ఇంటిగ్రేటెడ్ డిజిటల్ హెల్త్ ఎక్స్‌టెన్షన్ వర్కర్స్
ప్లాట్‌ఫామ్ ప్రాజెక్ట్‌కు వైద్యశాఖ ప్లాన్
టెండర్ నిబంధనల ప్రకారం ఏబీడీఎంతో భాగస్వామ్య కంపెనీలకే అర్హత
కానీ ఉద్యోగుల ముఖ హాజరు చూస్తున్న కంపెనీకి అడ్డదారుల్లో కాంట్రాక్ట్ కట్టబెట్టడానికి ప్రయత్నాలు
ఏబీడీఎంతో భాగస్వామ్యం లేకపోయినా ఆ కంపెనీ బిడ్‌కు అక్రమంగా ప్రీ–క్వాలిఫికేషన్‌లో ఆమోదం?
సుమారు రూ.40 కోట్ల కాంట్రాక్టులో అక్రమాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో మరో భారీ అవినీతికి ‘కాంట్రాక్టు’ కుదిరింది. ‘వైద్యం’ ప్రాజెక్ట్ పేరుతో నచ్చినవారికి అడ్డగోలుగా ప్రజాధనాన్ని నైవేద్యంగా సమర్పించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. వైద్యశాఖ పరిధిలోని వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం కోసం ఇటీవల ఇంటిగ్రేటెడ్ డిజిటల్ హెల్త్ ఎక్స్‌టెన్షన్ వర్కర్స్ ప్లాట్‌ఫామ్ ప్రాజెక్ట్‌కు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) ద్వారా టెండర్ ఆహ్వానించారు. ఈ ప్రాజెక్ట్‌కు ‘వైద్యం’ అని పేరు పెట్టారు. 66 నెలల కాలపరిమితితో కూడిన సుమారు రూ.40 కోట్ల ఈ ప్రాజెక్ట్‌ను ఉద్యోగుల ముఖ హాజరు సేవలు అందిస్తున్న కంపెనీకి అడ్డగోలుగా కట్టబెట్టడానికి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు సంస్థ బిడ్‌ను టెండర్ నిబంధనలకు విరుద్ధంగా ప్రీ–క్వాలిఫికేషన్‌లో ఆమోదించినట్టు విశ్వసనీయ సమాచారం.
ఏబీడీఎం భాగస్వామ్యం లేకపోయినా
‘వైద్యం’ ప్రాజెక్ట్ టెండర్‌కు నాలుగు సంస్థలు బిడ్‌లు దాఖలు చేశాయి. టెండర్ నిబంధనల ప్రకారం ఆ కంపెనీలు కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(ఏబీడీఎం)లో భాగస్వామ్యం కలిగి ఉండాలి. టెండర్‌లు వేసిన నాలుగు కంపెనీల్లో ఒకటైన ఉద్యోగుల ముఖ హాజరు సేవలు అమలు చేస్తున్న సంస్థకు ఏబీడీఎంలో భాగస్వామ్యం లేదు. ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాలను బిడ్‌లో పొందుపరచలేదు. అందువల్ల ప్రీ–క్వాలిఫికేషన్ దశలోనే బిడ్‌ను తిరస్కరించాలి. అయితే, ఈ సంస్థకు అడ్డగోలుగా కాంట్రాక్ట్ ఇచ్చేందుకు డీల్స్ కుదరడంతో ప్రీ–క్వాలిఫికేషన్‌లో బిడ్‌ను ఆమోదించడానికి వైద్యశాఖలోని ఓ ఉన్నతాధికారి అక్రమాలకు తెరలేపారని తెలుస్తోంది.
ఏబీడీఎంలో భాగస్వామ్యమైన కంపెనీలనే అనుమతించాలని టెండర్ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నా... ఉద్యోగుల ముఖ హాజరు ప్రాజెక్ట్ అనుభవం ఆధారంగా బిడ్ ఆమోదించేలా స్వయంగా ఉన్నతాధికారే అక్రమాలకు తెరలేపారని సమాచారం. వాస్తవానికి ఏపీటీఎస్ టెండర్ ఆహ్వానించిన అనంతరం నిర్వహించిన ప్రీ–బిడ్ సమావేశంలో 10 నుంచి 20 కంపెనీలు పాల్గొన్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఏబీడీఎంలో భాగస్వామ్యం నిబంధనను సడలించాలని 10కి పైగా కంపెనీలు కోరగా, వైద్యశాఖ అంగీకరించలేదు. ఇప్పుడా నిబంధనను తుంగలో తొక్కి అర్హత లేని కంపెనీ బిడ్‌ను ఆమోదించడానికి సర్వం సిద్ధం చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.


