డిజి యాత్ర యాప్‌లో నమోదు... సేవలు ఇలా!

Biometric boarding system is ready at Vijayawada Airport - Sakshi

విజయవాడ ఎయిర్‌పోర్టులో బయోమెట్రిక్‌ బోర్డింగ్‌ సిస్టం సిద్ధం 

సెక్యూరిటీ చెక్, బోర్డింగ్‌ పాయింట్‌ల వద్ద ఇక వెయిటింగ్‌ ఉండదు

దేశీయ ప్రయాణికులు నేరుగా టెర్మినల్‌ లోపలికి వెళ్లే అవకాశం

కొనసాగుతున్న ట్రయల్‌ రన్‌ 

విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) నుంచి ప్రయాణం మరింత సులభతరం కానుంది. దేశీయ ప్రయాణాల కోసం ఇక టెర్మినల్‌లోని సెక్యూరిటీ చెక్, బోర్డింగ్‌ పాయింట్‌ల వద్ద వేచి చూడాల్సిన అవసరం ఉండదు. తమ ఫోన్‌ నుంచే బోర్డింగ్‌ పాస్‌ను స్కాన్‌ చేసి నేరుగా విమానాశ్రయంలోకి ప్రవేశించవచ్చు. ఇందుకోసం ఎయిర్‌పోర్టు ఆవరణలో కేంద్ర పౌర విమానయాన శాఖ ‘డిజి యాత్ర’ పేరుతో రూపొందించిన బయోమెట్రిక్‌ బోర్డింగ్‌ సిస్టం సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ తరహా సేవలు ఇప్పటికే న్యూఢిల్లీ, బెంగళూరు, వారణాసి విమానాశ్రయాల్లో వినియోగంలో ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి విజయవాడతో పాటు హైదరాబాద్, కోల్‌కతా, పూణే విమానాశ్రయాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే విజయవాడ విమానాశ్రయంలో డిజి యాత్ర కోసం నాలుగు కియోస్క్‌లను ఏర్పాటు చేసి ట్రయల్‌ రన్‌ కూడా ప్రారంభించారు.  

డిజి యాత్ర యాప్‌లో నమోదు... సేవలు ఇలా...  
► డిజి యాత్ర యాప్‌ను ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వినియోగదారులు ప్లే స్టోర్‌ నుంచి, ఐఫోన్‌ యూజర్లు యాప్‌ స్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.  

► ఆ యాప్‌లో వినియోగదారులు తమ పేరు, మొబైల్‌ నంబర్, ఈ–మెయిల్, చిరునామా, ఫొటో, ఆధార్‌ ఆధారిత ధ్రువీకరణపత్రం అప్‌లోడ్‌ చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత వినియోగదారునికి డిజి యాత్ర ఐడీ వస్తుంది. దానిని వినియోగదారులు నమోదు చేసుకోవాలి. 

► విమాన టికెట్‌ బుకింగ్‌ సమయంలో డిజి యాత్ర ఐడీని తప్పనిసరిగా నమోదు చేయాలి. విమాన ప్రయాణానికి సంబంధించి బోర్డింగ్‌ పాస్‌ను కూడా యాప్‌లో స్కాన్‌ చేయాలి. దీంతో ప్రయాణికుడి వివరాలు సదరు విమానాశ్రయానికి చేరుతాయి.  

► ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లిన తర్వాత టెర్మినల్‌ బయట ఈ–గేట్‌ వద్ద డిజి యాత్ర యాప్‌ను ఉపయోగించి బోర్డింగ్‌ పాస్‌ బార్‌కోడ్‌ను స్కాన్‌చేసి, ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ చేయించుకోవాలి. దీంతో విమానాశ్రయం నుంచి ప్రయాణికుల వ్యక్తిగత, ప్రయాణ వివరాలు సంబంధిత ఎయిర్‌లైన్స్‌ ఆన్‌లైన్‌లో ధ్రువీకరించుకుంటుంది. దీనివల్ల ప్రయాణికులు సెక్యూరిటీ చెక్‌ వద్ద గుర్తింపు కార్డు చూపించకుండానే, బోర్డింగ్‌ పాయింట్‌ల వద్ద నిరీక్షించకుండా సులభంగా ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌లోకి ప్రవేశించవచ్చు.

ట్రయల్‌ రన్‌ దశలో... 
ప్రస్తుతం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో డిజి యాత్ర బయోమెట్రిక్‌ బోర్డింగ్‌ సిస్టం ట్రయల్‌ రన్‌ దశలో ఉంది. బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు సంబంధించి డిజి యాత్రలో నమోదైనవారి వివరాలతో ఈ సిస్టం పనితీరును పర్యవేక్షిస్తున్నారు. దీనిపై ప్రయాణికులకు మరింత అవగాహన కలిగించేందుకు టెర్మినల్‌ ఆవరణలో డిజి యాత్ర యాప్‌కు సంబంధించిన స్కానర్లను కూడా ఏర్పాటు చేశారు. మార్చి నెల నుంచి పూర్తిస్థాయిలో డిజి యాత్రను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ఎయిర్‌పోర్ట్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top