ఒక్కో బిల్డింగ్‌కు ఒక్కో రేటు.. ముడుపుల రూటు సపరేటు | Chandrababu Govt Amaravati Capital construction works scam | Sakshi
Sakshi News home page

ఒక్కో బిల్డింగ్‌కు ఒక్కో రేటు.. ముడుపుల రూటు సపరేటు

May 25 2025 2:52 AM | Updated on May 25 2025 9:41 AM

Chandrababu Govt Amaravati Capital construction works scam

అమరావతి స్కామ్‌ల పురం  

రాజధాని నిర్మాణ పనుల అంచనా వ్యయంపై ఇంజినీరింగ్‌ నిపుణులు విస్మయం

మంత్రులు, హైకోర్టు జడ్జిల బంగ్లాల నిర్మాణ వ్యయం చదరపు అడుగు రూ.10,418.97 

ఐఏఎస్‌ అధికారుల బంగ్లాల నిర్మాణ వ్యయం చదరపు అడుగు రూ.9,771.25 

ఐదు ఐకానిక్‌ టవర్ల నిర్మాణ వ్యయం చ.అ రూ.8,981 

మామూలుగా చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించదంటున్న ఇంజినీర్లు 

ఇటాలియన్‌ మార్బుల్స్‌తో ఫైవ్‌ స్టార్‌ సదుపాయాలతో కట్టినా చ.అ. రూ.4,000–4,500కు మించదు  

నివ్వెరపోతున్న హైదరాబాద్, బెంగళూరు, ముంబైలో హైరైజ్‌ బిల్డింగ్స్‌ నిర్మిస్తున్న బిల్డర్లు   

అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం మరింతగా తగ్గుతుందంటున్న అధికారులు, నిపుణులు 

వివిధ శాఖల నేతృత్వంలో నిర్మిస్తున్న భవనాల నిర్మాణ వ్యయం చ.అ. రూ.2,500 

రాజధానిలో మాత్రం భారీగా పెంచిన సీఆర్‌డీఏ.. పెరిగిన వ్యయం కమీషన్ల రూపంలో చేరాల్సిన జేబులోకి చేరుతోందంటున్న అధికారవర్గాలు  

సాక్షి, అమరావతి: ‘మామూలుగా భవనాల (బిల్డింగ్‌) నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించదు. అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫైవ్‌ స్టార్‌ వసతులు కల్పిస్తూ నిర్మించినా చదరపు అడుగుకు రూ.4,500కు మించి ఖర్చు కాదు’ అని ఇంజినీరింగ్‌ నిపుణులు తేల్చి చెబుతుంటే రాజధాని అమరావతిలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఇక్కడ భవనాల నిర్మాణ వ్యయానికి రెక్కలు వచ్చాయి. నిర్మాణ వ్యయం బిల్డింగ్‌ బిల్డింగ్‌కు మార్చేశారు. 

చదరపు అడుగుకు రూ.10,418.97 చొప్పున భవనాల నిర్మాణ పనులను ముఖ్య నేత ఏర్పాటు చేసిన సిండికేట్‌ కాంట్రాక్టు సంస్థలకు కట్టబెట్టేయడంపై ఇంజినీరింగ్‌ నిపుణులు, బిల్డర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటాలియన్‌ మార్బుల్స్‌తో ఫైవ్‌ స్టార్‌ సదుపాయాలతో కట్టినా చదరపు అడుగు రూ.4వేలు–­రూ.4,500కు మించ­దని హైదరాబాద్, బెంగళూరు, ముంబయిలో హైరైజ్‌ బిల్డింగ్స్‌ నిర్మిస్తున్న బిల్డర్లు నివ్వెరపోతున్నారు. ఆ భవనాలను ఏమైనా వెండితో కడుతున్నారా.. బంగారపు పూత పూస్తున్నారా.. అంటూ ఆశ్చ­ర్యం వ్యక్తంచేస్తున్నారు. భారీగా పెరిగిన నిర్మా­ణ వ్యయం కమీషన్ల రూపంలో చేరాల్సిన జేబులోకి వెళ్తోందంటూ అధికార వర్గాల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. 

అప్పు తెచ్చిన సొమ్ముతో...
ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), కేఎఫ్‌డబ్ల్యూ (జర్మనీ) వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, హడ్కో వంటి జాతీయ సంస్థ నుంచి అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులతో చేపట్టిన పనుల్లో ఈ స్థాయిలో దోపిడీకి తెర తీయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని అమరావతిలో శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ, సచివా­లయం (ఐదు ఐకానిక్‌ టవర్లు), మంత్రులు, హైకోర్టు జడ్జిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గెజిటెడ్, నాన్‌ గెజిటెడ్‌ అధికారుల నివాసాల (క్వార్టర్స్‌) నిర్మాణ పనులకు 2016–18లోనే టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించారు. 

అప్పట్లో చేయగా మిగిలిన పనుల కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసి.. ఇటీవల సీఆర్‌డీఏ మళ్లీ టెండర్లు పిలిచింది. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 65 శాతం నుంచి 105 శాతం వరకు పెంచేసి టెండర్లు పిలిచి.. అధిక ధరలకు సిండికేట్‌ కాంట్రాక్టర్లకు అప్పగించేసింది. కాంట్రాక్టు ఒప్పందం విలువలో పది శాతాన్ని మొబిలైజేషన్‌ అడ్వాన్సుల రూపంలో కాంట్రాక్టర్లకు ఇచ్చి.. అందులో ఎనిమిది శాతం ముఖ్య నేత, మిగతా రెండు శాతం కాంట్రాక్టర్లు నీకింత.. నాకింత.. అంటూ పంచుకున్నారు.  

మంత్రుల బంగ్లా వ్యయం రూ.6.99 కోట్లు  
రాజధాని ప్రధాన ప్రాంతం (కోర్‌ కేపిటల్‌ ఏరియా)లో 26.09 ఎకరాల్లో ఒక్కొక్కటి 6,600 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో మంత్రుల కోసం జీ+1 పద్ధతిలో 35 బంగ్లాలు.. 24.13 ఎకరాల్లో ఒక్కొక్కటి 6,745 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో హైకోర్టు న్యాయమూర్తుల కోసం జీ+1 పద్ధతిలో 36 బంగ్లాల నిర్మాణ పనుల్లో మిగిలిన పనులను రూ.495.86 కోట్లకు బీఎస్సార్‌ ఇన్‌ఫ్రాకు అప్పగించారు. మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులకు నిర్మిస్తున్న 71 బంగ్లాల్లో మొత్తం నిర్మిత ప్రాంతం 4,75,920 చదరపు అడుగులుగా టెండర్‌లో పేర్కొన్నారు. 

కానీ.. టెండర్‌ డాక్యుమెంట్‌ను పరిశీలిస్తే మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల బంగ్లాల్లో ఒక్కో బంగ్లా నిర్మిత ప్రాంతాన్ని బట్టి చూస్తే.. మొత్తం నిర్మిత ప్రాంతం 4,73,820 చదరపు అడుగులే. అంటే.. నిర్మిత ప్రాంతాన్ని 2,100 చదరపు అడుగులు పెంచినట్లు స్పష్టమవుతోంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఈ బంగ్లాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.10,418.97. ఒక్కో బంగ్లా నిర్మాణ వ్యయం రూ.6.99 కోట్లు. పైగా ఇసుక ఉచితం. హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాల్లో ఇదే రకమైన బంగ్లాల ధర భూమితో కలిపి రూ.4 కోట్లలోపేనని బిల్డర్లు ఎత్తి చూపుతున్నారు. 
 


ఐఏఎస్‌ల బంగ్లా చదరపు అడుగు రూ.9,771  
రాజధానిలో రాయపూడి వద్ద 30.47 ఎకరాల్లో ఒక్కొక్కటి 5,464 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో ముఖ్య కార్యదర్శుల కోసం జీ+1 పద్ధతిలో 25 బంగ్లాలు.. కార్యదర్శుల కోసం జీ+1 పద్ధతిలో ఒక్కొక్కటి 4,350 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో 90 బంగ్లాల నిర్మాణంలో మిగిలిన పనులను రూ.516.02 కోట్లకు కేఎమ్వీ ప్రాజెక్ట్స్‌కు అప్పగించారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే 115 బంగ్లాల నిర్మిత ప్రాంతం 5,28,100 చదరపు అడుగులు. అంటే.. చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.9,771.25. 

అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్గత రోడ్లు, మురుగు నీటి వ్యవస్థ, విద్యుత్‌ సరఫరా వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలతో ఇలాంటి బంగ్లాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4,500కు మించదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఐఏఎస్‌ అధికారుల ఒక్కో బంగ్లా నిర్మాణ వ్యయం రూ.4.49 కోట్లు. హైదరాబాద్, బెంగుళూరు వంటి మహానగరాల్లో ఇదే రకమైన బంగ్లాల ధర భూమితో కలిపి రూ.3 కోట్లకు మించదని రియల్టర్లు స్పష్టం చేస్తున్నారు.

నాడూ నేడు ఒకే రీతిలో దోపిడీ  
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2015లో ఓటుకు కోట్లు ఎరగా వేసి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో టేపు­లతో అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు తెలంగాణ సర్కార్‌కు అడ్డంగా దొరికిపోయారు. ఆ కేసు భయంతో హైదరాబాద్‌ నుంచి ఉండవల్లి కరకట్టలోని లింగమనేని అక్రమ బంగ్లాలోకి మకాం మార్చారు.  

⇒ ఆ తర్వాత అమరావతి నుంచే పరిపాలన చేయడం కోసం ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్‌ అండ్‌ టీ సంస్థ­లకు అప్పగించారు. కానీ, వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు.  

⇒ ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వ్యక్తమయ్యాయి. షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ నుంచి సీఎం తరఫున కమీషన్లు వసూలు చేసి, ఐటీ శాఖకు సీఎం చంద్రబాబు వ్యక్తి­గత కార్యదర్శి అప్పట్లో పట్టుబడటం కలకలం రేపింది. ఇప్పుడు శాశ్వత సచివాల­యం పేరుతో నిర్మిస్తున్న ఐకానిక్‌ టవర్ల నుంచి అధికారుల నివాసాల వరకు.. డిజైన్‌ మారిందని.. పని స్వభావం మారిందని.. ధరలు పెరిగాయనే సాకు చూపి.. 2015–19 తరహాలోనే దోపిడీకి తెర తీశారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి.  

ఐకానిక్‌ టవర్ల నిర్మాణ వ్యయం ఆకాశమంత  
⇒ రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం డయాగ్రిడ్‌ విధానంలో ఐదు ఐకానిక్‌ టవర్లు నిర్మించేలా పోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌ృజెనిసిస్‌ ప్లానర్స్‌ృడిజైన్‌ ట్రీ సర్వీస్‌ కన్సెల్టెంట్స్‌ సంస్థలు 2018లో డిజైన్‌లు (ఆకృతులు)  రూపొందించాయి.  

⇒ ఐదు ఐకానిక్‌ టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్‌ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ సీఆర్‌డీఏ ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఆ ఐకానిక్‌ టవర్ల నిర్మాణంలో మిగిలిన పనులకు రూ.4,688.82 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది.  

⇒ నాలుగు టవర్లను బీ+జీ+39 అంతస్తు­లతో.. ఐదో టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మించనుంది. ఈ ఐదు టవర్ల మొత్తం నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). దీన్ని బట్టి చూస్తే ఐకానిక్‌ టవర్లలో మిగిలిన పనుల నిర్మాణ వ్యయం చదరపు అడుగు రూ.8,981.56. ఈ లెక్కన చూసుకుంటే 2018 నాటితో పోల్చితే ఇప్పుడు ఐకానిక్‌ టవర్ల నిర్మాణ వ్యయం రూ.2,417.68 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది.  

⇒ అంటే.. అంచనా వ్యయం 105 శాతం పెంచేశారన్న మాట. నిజానికి 2018ృ19 ధరలతో పోల్చితే ప్రస్తుతం సిమెంటు, స్టీలు, పెట్రోల్, డీజిల్‌ సహా నిర్మాణ సామగ్రి ధరల్లో పెద్దగా మార్పు లేదు. ఇక ఇసుక ఉచితం. ఈ లెక్కన నిర్మాణ వ్యయం పెరగడానికి వీల్లేదని ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. నిజానికి డయాగ్రిడ్‌ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని, చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించి వ్యయం కాదని ఇంజినీరింగ్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement