సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి టర్మ్ రుణం
అసలు, వడ్డీకి ప్రభుత్వం గ్యారెంటీ... ఉత్తర్వులు జారీ
దీంతో మార్క్‌ఫెడ్ ద్వారా చేసిన అప్పు రూ.22,000 కోట్లు
సాక్షి, అమరావతి: బడ్టెట్ లోపల బడ్జెట్ బయట అప్పులు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగుతోంది. మార్కెఫెడ్ ద్వారా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి టర్మ్ రుణం రూ.300 కోట్లు తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. అసలు, వడ్డీకి ప్రభుత్వ గ్యారెంటీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మార్క్‌ఫెడ్ రుణ సంస్థ్ధకు తన బాధ్యతలను చెల్లించడంలో విఫలమైన సందర్భంలో ప్రభుత్వ గ్యారెంటీ అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
మార్క్‌ఫెడ్ తన సొంత నిధుల నుంచి రుణ సేవలను భరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వడ్డీ రేటు, కాల వ్యవధి, మారటోరియం కాలం మొదలైన వివరాలతో పాటు, ఏవైనా షరతులు ఉంటే వాటితో సహా, అసలు, వడ్డీ తిరిగి చెల్లించే షెడ్యూల్‌ను సమర్పించాలని అందులో పేర్కొంది. గ్యారెంటీ ఇచ్చిన మొత్తంపై ఐదు శాతం గ్యారెంటీ కమీషన్ చెల్లించాలని తెలిపింది. ఇందుకు అనుగుణంగా మార్క్‌ఫెడ్ ఎండీ తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. ఇప్పటికే మార్క్‌ఫెడ్ ద్వారా రూ.21,700 కోట్ల మేర చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది. ఇప్పుడు చేసే రూ.300 కోట్ల అప్పుతో మార్క్‌ఫెడ్ ద్వారా చేసిన అప్పు రూ.22,000 కోట్లకు చేరింది.


