ఈ ఆర్థిక ఏడాది బాబు సర్కారు బడ్జెట్ అప్పులే రూ.1.04 లక్షల కోట్లు
22 నెలల్లో మొత్తం బడ్జెట్ అప్పులు రూ.1,86,164 కోట్లు
గ్యారెంటీ అప్పులు మరో రూ.1,51,057 కోట్లు
బాబు పాలనలో మొత్తం అప్పులు రూ.3,37,221 కోట్లు
సంపద సృష్టించకపోగా ఉన్న ఆస్తులే ఆవిరి..
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్‌గా మార్చేసిన సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. సంపద సృష్టించకపోగా ఉన్న సంపదనే ఆవిరి చేస్తూ తాజాగా మంగళవారం 7.88 శాతం వడ్డీతో మరో రూ.3,900 కోట్లు బడ్జెట్ అప్పులు చేశారు. దీంతో ఈ ఆర్థిక ఏడాది ఏకంగా రూ.1.04 లక్షల కోట్ల బడ్జెట్ అప్పులతో చరిత్ర సృష్టించారు. తాజా అప్పుతో 22 నెలల పాలనలో చంద్రబాబు బడ్జెట్‌లో చేసిన అప్పులు ఏకంగా రూ.1,86,164 కోట్లకు చేరాయి.
వివిధ కార్పొరేషన్లు, రాజధాని పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు మరో రూ.1,51,057 కోట్లకు ఎగబాకాయి. దీంతో బాబు పాలనలో మొత్తం అప్పులు రూ.3,37,221 కోట్లకు చేరాయి. దొరికిన చోటల్లా ఎడాపెడా అప్పులు చేయడమే నిత్య కృత్యంగా టీడీపీ కూటమి సర్కారు పాలన సాగుతోందని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇన్ని అప్పులు చేసినా కొత్తగా ప్రభుత్వ రంగంలో ఆస్తులు సృష్టించేందుకు పైసా వ్యయం చేయడం లేదు.


