అసాధ్యమైన దానిపై భ్రమలు కల్పిస్తూ మోసం.. | Botsa Satyanarayana Fires on CM Chandrababu Over Amaravati Development | Sakshi
Sakshi News home page

అసాధ్యమైన దానిపై భ్రమలు కల్పిస్తూ మోసం..

Apr 5 2026 4:46 AM | Updated on Apr 5 2026 4:46 AM

Botsa Satyanarayana Fires on CM Chandrababu Over Amaravati Development

అమరావతి పేరుతో అంతులేని దోపిడీకి ప్లాన్‌

చదరపు అడుగుకి రూ.14 వేల ఖర్చు వెనుక మతలబు ఏమిటి?

మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతం బాగుపడాలన్న సూచనలో తప్పేంటి?:  శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ నిలదీత

సాక్షి, విశాఖపట్నం: అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం అంతులేని దోపిడీకి పాల్పడుతోందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమ­ర్శిం­చారు. అసాధ్యమైన దానిపై భ్రమ­లు కల్పిస్తూ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తన స్కామ్‌ల కోసం ఏ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు దెబ్బ తీస్తున్నా­రని విమర్శించారు. శనివారం విశాఖలో మీడియాతో ఆయన మాట్లా­డుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవు­తున్నా.. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. వైఫల్యా­లను కప్పి­పుచ్చుకునేందుకు.. డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే  అమరావతి చట్టం పేరుతో ప్రజలను మభ్యపెడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం భారీ దోపిడీకి తెరలేపిందని మండిపడ్డారు.

చంద్రబాబు లెక్కల ప్రకారమే అమరావతి ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్‌ వంటి సదుపా­యాలకు రూ.2 లక్షల కోట్ల­వుతుందని, ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని ఆయన ప్రశ్నించారు. రోడ్లకే ఎన్నో దశాబ్దాలు పడుతుంది.. ఇక మిగిలిన సదుపా­యాలెప్పుడు? రాజధాని నిర్మాణాలెప్పుడు?  రాష్ట్రా­నికి భారం కాని విధంగా అత్యంత వాస్తవిక దృక్పథంతోనే తాము విశాఖను రాజధానిగా ఎంపిక చేశా­మని, తక్కువ ఖర్చుతోనే గ్రోత్‌ ఇంజన్‌గా మారే అవకా­శమున్న విశాఖను కాదన్నారు సరే.. అలాంటి అవకాశాలున్న, రోడ్లు, పోర్టు, ఎయిర్‌­పోర్టు ఉన్న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకోవడానికి మీకు ఉన్న అభ్యంతరమేమిటని బొత్స ప్రశ్నించారు.  

ప్రత్యేక హోదాపై మౌనమెందుకు?
అమరావతిపై చట్టం చేశామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు విభజన హామీ అయిన ప్రత్యేక హోదాపై ఎందుకు తీర్మానం చేయలేదని బొత్స ప్రశ్నించారు. ‘ప్రత్యేక హోదా వస్తే ఇలాంటి అమరావతిలు పది వస్తాయి. విశాఖ వంటి నగ­రాలు అభివృద్ధి చెందుతాయి. ప్రత్యేక హోదా ముగి­సిన అధ్యాయమని చెప్పడం బాధ్యతారా­హిత్యం. ఈ నెలలో జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో అమరావతితో పాటు ప్రత్యేక హోదా బిల్లును కూడా ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలి’ అని డిమాండ్‌ చేశారు.

అమరావతి నిర్మాణాల్లో భారీ దోపిడీ
‘అమరావతి నిర్మాణాల్లో భారీ దోపిడీ జరుగుతోంది. చదరపు అడుగుకు రూ.నాలుగైదు వేలు ఖర్చయ్యే చోట రూ.14 వేలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు 5 శాతం పనులే చేశారు. ఇప్పుడు రెండేళ్లు పూర్తయినా ఎమ్మెల్యే క్వార్టర్లు, మంత్రులు, ఉద్యోగుల నివాస సముదా­యాలు, న్యాయమూర్తుల నివాసాలు, చివరకు కరకట్ట రోడ్డు కూడా పూర్తి చేయలేకపో­యారు. అమరా­వతి ఎప్పటికి పూర్తవుతుందనే దానికి ప్రభుత్వం సమాధా­నం చెప్పలేకపోతోంది. అమరావతిపై అసెంబ్లీలో తీర్మానం చేసిన కూటమి ప్రభుత్వం శాసనమండలిలో ఆ బిల్లును ఎందుకు ప్రవేశపెట్టలేదు? మండలిలో నిలదీస్తామనే భయంతోనే ప్రభుత్వం ఈ చీప్‌ ట్రిక్స్‌కు పాల్పడింది. రాజధాని పేరుతో ఎంత ఖర్చు చేశారు? కాంట్రాక్టర్లకు ఎంత అడ్వాన్స్‌ ఇచ్చారు? ఎంత పని జరిగింది? అన్న లెక్కలతో శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని బొత్స డిమాండ్‌ చేశారు. 

‘మావిగన్‌’ ప్రతిపాదనలో తప్పేంటి?
‘మా నాయకుడు వైఎస్‌ జగన్‌ అమరావతికి వ్యతిరే­కం కాదు. ఇప్పటికే రోడ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టు ఉన్న మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు (మావిగన్‌) ప్రాంతాన్ని ఎక్కువ ఖర్చు లేకుండానే రాజధానిగా అభివృద్ధి చేయవచ్చు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనేదే ఆయన ఆకాంక్ష. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమరావతి రైతులకు కౌలు డబ్బులు ఒక్కరోజు కూడా ఆపలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులకు చేసిన అదనపు మేలేంటో సమాధానం చెప్పాలి’ అని బొత్స డిమాండ్‌ చేశారు. ఆయన వెంట పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజినల్‌ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement