రాజధాని రెండో విడత భూసమీకరణలో మాయాజాలం
ముఖ్యనేతకు సన్నిహితులైన ప్రజాప్రతినిధులు, నేతలకు లబ్ధి
భూసమీకరణ నుంచి తమను మినహాయించేలా పక్కా స్కెచ్
ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 విధి విధానాలను 2025 జూలై 1న జారీ చేసిన సర్కార్
ఏడు గ్రామాల్లో 20,494 ఎకరాల భూసమీకరణకు అనుమతిస్తూ 2025 డిసెంబర్ 2న ఉత్తర్వులు
ఆ మేరకు పెదపరిమిలో భూసమీకరణకు ఏప్రిల్ 13న నోటిఫికేషన్ ఇచ్చిన సీఆర్‌డీఏ
అంతకు వారం ముందే.. పెదపరిమిలో లేఅవుట్లకు అనుమతి ఇచ్చేస్తూ ఉత్తర్వులు జారీ
సమీకరణ కింద ఇస్తే ప్రయోజనం స్వల్పమే.. అదే పూలింగ్ నుంచి మినహాయిస్తే భారీ లబ్ధి
ల్యాండ్ పూలింగ్ స్కీం పదో నిబంధన ప్రకారం.. లేవుట్‌లకు సమీకరణ నుంచి మినహాయింపు
తద్వారా ముఖ్యనేతకు సన్నిహితుడైన కార్పొరేట్ ఎమ్మెల్యే బృందానికి భారీ ఎత్తున ప్రయోజనం
తమకో న్యాయం.. టీడీపీ ప్రజాప్రతినిధుల సన్నిహితులకో న్యాయమా? అంటూ మండిపడుతున్న రాజధాని రైతులు
సాక్షి, అమరావతి: రాజధాని రెండో విడత భూసమీకరణలో చంద్రబాబు సర్కార్ మాయాజాలానికి ఇదో తార్కాణం! 2015లో రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి కారుచౌకగా రైతుల నుంచి భారీ ఎత్తున భూములు కాజేసిన పచ్చ ముఠా.. ఇప్పుడు రెండో విడత భూసమీకరణలోనూ అక్రమాలకు పాల్పడుతోందని రైతులు మండిపడుతున్నారు.
సమీకరణ కింద ఇస్తే ప్రయోజనం స్వల్పమే..
ఉమ్మడి గుంటూరు జిల్లాలో తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో 29 గ్రామాల్లో 53,749.49 ఎకరాలను రాజధానిగా 2015లో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 37,941.58 ఎకరాలను రైతుల నుంచి సమీకరిస్తామని పేర్కొంది. అయితే 29 గ్రామాలకే పరిమితమైతే రాజధాని చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుందంటూ మలి విడతలో మరో 44 వేల ఎకరాలను సమీకరిస్తామని చంద్రబాబు 2024లో లీకులు ఇచ్చారు. రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో విడతల వారీగా సమీకరించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఏడు గ్రామాల్లో 20,494 ఎకరాల సమీకరణకు 2025 డిసెంబరు 2న ఉత్తర్వులు జారీ అయ్యాయి. భూసమీకరణ కింద ఎకరం భూమి ఇస్తే.. మెట్ట భూమికైతే అభివృద్ధి చేసిన వెయ్యి గజాల నివాస స్థలం, 200 గజాల వాణిజ్య ప్లాటు.. అదే జరీబు భూమి అయితే వెయ్యి గజాల నివాస, 450 గజాల వాణిజ్య ప్లాటు సీఆర్‌డీఏ ఇస్తుంది.
పూలింగ్ నుంచి మినహాయిస్తే భారీగా లబ్ధి..
భూసమీకరణతో ప్రయోజనం స్వల్పమే.. అదే మినహాయింపు లభిస్తే భారీగా లబ్ధి పొందవచ్చు. దీంతో భూసమీకరణ పథకం నిబంధనలను అడ్డు పెట్టుకుని భారీ ఎత్తున ప్రయోజనం పొందేందుకు ముఖ్యనేతకు అత్యంత సన్నిహితులైన ప్రజాప్రతినిధులు, నేతలు లేఅవుట్‌లను తెరపైకి తెస్తున్నారు. మలి విడత భూసమీకరణ కోసం ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 విధి విధానాలను 2025 జూలై 1న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు. ఆ విధి వి«ధానాల ప్రకారం గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఏడు గ్రామాల పరిధిలో 20,494 ఎకరాలను సమీకరించడానికి సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతి ఇస్తూ 2025 డిసెంబరు 2న ఉత్తర్వులు జారీ చేశారు.
అంటే.. అప్పటి ఆ గ్రామాల పరిధిలో లేఅవుట్‌లకు అనుమతి ఇవ్వకూడదని రెవెన్యూ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ.. ల్యాండ్ పూలింగ్ స్కీం–2025లో పదో నిబంధనను అడ్డుపెట్టుకుని లేఅవుట్‌లకు మినహాయింపు పొందడం ద్వారా భారీ ఎత్తున ప్రయోజనం పొందడానికి ముఖ్యనేత సన్నిహితులు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో తుళ్లూరు మండలం పెదపరిమిలో 9.798 ఎకరాల్లో లేఅవుట్ వేయడానికి అనుమతి కోసం సమర్పించిన దరఖాస్తును ఆ గ్రామంలో భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేయడానికి వారం ముందు సీఆర్‌డీఏ కమిషనర్ ఆమోదించారు. లేఅవుట్‌కు ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు ఇవ్వడం వల్ల..
ఆ లేవుట్‌లో ప్లాట్ల విస్తీర్ణం 21,623.12 చదరపు మీటర్లు(25,861.04 చదరపు గజాలు) పుట్టి రామచంద్రరావుకు వస్తుంది.
ఒకవేళ అదే భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చి ఉంటే.. ఆయనకు 9,798 గజాల ఇంటి స్థలం, 1,959.6 గజాల వాణిజ్య స్థలం, పదేళ్లపాటు కౌలు వస్తుంది. ఇక మల్లవరపు లక్షి, మల్లవరపు సాల్మన్ రాజు నుంచి జీపీఏ పొందిన భాష్యం రాజేష్, కొడాలి నాగేశ్వరరావు పెదపరిమిలో 3.8301 ఎకరాల్లో లేఅవుట్ అనుమతి కోసం అందచేసిన దరఖాస్తుపై ఏప్రిల్ 6న సీఆర్‌డీఏ కమిషనర్ ఆమోదముద్ర వేశారు. దీనివల్ల వారికి 9,408.91 చదరపు మీటర్లు (11,252.97 చదరపు గజాలు) విస్తీర్ణం కలిగిన ప్లాట్లు అందుబాటులోకి వస్తాయి. అదే వారు భూసమీకరణ కింద సీఆర్‌డీఏకు అప్పగిస్తే.. 3,830.1 చదరపు గజాల ఇంటి స్థలం, 766 గజాల వాణిజ్య స్థలం, పదేళ్లపాటు కౌలు వచ్చేది.

రాజధాని నిర్మాణానికి అదనంగా భూసమీకరణ కోసం ల్యాండ్ పూలింగ్ స్కీం(భూసమీకరణ పథకం)– 2025 విధి విధానాలను 2025 జూలై 1న ప్రభుత్వం జారీ (జీవో ఎంఎస్ నెంబరు 118) చేసింది.

పల్నాడు జిల్లాలో అమరావతి మండలం వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి.. గుంటూరు జిల్లాలో తుళ్లూరు మండలం వడ్డమాను, హరిశ్చంద్రాపురం, పెదపరిమి గ్రామాల్లో 20,494 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ స్కీం–2025 విధి విధానాల ప్రకారం సమీకరించేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతి ఇస్తూ
2025 డిసెంబరు 2న ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెంబరు 252) జారీ చేసింది.

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమిలో భూసమీకరణ యూనిట్–1 కింద 3,072.23 ఎకరాలు.. భూసమీకరణ యూనిట్–2 కింద 3,056.72 ఎకరాలను సమీకరించేందుకు ఏప్రిల్ 13న సీఆర్‌డీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ..పెదపరిమి భూసమీకరణ నోటిఫికేషన్ జారీకి సరిగ్గా వారం ముందు అంటే ఏప్రిల్ 6న అదే గ్రామంలో సర్వే నెంబరు 447/1బీ(పీ), 447/1సీ(పీ), 447/2లో 9.798 ఎకరాలలో పుట్టి రామచంద్రరావు వేసిన లేఅవుట్‌కు.. సర్వే నెంబరు 82/బీ(పీ)లో 3.8301లో మల్లవరపు లక్ష్మి, మల్లవరపు సాల్మన్ రాజు నుంచి జీపీఏ తీసుకున్న సన్ సిరి ప్రాజెక్ట్స్ గ్రీన్ డిలైట్ కేపిటల్ మేనేజింగ్ పార్టనర్లు భాష్యం రాజేష్, కొడాలి నాగేశ్వరరావుæ వేసిన లేఅవుట్‌కు సీఆర్‌డీఏ కమిషనర్ అనుమతి ఇచ్చేశారు.

ల్యాండ్ పూలింగ్ స్కీం–2025 పదో నిబంధన ప్రకారం వీజీటీఎం, ఉడా, సీఆర్‌డీఏ, డీటీసీపీ నుంచి అనుమతి పొందిన లేఅవుట్‌లను భూసమీకరణ నుంచి మినహాయించాలి. అంటే.. పుట్టి రామచంద్రరావు, భాష్యం రాజేష్, కొడాలి నాగేశ్వరరావులు వేసిన లేఅవుట్‌లకు సంబంధించి 13.8301 ఎకరాలకు భూసమీకరణ నుంచి మినహాయింపు లభిస్తుంది. తద్వారా వారికి భారీ ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది. ల్యాండ్ పూలింగ్ స్కీంను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాక.. లేఅవుట్‌లకు అనుమతి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేయడానికి సరిగ్గా వారం ముందు లేఅవుట్‌లకు అనుమతి ఇవ్వడంపై రాజధాని రైతులు విస్తుపోతున్నారు. ముఖ్యనేతకు సన్నిహితుడైన కార్పొరేట్ ఎమ్మెల్యే సన్నిహితులకు ఒక న్యాయం.. తమకో న్యాయమా..! అంటూ రాజధాని రైతులు మండిపడుతున్నారు.


