్లవారుజామున డీజిల్‌ అయిపోయింది. డబ్బాలు పట్టుకుని టౌన్‌ అంతా తిరిగా. ఎక్కడా డీజిల్‌ దొరకలేదు. ఇప్పుడు ఈ బంకు వద్దకు వచ్చి క్యూలో ఉన్నా. నాలుగైదు గంటలు కావస్తోంది. ఇప్పటికి మా వంతు  రాలేదు. మొత్తం మీద ఈ రోజు ఉపాధి పోయినట్లే. 
    – సుబ్రమణ్యంరెడ్డి, ఆటోడ్రైవర్, మంగళం

బతికేది ఎలా?  
ఆటో నడుపుతూ జీవిస్తున్నా. ప్రయాణికులను తీసుకుని విజయనగరం వచ్చాను. రైల్వేస్టేషన్‌ రోడ్డులో ఉన్న బంక్‌కు వెళ్లి ఆయిల్‌ పోయమంటే లేదన్నారు. రోజువారి వచ్చే ఆదాయంతో జీవించే మాలాంటి వారికి బతుకుబండి నడవకపోతే ఇబ్బందులు తప్పవు. మేం బతికేది ఎలా?  
– శంకరరావు, సీతారామునిపేట 
నెల్లిమర్ల మండలం,విజయనగరం జిల్లా

25 కిలోమీటర్లు వచ్చినా ప్రయోజనం లేదు 
పల్నాడు జిల్లా రెంటచింతలలో డీజిల్‌ దొరక్క 25 కిలోమీటర్ల దూరంలోని మాచర్ల వచ్చా. పొద్దుట నుంచి సాయంత్రం వరకు ఉన్నా డీజిల్‌ దొరకలేదు. పంట రవాణాకు డీజిల్‌ కావాలి. ఏం చేయాలో పాలుపోవడం లేదు. 
–  వెంకటేశ్వర్లు, రైతు, తుమృకోట, రెంటచింతల

కుదేలైన పారిశ్రామిక రంగం 
ఇంధన కొరత మూలంగా నియోజకవర్గంలోని పౌడర్, సున్నపురాయి, గ్రానైట్‌ పరిశ్రమలు మూత­పడ్డాయి. ఈ రంగంతో పాటు అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది  ఉపాధి కోల్పోయారు.     
 – బాల తిమ్మారెడ్డి, పారిశ్రామికవేత్త, నంద్యాల జిల్లా   

Advertisement
 
Advertisement
Advertisement