భోగాపురం ఎయిర్‌పోర్టుపై చంద్రబాబు క్రెడిట్ చోరీ యత్నాలను ‘ఎక్స్’ వేదికగా ఎండగట్టిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్
క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్.. అదే బాబు మార్కు రాజకీయం
ఎన్నికలకు ముందు ఒక రాయి వేయడం మినహా మీరు చేసింది ఏముంది బాబూ?
నిర్వాసితులకు పునరావాసం, భూసేకరణ, నీటి సౌకర్యం, మౌలిక సదుపాయాలకు రూ.1,200 కోట్లు ఖర్చు పెట్టింది మేమే.. మరి మీరు చేసింది ఏమిటి బాబూ?
కోవిడ్ లాంటి మహా సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే పనులు ప్రారంభించి 2024 ఎన్నికల నాటికే విమానాశ్రయ రన్‌వే పనులను కీలక దశకు తేగలిగాం
టెర్మినల్ నిర్మాణ పనులను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాం
మా ప్రభుత్వం చేసిన విశేష కృషితోనే 2026 జూన్‌లో భోగాపురం నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతాయని ఆనాడే ప్రకటించాం
మేం చేపట్టిన పనుల ఫలితంగానే విమానాశ్రయం ఇవాళ ప్రారంభోత్సవానికి సిద్ధమైందని గర్వంగా చెప్పుకోగలం
పని చేయకుండా ప్రచారం చేసుకోవడం.. కష్టపడకుండా కీర్తిని కొట్టేయడం.. ఇతరుల కృషిని మీ ఖాతాలో వేసుకోవటాన్ని ఇకనైనా మానండి చంద్రబాబూ..!
సాక్ష్యాధారాలను జత చేస్తూ క్రెడిట్ చోర్ బాబు హ్యాష్‌ట్యాగ్‌తో ‘ఎక్స్’లో పోస్టు చేసిన వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కోసం సీఎం చంద్రబాబు ఏమీ చేయకపోయినా కీర్తి కోసం క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఒక ప్రాజెక్టు కట్టింది ఒకరైతే.. కీర్తి కొట్టేస్తోంది మరొకరు! ఇదీ భోగాపురం ఎయిర్‌పోర్టు కథ! పనులు చేసింది వైఎస్సార్ సీపీ.. ప్రచారం చంద్రబాబుది! క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్..! అదే చంద్రబాబు మార్కు రాజకీయం..! అంటూ మండిపడ్డారు.
తమ ప్రభుత్వంలో విమానాశ్రయం నిర్మాణం కోసం భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పన, నీటి సౌకర్యం, మౌలిక సదుపాయాలకు రూ.1,200 కోట్లు వెచ్చించి.. కోవిడ్ లాంటి మహా సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే పనులు ప్రారంభించి, 2024 ఎన్నికల నాటికే విమానాశ్రయ రన్‌వే పనులను కీలక దశకు తీసుకు రాగలిగామని గుర్తు చేశారు. టెర్మినల్ నిర్మాణ పనులను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లామన్నారు. తమ ప్రభుత్వం చేసిన విశేష కృషి నేపథ్యంలోనే 2026 జూన్‌లో భోగాపురం నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతాయని అప్పుడే ప్రకటించామని గుర్తు చేశారు.

భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (ఫైల్)
తాము చేపట్టిన పనుల ఫలితంగానే విమానాశ్రయం ఇవాళ ప్రారంభోత్సవానికి సిద్ధమైందని గర్వంగా చెప్పుకోగలమని స్పష్టం చేశారు. 2019 ఎన్నికలకు నెల రోజుల ముందు హడావిడిగా శంకుస్థాపన చేయడం మినహా భోగాపురం విమానాశ్రయం కోసం మీరు చేసింది ఏముంది చంద్రబాబూ? అని ప్రశ్నించారు. భోగాపురం విమానాశ్రయంపై చంద్రబాబు క్రెడిట్ చోరీ యత్నాలను సాక్ష్యాధారాలతో ‘ఎక్స్’ వేదికగా వైఎస్ జగన్ ఎండగట్టారు. క్రెడిట్ చోర్ బాబు హ్యాష్ ట్యాగ్‌తో సాక్ష్యాధారాలు, భోగాపురం విమానాశ్రయం నుంచి విశాఖకు ఆరు లేన్ల హైవేను మంజూరు చేస్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన వీడియోను జత చేస్తూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ బుధవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..
» ‘‘ఉత్తరాంధ్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలవనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం కావడం ఎంతో సంతోషకరం. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ఎయిర్‌పోర్టు కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కావడం భోగాపురానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తెస్తుంది. తద్వారా దేశ విదేశాల్లో ఈ విమానాశ్రయం గురించి విస్తృతంగా తెలియడంతో వ్యాపార, వాణిజ్య, పర్యాటక రంగాలు మరింత ఊపందుకునే అవకాశం ఏర్పడుతుంది. అయితే ఇదే సమయంలో భోగాపురం విమానాశ్రయం క్రెడిట్‌ను చోరీ చేసేందుకు చంద్రబాబు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. తాను ఏమీ చేయకపోయినా కీర్తి తనకే దక్కాలంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.
» చంద్రబాబు గారూ..! భోగాపురం విమానాశ్రయం కోసం మీరు నిజంగా ఏం చేశారో కనీసం మీ మనస్సాక్షినైనా ప్రశ్నించుకోండి. ఏమీ చేయకపోయినా 2019 ఎన్నికలకు నెల రోజుల ముందు హడావిడిగా ఒక రాయి వేయడం మినహా భోగాపురం విమానాశ్రయం కోసం మీరు చేసింది ఏముంది?
» జూన్ 2020లో నిర్మాణం కోసం జీఎంఆర్ సంస్థతో కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం నుంచి, ల్యాండ్ అక్విజేషన్, ఆర్ అండ్ ఆర్, సైట్ క్లియరెన్స్, ఎన్‌ఓసీలు, భద్రతా అనుమతులు, నీరు, విద్యుత్, ఇంటర్నల్ రోడ్లు, ఏరోనాటికల్ సర్వీసులు, ఆర్థిక సమీకరణ వరకు ప్రతి కీలకమైన ప్రక్రియ పూర్తయింది మా ప్రభుత్వ హయాంలోనే. కాదంటారా చంద్రబాబు గారూ?
» అన్నింటికంటే ముఖ్యంగా మీరు పూర్తి చేయలేకపోయిన భూసేకరణను మేం పూర్తి చేశాం. నిర్వాసితులైన 4 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాం. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసం రూ.967 కోట్లు, ఎయిర్‌పోర్టుకు నీళ్లు తీసుకురావడం కోసం రూ.75 కోట్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.134.5 కోట్లు, ప్రత్యామ్నాయ రోడ్ల కోసం రూ.7.29 కోట్లు, సబ్‌స్టేషన్ కోసం రూ.2.35 కోట్లు మొత్తంగా రూ.1,200 కోట్లు ఖర్చు పెట్టింది మేమే. మరి మీరు చేసింది ఏమిటి చంద్రబాబు గారూ? ఇవన్నీ పూర్తి చేశాం కాబట్టే.. అన్ని అనుమతులు, అన్ని ఎన్‌వోసీలు, అన్ని సౌకర్యాలు పూర్తి చేశాం కాబట్టే, కోవిడ్ లాంటి మహా సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే పనులు ప్రారంభించి 2024 ఎన్నికల నాటికే విమానాశ్రయ రన్‌వే పనులను కీలక దశకు తీసుకురాగలిగాం. టెర్మినల్ నిర్మాణ పనులను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాం.
» మా ప్రభుత్వం చేసిన విశేష కృషి నేపథ్యంలోనే 2026 జూన్‌లోనే భోగాపురం నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతాయని అప్పుడే ప్రకటించాం. మేం చేపట్టిన పనుల ఫలితంగానే విమానాశ్రయం ఇవాళ ప్రారంభోత్సవానికి సిద్ధమైందని గర్వంగా చెప్పుకోగలం.
» చంద్రబాబు గారూ మీరు అప్పుడూ ఏమీ చేయలేదు. ఇప్పుడు కూడా ఏమీ చేయడం లేదు. విశాఖ నగరం నుంచి విమానాశ్రయానికి వేగంగా చేరుకునేందుకు ఇప్పటికీ సరైన రోడ్డు సదుపాయం లేదు. ఎయిర్‌పోర్టు ఉంది కానీ సిటీ నుంచి వేగంగా, తక్కువ సమయంలో చేరుకునేందుకు రోడ్డు లేదు. భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన సమయంలో విశాఖ నుంచి విమానాశ్రయానికి వేగంగా చేరుకునేలా 77 మీటర్ల వెడల్పుతో, రూ. 6,300 కోట్ల ఖర్చుతో 55 కి.మీ. మేర ఆరులేన్ల హైవే కోసం కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తేవడంతో కేంద్ర మంత్రిగా ఉన్న గడ్కరీ స్వయంగా ఆ రహదారిని మంజూరు చేస్తున్నట్లు అక్కడే ప్రకటించారు.
ఇప్పుడు కూడా ఆయన అదే శాఖకు మంత్రిగా ఉన్నారు. చంద్రబాబు గారూ.. మీరు కేంద్రంలో అధికారంలో భాగస్వామిగా ఉన్నారు. ఇక్కడ కూడా అధికారంలో ఉన్నారు. కానీ రెండేళ్లు గడుస్తున్నా ఆ రహదారికి అతీగతీ లేదు. ఇప్పుడు భోగాపురం విమానాశ్రయానికి చేరుకోవాలంటే ప్రయాణికులు నరకయాతన పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదీ మీ చిత్తశుద్ధి! గతంలో అయినా అంతే.. ఇప్పుడైనా అంతే! పని చేయకుండా ప్రచారం చేసుకోవడం, కష్టపడకుండా కీర్తిని కొట్టేయడం, ఇతరుల కృషిని మీ ఖాతాలో వేసుకోవడం ఇకనైనా మానండి. దాదాపు 80 ఏళ్లు వస్తున్నాయి’’


