డీఎస్సీతో డీలా.. కోఎంప్ట్‌ గోల.. యూటర్నే శరణ్యం | Chandrababu Govt Backward Polytechnic evaluation offline | Sakshi
Sakshi News home page

డీఎస్సీతో డీలా.. కోఎంప్ట్‌ గోల.. యూటర్నే శరణ్యం

Jun 7 2026 4:57 AM | Updated on Jun 7 2026 4:57 AM

Chandrababu Govt Backward Polytechnic evaluation offline

వెనక్కు తగ్గిన సర్కారు.. ఆఫ్‌లైన్‌లోనే పాలిటెక్నిక్‌ మూల్యాంకనం

విద్యా వ్యవస్థను కుదిపేస్తున్న అక్రమాల రాకెట్‌ 

అటు నీట్‌ ప్రశ్నపత్రాల లీక్‌.. ఇటు డీఎస్సీలో అవకతవకలు 

కోఎంప్ట్‌ నిర్వాకంతో తప్పులతడకగా సీబీఎస్‌ఈ మూల్యాంకనం.. ఇలాంటి సంస్థకు ‘ఆన్‌లైన్‌లో పాలిటెక్నిక్‌ మూల్యాంకనం’ 

కాంట్రాక్టు కట్టబెట్టిన చంద్రబాబు సర్కారు 

విద్యార్థుల భవిష్యత్తుతో ప్రయోగాలా.. అంటూ ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర విమర్శలు 

విద్యార్థులకు జరుగుతున్న నష్టంపై ఆధారాలతో సహా బయటపెట్టిన ‘సాక్షి’ 

ఎట్టకేలకు మాన్యువల్‌ మూల్యాంకనానికే మొగ్గు.. 

వారంలో పూర్తి చేయాలంటూ టార్గెట్‌ 

ఆన్‌లైన్‌ మూల్యాంకనం అనేది పైలట్‌ ప్రాజెక్టు అని కవరింగ్‌

సాక్షి, అమరావతి:  విద్యా వ్యవస్థకు సంబంధించిన వరుస వివాదాలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఇటీవల నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించగా, పరీక్షల నిర్వహణలో, మూల్యాంకనంలో పారదర్శకత, భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు నిరసనలకు దిగుతూ పరీక్షా వ్యవస్థలో సంస్కరణలకు డిమాండ్‌ చేశాయి. ఇదే సమయంలో సీబీఎస్‌ఈ ఆన్‌లైన్‌ మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకున్నాయని పెద్ద ఎత్తున వచ్చిన ఆరోపణలు విద్యా రంగాన్ని ఓ కుదుపు కుదిపాయి. ఈ అంశం పలు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఏకంగా 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వివాదాలకు కారణమైన కోఎంప్ట్‌ సంస్థ పనితీరుపై దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, ఆ సంస్థకే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాలిటెక్నిక్‌ సమాధానపత్రాల ఆన్‌లైన్‌ మూల్యాంకన కాంట్రాక్టును అప్పగించడం మరింత వివాదానికి దారితీసింది. 

మూల్యాంకనంలో పొరపాట్లు, సాంకేతిక లోపాలు, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలపై అధ్యాపక సంఘాలు, విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మరోవైపు డీఎస్సీలో అక్రమాలు బట్టబయలు కావడంతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఒక్క ప్రశ్నకు కూడా ప్రభుత్వం నుంచి నేరుగా సమాధానం రావడం లేదు. ఫ్యాక్ట్‌చెక్‌ పేరుతో ఇస్తున్న సమాచారంలో డొల్లతనాన్ని అభ్యర్థులు ఎత్తి చూపుతున్నారు. ప్రభుత్వం తరఫున ఉన్నతాధికారులు కౌంటర్‌ ఇవ్వలేక తడబడుతున్నారు. బాధితులు నేరుగా రోడ్డెక్కి చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గాన్ని కడిగి పారేస్తున్నారు. స్పోర్ట్స్‌ డీఎస్సీ పోస్టులను సంతలో సరుకులా రేటు కట్టి అమ్ముకున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పేట దాడి పెరగడంతో పాటు పారదర్శకతపై సందేహాలు వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం చివరకు తన నిర్ణయాన్ని పునఃసమీక్షించింది. ఫలితంగా పాలిటెక్నిక్‌ సమాధానపత్రాల మూల్యాంకనాన్ని ఆన్‌లైన్‌ విధానంలో కాకుండా సంప్రదాయ ఆఫ్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించింది. 

