విద్యుత్‌ రంగంపై డ్రాగన్‌ ఆగడాలకు చెక్‌

Central intelligence agencies have warned state power companies about China - Sakshi

చైనా పరికరాలపై ప్రత్యేక నిఘా 

సబ్‌ స్టేషన్లలో మాడ్యూల్స్‌ బ్లాక్‌ బాక్స్‌లను డీకోడ్‌ చేసే ప్రయత్నం 

రాష్ట్రంలోని 400 కేవీ సబ్‌ స్టేషన్లలోనూ తనిఖీలు 

క్షేత్రస్థాయి సమాచారంపై దృష్టి 

సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టే వ్యూహం 

విద్యుత్‌ ఉన్నతాధికారుల సమీక్ష 

సాక్షి, అమరావతి: చైనా కేంద్రంగా విద్యుత్‌ నెట్‌వర్క్‌పై సైబర్‌ దాడికి అవకాశాలున్నాయని రాష్ట్ర విద్యుత్‌ సంస్థలను కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో రాష్ట్ర విద్యుత్‌ శాఖ అప్రమత్తమైంది. ఈ వ్యవహారంపై ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి నేతృత్వంలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్, ట్రాన్స్‌కో, నెట్‌వర్క్‌ విభాగాల ఉన్నతాధికారులు తాజా పరిస్థితిపై చర్చించారు. విద్యుత్‌ సరఫరాలో కీలక భూమిక పోషిస్తున్న ఏపీ ట్రాన్స్‌కోకు చెందిన 400 కేవీ సబ్‌ స్టేషన్లలో సాంకేతిక అంశాలపై నిశితంగా దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గత ఏడాది ముంబై విద్యుత్‌ సంస్థలపై చైనా ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న హ్యాకింగ్‌ గ్రూప్‌లు సైబర్‌ అటాక్‌ చేశాయని, దీనివల్ల కొన్ని గంటల పాటు విద్యుత్‌ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని అమెరికాకు చెందిన ఓ సంస్థ అధ్యయనంలో వెల్లడించింది. కేంద్రానికి చెందిన పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (పీజీసీఎల్‌)తో విద్యుత్‌ సరఫరా వ్యవస్థ అనుసంధానమై ఉండటం వల్ల ఏపీలోనూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థతి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.  

ఏ తరహా దాడి జరగొచ్చు! 
రాష్ట్రంలో 400 కేవీ సబ్‌ స్టేషన్లు, లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ పూర్తిగా ఇంటర్నెట్‌తో అనుసంధానమై ఉన్నాయి. వీటిలో వాడే ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాలన్నీ ఎక్కువగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. ఇందులో వాడే సాఫ్ట్‌వేర్‌ మొత్తం  తయారీ సంస్థలకు తెలిసే వీలుంది. 400 కేవీ సబ్‌ స్టేషన్‌ను చైనా హ్యాకర్లు కమాండ్‌ ద్వారా నియంత్రించి విద్యుత్‌ సరఫరాను అడ్డుకునే వీలుంది. ఇదే జరిగితే పారిశ్రామిక, రైల్వే, వాణిజ్య వ్యవస్థలతో పాటు అత్యంత కీలకమైన వైద్య రంగానికి విద్యుత్‌ నిలిచిపోతుంది. సమాచార వ్యవస్థ కుప్పకూలి, గ్రిడ్‌ ఇబ్బందుల్లో పడుతుంది. దీనివల్ల పెద్దఎత్తున ఆర్ధిక నష్టం కలగడమే కాకుండా, గందరగోళానికి ఆస్కారం ఉంటుంది. 

కౌంటర్‌ అటాక్‌ 
సబ్‌ స్టేషన్లలో మాడ్యూల్స్‌ను నడిపించే సాఫ్ట్‌వేర్‌ భాష ఆయా ఉపకరణాల బ్లాక్‌ బాక్స్‌లో నిక్షిప్తమై ఉంటుంది. ఇది ఆంగ్లంలో ఉంటే తెలుసుకునే వీలుంటుంది. కానీ చైనా నుంచి దిగుమతి అయ్యే వాటిల్లో చైనా లిపినే వాడుతున్నారు. దీన్ని పూర్తిగా డీకోడ్‌ చేయడం సాధ్యం కావడం లేదని శ్రీకాంత్‌ నాగులాపల్లి చెబుతున్నారు. చైనా సాఫ్ట్‌వేర్‌ను వీలైనంత వరకూ డీకోడ్‌ చేయాలని అధికారులు ఆదేశించారు. మరీ కష్టంగా ఉన్న సబ్‌ స్టేషన్లలో ప్రత్యామ్నాయ సమాచార వ్యవస్థపై ఆధారపడాలని సూచించారు. కేంద్ర మార్గదర్శకాల నేపథ్యంలో గడచిన కొన్ని నెలలుగా చైనా నుంచి దిగుమతి అయ్యే ప్రతీ ఉపకరణాన్ని కేంద్ర సంస్థలు పరిశీలిస్తున్నాయి. అంతకు ముందు దిగుమతి చేసుకున్న ఉపకరణాలను నిశితంగా తనిఖీ చేసేందుకు ట్రాన్స్‌కో ఐటీ విభాగంతో ప్రత్యేక బృందాలను సిద్ధం చేశామని ట్రాన్స్‌ సీఎండీ శ్రీకాంత్‌ నాగులాపల్లి తెలిపారు. ఎస్‌ఎల్‌డీసీలోనూ ఐటీ పరంగా పటిష్టమైన తనిఖీ చేస్తున్నామని లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ ఇంజనీర్‌ భాస్కర్‌ తెలిపారు. సైబర్‌ నేరాలను ముందే పసిగట్టే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top