ప్రజల ఆదాయం, రాష్ట్ర రాబడి పెంచడంలో చంద్రబాబు సర్కారు ఘోర వైఫల్యం
మొత్తం రాష్ట్ర అప్పులను రూ.9,84,259 కోట్లకు పెంచేసిన వైనం
రాష్ట్రంలో ఒక్కొక్కరిపై రూ.1,85,761 అప్పు
మంగళవారం 8.07 శాతం వడ్డీకి రూ.4,400 కోట్లు బడ్జెట్ అప్పు
మొత్తంగా బడ్జెట్ అప్పు రూ.1,93,964 కోట్లు
కార్పొరేషన్ల గ్యారెంటీ అప్పు రూ.1,10,704 కోట్లు
రాజధాని అప్పులు రూ.47,387 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు దొరికిన చోటల్లా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశారు. రాష్ట్ర ప్రజల ఆదాయాన్ని పెంచడంలోనూ, రాష్ట్ర రాబడిని పెంచడంలోనూ ఘోర వైఫల్యం చెందారు. రాష్ట్ర ప్రజానీకంపై మాత్రం భారీ అప్పుల భారాన్ని మోపడంలో సఫలీకృతం అయ్యారు. మంగళవారం బడ్జెట్‌లో చేసిన అప్పుతో పాటు ఇప్పటి వరకు కార్పొరేషన్ల పేరుతో గ్యారెంటీ ఇచ్చి తెచ్చిన అప్పులు, రాజధాని పేరుతో చేసిన అప్పులతో కలిపి మొత్తం రాష్ట్ర అప్పులను రూ.9,84,259 కోట్లకు పెంచేశారు. దీంతో రాష్ట్రంలో ఒక్కొక్కరిపై తలసరి అప్పును రూ.1,85,761కి పెంచేశారు. 23 నెలల పాలనలోనే చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజానీకంపై రూ.3,52,055 కోట్ల అప్పుల భారం మోపింది.
బడ్జెట్ బయట, బడ్జెట్ లోపల అందిన కాడకల్లా అప్పులు చేసినా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదు. కొత్తగా అభివృద్ధి లేదు.. ఉద్యోగాలూ ఇవ్వలేదు. రాష్ట్ర ప్రజల ఆదాయాన్ని పెంచలేదు. రాష్ట్ర ఖజానాకు రాబడినీ పెంచలేదు. చేసిన అప్పులన్నీ చంద్రబాబు సర్కారు రెవెన్యూ వ్యయానికి మళ్లించేసి, రాష్ట్ర ప్రజలను దారుణమైన అప్పుల్లోకి నెట్టేసింది. చంద్రబాబు ప్రభుత్వం మంగళవారం 8.07 శాతం వడ్డీకి రూ.4,400 కోట్ల బడ్జెట్ అప్పు చేసింది. దీంతో 23 నెలల్లోనే రికార్డు స్థాయిలో బడ్జెట్‌లోనే రూ.1,93,964 కోట్ల అప్పు చేసింది. మరో పక్క వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు రూ.1,10,704 కోట్లకు చేరాయి. ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్లే కాకుండా కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరీ అప్పులు చేస్తున్నారు.
చేసిన అప్పుల వాయిదాలను సకాలంలో చెల్లించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తిరిగి అప్పులు చేస్తోంది. మరో పక్క రాజధాని పేరుతో మరో రూ.47,387 కోట్లు అప్పు చేసింది. ఇటీవల మండలిలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పిన గణాంకాల మేరకే వైఎస్ జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి బడ్జెట్ అప్పులు, బడ్జెట్ బయట అప్పులు కలిపి మొత్తం రూ.6,32,204 కోట్లుగా పేర్కొన్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు 23 నెలల పాలనలోనే రాష్ట్ర మొత్తం అప్పులను రూ.9,84,259 కోట్లకు పెంచేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత తక్కువ వ్యవధిలో ఇంత భారీ ఎత్తున అప్పులు చేసిన దాఖలాలు లేవు. కాగా, చంద్రబాబు ప్రభుత్వం నెలకు సగటున రూ.15,306 కోట్లు, రోజుకు రూ.510 కోట్లు చొప్పున అప్పు చేసింది.