తప్పుల మీద తప్పులు చేస్తున్న సర్కారు 
రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతోంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆధ్వర్యంలోని విద్యాశాఖ తప్పుల మీద తప్పులు చేస్తుండడంతో పాలిటెక్నిక్‌లో వార్షిక పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనాన్ని గందరగోళంగా మార్చేసింది. వారానికో విధానం అమలు చేస్తూ భారీగా నిధులు ఖర్చు చేస్తూ ఫలితాల ప్రకటనపై పిల్లిమొగ్గలు వేస్తోంది. ఈ ఏడాది కొత్తగా వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో ‘‘ఆన్‌ స్క్రీన్‌ మార్కింగ్‌ డిజిటల్‌ వాల్యూయేషన్‌’’ (ఓఎస్‌ఎం) ప్రక్రియను ప్రభుత్వం అమలు చేయాలనుకుంది. ఒక్కో ఎగ్జామినర్‌ 24 గంటల సమయంలో ఎన్ని జవాబు పత్రాలైనా మూల్యాంకనం చేసుకునేలా అధికారులు అవకాశం ఇచ్చారు. 


ఓఎస్‌ఎం విధానంలో తప్పులు జరుగుతున్నాయని మే 18న ‘ఇదేం టెక్నిక్‌ మహాశయా?’ పేరుతో ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసింది. దీంతో ఓఎస్‌ఎం ఎంతో ఉత్తమ విధానమంటూ వివరణ ఇచ్చిన అధికారులు.. సాంకేతికంగా పరిజ్ఞానం అందించిన ‘కోఎంప్‌్ట’ సంస్థను వెనుకేసుకొచ్చారు. ఆ తర్వాత విమర్శలు వెల్లువెత్తడంతో ఇప్పుడు ఉన్నఫళంగా ఆన్‌లైన్‌ మార్కుల విధానాన్ని పక్కనబెట్టి ‘తూచ్‌.. ఇది పైలట్‌’ మాత్రమేనని మాట మార్చడం గమనార్హం. అంతేగాక మళ్లీ మాన్యువల్‌గా మూల్యాంకనం చేయాలని, అదీ.. ఒకే ఒక్క వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించడం చూస్తుంటే విద్యార్థుల జీవితాలు ఏ దరికి చేరతాయోనని ఆందోళన వ్యక్తమవుతోంది.   

కోఎంప్ట్‌ ఇన్‌ఫ్రాకు రూ.కోట్లు చెల్లింపు 
స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఎస్‌బీటీఈటీ) 2025–26 విద్యా సంవత్సరంలో వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఆన్‌లైన్‌ విధానం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఆన్‌స్క్రీన్‌ మార్కింగ్‌ డిజిటల్‌ వ్యాల్యూయేషన్‌ (ఓఎస్‌ఎం) సాంకేతిక పరిజ్ఞానాన్ని కోఎంప్ట్‌ సంస్థ నుంచి తీసుకున్నారు. ఇదే సంస్థ సీబీఎస్‌ఈ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం కూడా నిర్వహించి బొక్కబోర్లా పడింది. ఈ సంస్థపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా ఉన్నత విద్యాశాఖలో సాంకేతిక విద్యాశాఖ విలీన సమయంలో ‘కోఎంప్ట్‌’ సంస్థకు రూ.కోట్ల కాంట్రాక్టును కట్టబెట్టారు. ఈ ఏడాది మొత్తం 7.05 లక్షల స్క్రిప్టుల మూల్యాంకన ప్రక్రియను ఓఎస్‌ఎం విధానంలో చేపట్టారు. ఒక్కో స్క్రిప్టు మూల్యాంకనం చేసేందుకు రూ.18 చొప్పున ఎగ్జామినర్లకు చెల్లించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఒక్కొక్కరు రోజుకు 40 నుంచి 45 పేపర్లు మాత్రమే మూల్యాంకనం చేయాల్సి ఉండగా, 100కు పైగా స్క్రిప్టులు చేయించారు. ఇందుకోసం ఇప్పటికే రూ.1.50 కోట్లు ఖర్చు చేశారు. ఈ విధానంలో విద్యార్థులకు నష్టం జరుగుతోందని ‘సాక్షి’ ఆధారాలతో సహా వెలుగులోకి తేవడంతో ఉత్తమ విధానంపై బురద జల్లుతున్నారని ఖండించారు.

తాజాగా మాన్యువల్‌ మూల్యాంకనం
పాలిటెక్నిక్‌ వార్షిక పరీక్షల ఫలితాలను జూన్‌ మొదటి వారంలో విడుదల చేయాలని ఆన్‌లైన్‌ విధానంలో మూల్యాంకనం పూర్తి చేశారు. అయితే, ఇప్పుడు ఆ మార్కులను పక్కనబెట్టి, మాన్యువల్‌ విధానంలో మూల్యాంకనం చేయాలని, అదీ వారం రోజుల్లోనే మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని  తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆన్‌ స్క్రీన్‌ మార్కింగ్‌ విధానంపై తీవ్ర విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా 7 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్‌ను ఫణంగా పెట్టి, ఇప్పుడు ఆ మార్కులు చెల్లవని, మాన్యువల్‌ మార్కులనే పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిపై ఎస్‌బీటీఈటీ కార్యదర్శిని వివరణ కోరగా సమాధానం దాటవేయడం గమనార్హం. 

Advertisement
 
Advertisement
Advertisement