టీడీపీ, జనసేన తీరుపై జనం మండిపాటు

Cadre fires on TDP, Janasena Party policy - Sakshi

టీడీపీ, జనసేన గ్రామస్థాయి నాయకుల ఆవేదన 

ఎన్నికల్లో తప్పనిసరి పోటీ అంటూ అధిష్టానం ఇబ్బందులు

మీమాంసలో ఆయా పార్టీల శ్రేణులు

భీమవరం: పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో గ్రామాల్లో చర్చలు వేడెక్కుతున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం, జనసేన అధినాయకత్వం ఎన్నికలు ఏకగ్రీవం కాకూడదంటూ చేస్తున్న ప్రకటనలకు ఆయా పార్టీల గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు ఖంగుతింటున్నారు. సాధారణంగా గ్రామాల్లో పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, వర్గాలు, కుటుంబాలు, సంప్రదాయాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల వ్యవహారం నడుస్తుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ సానుభూతిపరులు సర్పంచ్‌గా ఎన్నికైతే ఆయా గ్రామాలకు ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు, గ్రామాభివృద్ధికి నిధులు పెద్ద మొత్తంలో మంజూరవుతాయని గ్రామీణ ప్రజలు భావిస్తున్నారు. దీంతో గ్రామాల్లో పార్టీలను పక్కన పెట్టి ఎన్నికలు ఏకగ్రీవం చేసేందుకు ఎక్కువగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో తెలుగుదేశం, జనసేన నాయకులు ఎన్నికలు ఏకగ్రీవం కాకూడదంటూ చేస్తున్న ప్రకటనలకు ఆయా పార్టీల గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు విస్తుపోతున్నారు.

కన్నెత్తి చూడలేదు
సాధారణ ఎన్నికలు జరిగి దాదాపు రెండేళ్లు కావస్తుండగా పార్టీ కోసం పనిచేసిన నాయకులను ఆయా పార్టీల పెద్దలు కనీసం ఇప్పటివరకు పట్టించుకోలేదని వాపోతున్నారు. నరసాపురం లోక్‌సభ స్థానానికి జనసేన అ భ్యర్థిగా పోటీచేసిన కొణిదెల నాగేంద్రబాబు, భీమవరం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన కొణిదెల పవన్‌కల్యాణ్‌ ఇంతవరకు జిల్లాను కన్నెత్తి చూడలేదంటున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో వ్యయప్రయాసల కోర్చి పార్టీ కోసం పనిచేస్తే ఎన్నికల అనంతరం తమను పట్టించుకున్న నాథుడే లేడని పార్టీ శ్రేణులు ఆవేదన చెందుతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కన్వీనర్లను నియమించినా వారెవరూ గ్రామాలను పట్టించుకోవ డం లేదని ఆరోపిస్తున్నారు. టీడీపీ, బీజేపీ అధినాయకు లు ఇచ్చిన పిలుపు సైతం గ్రామాల వరకు తీసుకువెళ్లకుండా తమ ఉనికిని
కాపాడుకోవడానికి కార్యక్రమాలు మమ అనిపిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాల్లో కార్యకర్తలు పార్టీ కోసం ఎలా పనిచేయాలని ప్రశ్నిస్తున్నారు.

అండగా ఉంటారా?
పంచాయతీ ఎన్నికల్లో పార్టీ కోసం ఎన్నికల బరిలో నిలిస్తే అండగా ఎవరుంటారని ఆయా పార్టీల గ్రామస్థాయి నాయకులు ప్రశ్నిస్తున్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసిన పల్లె ప్రజలంతా వైఎస్సార్‌ సీపీ వైపు ఎక్కువ మక్కువ చూపుతున్నారని అంటున్నారు. సాధారణ ఎన్నికల అనంతరం గ్రామాల్లో పార్టీ పటిష్టానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలంటూ అధిష్టానాలు ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసమని మదనపడుతున్నారు. పార్టీలకు అతీతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని అధినాయకులకు తెలిసినా కార్యకర్తలను బలిచేస్తారా అంటూ ధ్వజమెత్తుతున్నారు. పంచాయతీ ఎన్నికలు టీడీపీ, జనసేన నాయకులకు తలబొప్పికట్టే విధంగా తయారవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top