బీసీ మహిళలకు సబ్‌ కోటా ఇవ్వాల్సిందే | Sakshi
Sakshi News home page

బీసీ మహిళలకు సబ్‌ కోటా ఇవ్వాల్సిందే

Published Fri, Sep 22 2023 5:54 AM

BC women should be given sub quota: RKrishnaiah - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  వెనుకబడిన వర్గాల సమస్యలు పరిష్కరించాలంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నా నినాదాలతో హోరెత్తింది. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్‌ కో­టా కల్పించినప్పుడే సామాజిక న్యాయం సాధ్య­మవుతుందని, లేకపోతే సమాజంలో మార్పు ఉండదని ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు.

మహిళా బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం దేశంలో 56 శాతం జనాభా ఉన్న బీసీల బతుకులు మార్చే బీసీ బిల్లును పార్లమెంటులో ఎందుకు ప్రవేశపెట్టడంలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా బీసీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేయాలని, పంచాయతీరాజ్‌ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 52 శాతానికి పెంచాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, డాక్టర్‌ ఎన్‌ మారేష్‌ల అధ్యక్షతన జరిగిన ఈ మహా­ధర్నాలో ఆర్‌.కృష్ణయ్యతో పాటు ఎంపీలు బీద మస్తాన్‌ రావు, బడుగుల లింగయ్య యా­దవ్‌ పాల్గొని తమ సంఘీభావం ప్రకటించారు.  ధర్నాలో జబ్బల శ్రీనివాస్, బత్తుల వెంకటర­మణ, పద్మలత, నీలం వెంకటేష్, భూపేష్‌ సాగర్, రాజ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement